Nalgonda : మిర్యాలగూడలో విషాదం - రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య
31 December 2023, 12:15 IST
- Nalgonda Latest News: మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మిర్యాలగూడలో విషాదం
Nalgonda Latest News: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి యువకుడు, యువతి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని ప్రేమ జంటగా భావిస్తున్నారు పోలీసులు. మృతులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదం….
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేగొండ మండలం భాగిర్తిపేట మూల మలుపు సమీపంలో ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, డిసిఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఎంజీఎంలో విషాదం
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా చెప్పుకునే వరంగల్ ఎంజీఎంలో దారుణం జరిగింది. ఆసుపత్రిని కరెంట్ కష్టాలు వెంటాడుతుండగా.. వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ కు కరెంట్ ప్రాబ్లమ్ తో సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆసుపత్రిలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఆసుపత్రిని గత సాయంత్రం నుంచి కరెంట్ కష్టాలు తిప్పలు పెడుతుండటంతో ఆ ప్రభావం పేషెంట్లపై పడుతుంది. అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ ఎంజీఎంలోని ట్రాన్స్ఫార్మర్ పై శుక్రవారం రాత్రి కోతుల దూకడంతో కరెంట్ వైర్లు ఒకదానినొకటి టచ్ అయి షాట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోగా.. ఎంజీఎం ఆసుపత్రికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ వార్డులతో పాటు ఏఎంసీ, సర్జికల్ వార్డుల్లో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. అప్పటికే వెంటిలేటర్ల మీద కొంతమంది పేషెంట్లు ఉండగా.. పవర్ ప్రాబ్లం వల్ల అవన్నీ ఆగిపోయాయి. వాస్తవానికి ఇలా విద్యుత్తు సరఫరాకు అంతరాయం తలెత్తినప్పుడు బ్యాకప్ కోసం వెంటిలేటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. ఆసుపత్రిలో జనరేటర్లు కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఆసుపత్రిలో జనరేటర్లు పనిచేయకపోవడం, వెంటిలేటర్లకు యూపీసీ సదుపాయం లేకపోవడంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్న కొంతమంది పేషెంట్లను పక్క వార్డులకు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ విషయం తెలుసుకుని వెంటనే ఆర్ఎంవోలతో పాటు ఇతర సిబ్బందిని అలర్ట్ చేశారు. దీంతో ఎన్పీడీసీఎల్ ఆఫీసర్లు శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్యలు చేపట్టి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. అయినా కొన్ని వార్డుల్లో కేబుల్స్ కాలిపోవడంతో శనివారం ఉదయం వరకు వరంగల్ ఎంజీఎం వార్డుల్లో కరెంట్ కష్టాలు తప్పలేదు.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో రెండు రోజుల కిందట నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బొజ్జ భిక్షపతి(45) శ్వాస సంబంధిత వ్యాధితో అడ్మిట్ అయ్యారు. ఆర్ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. శుక్రవారం రాత్రి 11 గంటల సుమారులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అప్పటికే వెంటిలేటర్ పై ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తుండగా.. కరెంట్ సమస్య వల్ల ఆ మెషీన్ కాస్త ఆఫ్ అయ్యింది. దీంతో ఆయనను వేరే వార్డుకు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో శనివారం ఉదయం భిక్షపతి ప్రాణాలు విడిచారు. కాగా విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయకపోవడం వల్లే ఆయన మరణించాడనే ప్రచారం జోరుగా జరిగింది. కాగా వెంటిలేటర్ ఆక్సిజన్ అందక భిక్షపతి ప్రాణాలు కోల్పోయాడనే విషయంలో వాస్తవం లేదని ఎంజీఎం డాక్టర్లు కొట్టి పారేశారు. పేదలు చికిత్స పొందే ఆసుపత్రిపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. కాగా ఆసుపత్రిలో తరచూ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేషెంట్ల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.