Medaram Jatara: మేడారం బెల్లం మొక్కులకు ఆబ్కారీ ఆంక్షలు.. కొనాలంటే ఆధార్ తప్పనిసరి…
05 February 2024, 11:26 IST
- Medaram Jatara: మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునే ఎత్తు బంగారంపై ఆబ్కారీ శాఖ ఆంక్షలు విధించింది. వనదేవతల భక్తుల కోసం బెల్లం తీసుకొస్తున్న వ్యాపారులు.. ఆ తరువాత దారి మళ్లిస్తున్నారనే కారణంతో ఈ సారి బెల్లం కొనాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు.
మేడారం జాతరలో బెల్లం కొనుగోలుపై ఆంక్షలు
Medaram Jatara: మేడారం జాతరలో బెల్లం కొనుగోలు చేసే వారి నుంచి ఆధార్ (Adhrar) కార్డు జిరాక్స్ తప్పనిసరిగా సేకరించాలని ఎక్సైజ్ Excise శాఖ రూల్ పెట్టింది. ఆధార్ కార్డుతో పాటుగా బెల్లం కొనుగోలు చేసే వారి ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్, బెల్లం jaggery ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే కారణాలు తప్పనిసరిగా తెలియజేస్తూ ప్రతి రోజు పూర్తి వివరాలతో ఎక్కడికక్కడ జిల్లా అధికారులకు రిపోర్ట్ పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు బెల్లం వ్యాపారులకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత జాతర సమయం నుంచే ఈ నిబంధన అమలు చేస్తుండగా.. ఫిబ్రవరి 21 నుంచి జాతర జరగనున్న నేపథ్యంలో ఆబ్కారీశాఖ మరోసారి ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
టన్నులకొద్దీ వ్యాపారం
ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ బీట్ బజార్ బెల్లం బిజినెస్ కు అడ్డాగా మారింది. ఇక్కడ తొమ్మిది మంది బెల్లం హోల్ సేల్ వ్యాపారులు ఉండగా అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు హోల్ సేల్, రిటైల్ అమ్మకాలు జరుపుతుంటారు.
సాధారణ రోజుల్లో నెలకు 10 టన్నుల వరకు బిజినెస్ నడుస్తుంటుంది. ఇక మేడారం జాతర సమయంలో మాత్రం నెలకు 40 నుంచి 50 టన్నుల వరకు వ్యాపారం జరుగుతుంటుంది.
ఇక్కడికి ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి ఇక్కడికి బెల్లం రవాణా అవుతుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మేడారం జాతర పేరున దాదాపు వెయ్యి టన్నుల వరకు బెల్లం బిజినెస్ నడుస్తుందని అంచనా.
గుడుంబాకు తరలుతోందనే ఆరోపణలు
ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా.. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని చాలాచోట్లా మినీ మేడారంగా సమ్మక్క సారలమ్మ జాతరలు జరగనున్నాయి.
రెండేండ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు ఎత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించి మొక్కులు తీర్చుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఇదిలాఉంటే సమ్మక్క బెల్లం మాటున కొందరు వ్యాపారులు దందా చేస్తున్నారు.
జాతర సమీపిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బెల్లం తీసుకువస్తూ ఎక్కడికక్కడ హోల్ సేల్ దుకాణాలు ఏర్పాటు చేసి దందా మొదలుపెట్టారు. అక్కడి నుంచి కొంత బెల్లం సమ్మక్క మొక్కులకు ఎత్తు బంగారంగా, మరికొంత గుడుంబా తయారీకి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కొన్నిచోట్ల బెల్లం పట్టుబడిన ఘటనలు కూడా దందాకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. డిసెంబర్ 25న నర్సంపేట–నెక్కొండ దారిలో అమీన్ పేట వద్ద 15 క్వింటాళ్ల బెల్లం పోలీసులు పట్టుకున్నారు. జనవరి 9న దంతాలపల్లి లో 30 క్వింటాళ్ల బెల్లం, 50 కిలోల పటిక, 10వ తేదీన మరిపెడ మండల కేంద్రంలో 17 క్వింటాళ్ల బెల్లం పోలీసులు పట్టుకున్నారు.
జనవరి 23న నర్సింహులపేట మండలం వంతడపల స్టేజీ వద్ద కూడా 20 క్వింటాళ్ల బెల్లం పట్టుబడింది. ఇలా విచ్చలవిడిగా బెల్లం దందా జరుగుతుండటం వల్లే ఆబ్కారీ శాఖ ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అందుకే ఆధార్ తప్పనిసరి!
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మినీ జాతర్లు జరగనుండగా.. అంతటా సమ్మక్క–సారలమ్మలకు మొక్కుగా ఎత్తు బంగారాన్ని సమర్పిస్తుంటారు. దీంతోనే ఈ నెల రోజులపాటు బెల్లానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కిరాణాషాపులు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మార్టులు కూడా బెల్లం విక్రయాలు మొదలుపెట్టాయి. అక్కడి నుంచి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండటం వల్లే ఆబ్కారీశాఖ బెల్లం విక్రయాలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు బెల్లం దందా చేసే వ్యాపారులందరికీ ఈపాటికే సమాచారం చేరవేసి, ప్రతిరోజు ఎన్ని క్వింటాళ్ల బెల్లం అమ్ముతున్నారు..? కొనుగోలు చేసినవారి ఆధార్ కార్డు వివరాలు, ఫోన్ నెంబర్, వారు ఏ అవసరం కోసం బెల్లం కొనుగోలు చేస్తున్నారనే ప్రొఫార్మలో వివరాలు అందించేలా వ్యాపారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు గత జాతర నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.
నిబంధన ఎత్తివేయాలని డిమాండ్
మేడారం సమ్మక్క-సారలమ్మకు భక్తులు సమర్పించే ఎత్తు బంగారంపై ఆధార్ కార్డు జిరాక్స్‌లు సమర్పించాలనే నిబంధనను ఎత్తివేయాలని ములుగు జిల్లా సామాజికవేత్త సుతారి సతీశ్ డిమాండ్ చేశారు.
బెల్లం పక్కదారి పట్టకుండా కొనుగోలుదారుల నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశించడం భక్తులను జాతరకు దూరం చేయడమే అవుతుందన్నారు.
భక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి జీవితాలకు ఆటంకం కలిగించడం సరైంది కాదని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు నిలిపివేసి పక్కదారి పట్టే బెల్లంపై నిఘా పెట్టాలని కోరారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)