తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Road Accident: ఓటేయడానికి వెళుతూ యాక్సిడెంట్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, జనగామలో హైవేపై విషాదం

Road Accident: ఓటేయడానికి వెళుతూ యాక్సిడెంట్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, జనగామలో హైవేపై విషాదం

Sarath chandra.B HT Telugu

14 May 2024, 8:01 IST

google News
    • Road Accident: ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూరు బయల్దేరిన కుటుంబాన్ని ఆర్టీసీ బస్సు పొట్టనబెట్టుకుంది. రోడ్డు పక్కన టిఫిన్ చేస్తున్న వారిపైకి బస్సు దూసుకెళ్లడంతో  ఈ దుర్ఘటన జరిగింది. 
జనగామలో మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
జనగామలో మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

జనగామలో మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Road Accident: పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదానికి బలైంది. ఓటు వేయడానికి సొంతూరు వెళుతున్న దంపతులతో పాటు వారి ఎనిమిదేళ్ల వారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

జాతీయ రహదారి వెంట ఉన్న మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌‌ దగ్గర నిలబడి టిఫిన్ చేస్తుండగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు వారి ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిలో జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన తెలకలపల్లి రవీందర్‌, జ్యోతి దంపతులు హైదరాబాద్‌ బీబీనగర్‌లో నివాసం ఉంటున్నారు.

స్థానికంగా పాత సామగ్రి విక్రయించే స్క్రాప్ వ్యాపారం చేస్తున్నారు. గత నెలలో స్కూళ్లకు సెలవులివ్వడంతో పన్నెండేళ్ల కుమారుడిని వరంగల్‌లో ఉంటున్న రవీందర్‌ తల్లిదండ్రుల వద్దకు పంపారు. సోమవారం సొంతూరులో ఓటు వేసేందుకు రవీందర్‌, జ్యోతి దంపతులు.. కుమారుడు భవిష్‌తో కలిసి కలిసి స్కూటీపై బీబీనగర్‌ నుంచి వరంగల్‌ బయల్దేరారు.

ఉదయం రఘునాథపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌‌లో టిఫిన్ తినడానికి ఆగారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న వరంగల్‌-1 ఆర్టీసీ డిపోకు చెందిన రాజధాని బస్సు అదుపు తప్పింది. ముందు వెళ్లే వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్‌ ముందున్న వారిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రవీందర్‌ జనగామ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు. వారి చిన్న కుమారుడు భవిష్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చనిపోయాడు. ప్రమాదంలో టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకులు నునావత్‌ నవీన్‌, శ్రీకాంత్‌, రాకేశ్‌‌తో పాటు మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జనగామ పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం