Hyderabad Crime : చంపాపేటలో గొంతుకోసి యువతి హత్య - మిస్టరీగా మారిన కేసు, తెరపైకి కీలక విషయాలు!
29 October 2023, 7:02 IST
- Champapet Murder Case: హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది.ఓ యువతి గొంతుకోసి హత్య చేయగా… ఆమెను వివాహం చేసుకున్న యువకుడు బిల్డింగ్ పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడటం సంచలనంగా మారింది. ఈ మిస్టరీ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
చంపాపేటలో దారుణం
Hyderabad Crime News: హైదరాబాద్ లో చంపాపేట్ లో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే ఓ యువతి దారుణ హత్యకు గురైంది.అనంతరం ఓ యువకుడు రెండో అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.ఈ రెండు సంఘటనలతో ఆ ప్రాంతం ఉలిక్కి పడింది.
అసలేం జరిగిందంటే…
స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వప్న (21), హన్మంతు గత కొన్ని నెలలుగా చంపాపేట ఎన్టీఆర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.అయితే వీరు తీసుకునే సమయంలో వీరిద్దరూ అన్నా చెల్లెలుగా చెప్పి రూం తీసుకున్నారు.కాగా నెల రోజుల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే స్వప్న గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటుండగా హన్మంతు అప్పుడపుడు స్వప్న వద్దకు వచ్చేవాడు.ఈ క్రమంలోనే శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్వప్న, హన్మంతు నివసించే ఇంట్లో నుండి పెద్ద శబ్దం రావడంతో ఇంటి యజమాని లోపలకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో స్వప్న మృతి చెంది ఉన్న దృశ్యాలను చూసి యజమాని పోలీసులకు సమాచారం అందించగా అప్పటికే హన్మంతు కూడా రక్తపు మడుగులో ఇంటి ముందుపడిపోయి ఉన్నాడు. అది గమనించిన ఇంటి యజమాని 108 కు సమాచారం అందించగా హన్మంతును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
యువతి గొంతు కోసి దారుణ హత్య
ఇదిలా ఉండగా స్వప్న హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.దర్యాప్తు క్రమంలో స్వప్న ఇంట్లో నుంచి ఇద్దరు యువకులు వేగంగా పరుగులు తీస్తూ ఉండడం తాము చూశామని స్థానికులు చెప్పగా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరూ యువకులు స్వప్న ఇంట్లోకి ప్రవేశించిన్నట్లుగా గుర్తించారు.అయితే తమ ప్రాథమిక విచారణలో స్వప్నకి వేరే అబ్బాయితో పరిచయం ఉందని పోలీసులు గుర్తించారు.అయితే స్వప్న హత్య కు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.హన్మంతు ఇంట్లో లేని సమయంలో స్వప్న ప్రియుడు ఇంట్లోకి ప్రవేశించి స్వప్న గొంతు కోసి హత్య చేసి అదే క్రమంలో వచ్చిన హన్మంతు ను రెండో అంతస్తు నుంచి తోసేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు,హత్య చేసిన నిందితుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం స్వప్న మృతి దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా స్థానికులను పోలీసులు కోరారు.