తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : అగ్గిపెట్టె కోసం గొడవ - ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Warangal : అగ్గిపెట్టె కోసం గొడవ - ప్రాణాలు కోల్పోయిన యువకుడు

HT Telugu Desk HT Telugu

19 January 2024, 16:12 IST

google News
    • Matchbox Fight in Warangal : అగ్గిపెట్టె కోసం జరిగిన గొడవలో ఓ యువకుడి ప్రాణాలు పోయాయి. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అగ్గిపెట్టె కోసం గొడవ
అగ్గిపెట్టె కోసం గొడవ

అగ్గిపెట్టె కోసం గొడవ

Matchbox Fight in Warangal : అగ్గిపెట్టె విషయంలో తలెత్తిన గొడవ యువకుడి ప్రాణం తీసింది. రెండు గ్యాంగుల మధ్య ఫైటింగ్​ జరగగా.. ఓ యువకుడిపై కర్రతో దాడికి దిగడంతో తీవ్ర గాయాలపాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ రోజే ఈ ఘటన జరగగా.. యువకుడు మరణించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. పర్వతగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన బేతి రాంచరణ్​(17) ఇంటర్​ చదువుతున్నాడు. కొద్దిరోజుల కిందట సంక్రాంతి పండుగ కోసం తన పెద్దమ్మ ఇల్లు అయిన రాయపర్తి మండలం కొలన్​ పల్లి గ్రామానికి వచ్చాడు. ఈ నెల 15న సంక్రాంతి పండుగ సందర్భంగా తమ బంధువులతో పాటు వెళ్లి సాయంత్రంపూట కల్లు తాగారు. అదే సమయంలో అక్కడ మద్యం తాగేందుకు అదే గ్రామానికి చెందిన మరో గ్యాంగ్​ కూడా వచ్చింది. ఇదిలాఉంటే రాంచరణ్​ తో పాటు ఉన్న ఓ వ్యక్తి అవతలి గ్యాంగ్​ వద్దకు వెళ్లి అగ్గిపెట్టె అడిగాడు. దీంతో ఆ గ్యాంగ్​ లో ఉన్న ఇంకో వ్యక్తి వాళ్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే రాంచరణ్​ వైపు ఉన్న వ్యక్తుల్లో ఒకరు అవతలి గ్యాంగ్​ కు సంబంధించిన వ్యక్తిని కూలం పేరుతో ధూషించగా.. గొడవ కాస్త పెరిగిపోయింది. మాటామాటా పెరిగి చివరకు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే గొడవ పెద్దది కావడంతో రాంచరణ్​తో పాటు అతని వెంట ఉన్నవాళ్లంతా పరుగెత్తుతుండగా.. అవతలి వైపు ఉన్న ఓ వ్యక్తి పరుగెత్తుతున్న రాంచరణ్​ తలపై కర్రతో బలంగా కొట్టాడు.

మద్యం మత్తులో పడిపోయాడనుకుని..

తలపై కర్రతో బలంగా కొట్టడంతో రాంచరణ్​ అక్కడే కుప్పకూలాడు. మిగతా వాళ్లంతా ఇళ్లకు పరుగులు తీయగా.. రాంచరణ్​ రోడ్డుపైనే పడి ఉన్నాడు. దీంతో గమనించిన స్థానికులు రాంచరణ్​ పెద్దమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారంతా మద్యం మత్తులో పడిపోయాడనుకున్నారు. అలాగే ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టారు. తెల్లవారినా రాంచరణ్​ లేవకపోవడం, ఒళ్లంతా కాలిపోతుండటంతో వెంటనే అతని తండ్రి వెంకటేష్​కు సమాచారం అందించారు. దీంతో ఆయన వచ్చి బైక్​ పై హాస్పిటల్​కు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరాడు. తలపై కర్ర దెబ్బతగిలినా రక్త స్రావం జరగక.. ఆ భాగంగా వాచిపోయి కనిపించింది. దీంతో కంగారు పడిపోయిన తండ్రి వెంకటేష్​ వెంటనే అంబులెన్స్​ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్మిట్​ చేసుకున్న డాక్టర్లు మెదడులో రక్తం గడ్డకట్టిన విషయం చెప్పి, హైదరాబాద్​ నిమ్స్​కు తీసుకెళ్లాల్సిందిగా రిఫర్​ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెంటనే నిమ్స్​ కు తరలించగా.. అక్కడి డాక్టర్లు ఆపరేషన్​ కూడా చేశారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి రాంచరణ్​ ప్రాణాలు కోల్పోయాడు.

గ్రామంలో తీవ్ర విషాదం

బేతి వెంకటేశ్​–శోభ దంపతులకు రాంచరణ్​ ఒక్కడే కొడుకు. పెళ్లి అయిన చాలా సంవత్సరాలకు రాంచరణ్ పుట్టగా.. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచారు. ప్రస్తుతం హనుమకొండలోని ఓ కాలేజీలో ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ చదువుతున్న రాంచరణ్​ అర్ధంతరంగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అందరితోనూ ఆప్యాయంగా ఉండే ఆ కుటుంబంలో అనూహ్య ఘటన తీవ్ర శోకాన్ని నింపగా.. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలాఉంటే మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు రాయపర్తి ఎస్సై విజయ్ కుమార్ వివరించారు.

రిపోర్టింగ్ - వరంగల్ జిల్లా ప్రతినిధి

తదుపరి వ్యాసం