Nalgonda Cement Factory: నల్గొండలో అదానీ మంటలు.. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎందుకీ రచ్చ
24 October 2024, 8:41 IST
- Nalgonda Cement Factory: వందల కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పాని నిర్ణయం జరిగిన ఒక పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది! నిరుద్యోగ సమస్యను కొంతైనా తగ్గించ వచ్చు. తమ పిల్లకు ఉద్యోగాలు వస్తాయి, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.
నల్గొండలో అదానీ గ్రూప్ ఏర్పాటు చేసే సిమెంట్ కంపెనీపై వివాదం
Nalgonda Cement Factory: ఉమ్మడి నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట లో అదాని గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ప్రజాభిప్రాయం కూడా సేకరించిన అంబుజా సిమెంట్స్ వివాదాస్పదం అవుతోంది. నల్లొండ జిల్లా పచ్చని పోలాల మధ్య అదాని మంటలు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 1400కోట్ల ప్లాంట్ తమకొద్దని నిరసన చెబుతున్నారు.
ఎందుకీ వివాదం..?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించాలని నాడు కొత్తగా ఏర్పాటైన టీఆర్ఎస్ ( ఇపుడు బీఆర్ఎస్ ) ప్రభుత్వం ఒక పాలసీని తీసుకుంది. తెలంగాణకు తీరప్రాంతం లేని కారణంగా ఏపీలోని క్రిష్ణా జిల్లా సరిహద్దుల్లోని కోదాడ, గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని దామరచర్ల, జాతీయ రహదారిని, బీబీనగర్ నడికుడి ప్రధాన రైల్వే లైను ఆనుకుని ఉన్న చిట్యాల లేదా రామన్నపేటల వద్ద డ్రైపోర్ట్ నిర్మించాలని తలపెట్టింది.
ఈ ప్రతిపాదనల్లో ఏవీ కార్యరూపం దాల్చకున్నా, రామన్నపేట మండల కేంద్రానికి సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణానికి అవసరమైన 365 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సేకరించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డ్రైపోర్ట్ ఏర్పాటు అంశం అటకెక్కింది.
కానీ, 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రామన్నపేట వద్ద సేకరించిన భూమిని అదాని గ్రూప్ కు కేటాయించింది. తొలి ప్రతిపాదన మేరకు ఇక్కడ డ్రైపోర్టును నిర్మించాల్సి ఉండగా, కాలుష్యానికి ప్రధాన కారణంగా పేరున్న సిమెంటు ఫ్యాక్టరీ (అంబుజా బ్రాండ్ సిమెంట్)ని 70 ఎకరాలలో నెలకొల్పాలని నిర్ణయించుకోవడంతో వివాదానికి కారణంగా కనిపిస్తోంది.
పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారాలా..?
డ్రైపోర్ట్ నిర్మాణమంటే తమ భూములు ఇచ్చామని, ఇపుడు సిమెంటు ఫ్యాక్టరీ అంటే ఎందుకు అంగీకరిస్తామని రామన్నపేట సమీప 12 గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రామన్నపేట మండలం పరిధిలోని 24 గ్రామపంచాయతీల్లో పన్నెండు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రభావితం అవుతున్నాయి.
తాజాగా తలపెట్టిన ఫ్యాక్టరీ మూసీ నదికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇప్పటికే మూసీ కాలుష్యంతో సతమతమవుతున్న రైతులు, పులిమీద పుట్రలా మరో ఫ్యాక్టరీ వెదజల్లె కాలుష్యాన్ని తట్టుకోవడానికి సిద్దంగా లేరు. ఈ కారణంగానే సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టగా ప్రజలు తిరగబడ్డారు.
బుధవారం రామన్నపేటలో ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగం, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ ఏర్పాటు కాకుండా చూస్తామని ఈ ప్రాంత రైతులకు మద్దతుగా వచ్చిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని అడ్డుకునేందుకు వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, రవీంద్ర కుమార్ లను హౌజ్ అరెస్ట్ చేశారు.
డ్రైపోర్ట్ స్థానంలో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదాని గ్రూప్ రామన్నపేట ప్రాంతంలో డ్రైపోర్టు నిర్మిస్తామని 2020లో భూసేకరణ చేసింది. కానీ, ఆ ప్రభుత్వ సమయంలో అడుగు ముందుకు పడలేదు. డ్రైపోర్ట్ నిర్మాణం అటకెక్కింది. కానీ, తాము సేకరించుకున్న భూమిని వినియోగించుకోవాలని కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది. అదాని చేతుల్లోకి వచ్చిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించుకుంది.
కానీ, ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతంలో సిమెంటు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు సున్నపు రాయి నిల్వలు లేవు. కానీ, ఇక్కడ తాము 6 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తామని అంబుజా పేర్కొంటోంది. నెల రోజుల కిందటే ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి గ్రామపంచాయతీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రామన్నపేటను ఆనుకుని ప్రధాన రైల్వే లైన్ ఉండడం వల్ల గూడ్స్ రైళ్ళ ద్వారా ముడి సరుకు తెచ్చుకుని మిక్సింగ్ ద్వారా సిమెంటును ఉత్పతి చేస్తామని అదాని గ్రూప్ నమ్మబలుకుతోంది.
రూ.100 కోట్ల విరాళం అందుకేనా..?
మరో వైపు రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాలు కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల అదాని రూ.100 కోట్ల విరాళం అందజేశారు. రామన్నపేట వద్ద పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూమిలో కనీసం 65 ఎకరాలు వాడుకుని సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే ఈ విరాళం ఇచ్చారన్న విమర్శలను ఈ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
రామన్నపేట, కొమ్మాయి గూడం ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న కాలుష్య కారక సిమెంటు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని, ఈ ప్రాంత ప్రజలు, రైతులకు మద్దుతుగా పోరాటాలు చేస్తామని చెబుతున్నాయి.
( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )