Janagama District : పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు సూసైడ్ అటెంప్ట్..! ఎస్సైతో పాటు కానిస్టేబుల్ కు గాయాలు
18 October 2024, 19:29 IST
- పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఈ ఘటనలో ఎస్సైతో పాటు కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో చోటు చేసుకుంది. ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా అక్కడ పని చేస్తున్న సిబ్బంది షాక్ కు గురైంది.
జనగామ జిల్లాలో యువకుడు సూసైడ్ అటెంప్ట్
తన కుటుంబ సమస్యపై మూడు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు తనకు న్యాయం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీంతో అడ్డుకోబోయిన ఎస్సైతో పాటు మరో కానిస్టేబుల్ కు కాలిన గాయాలయ్యాయి.
గమనించిన మిగతా పోలీస్ సిబ్బంది ముగ్గురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరగగా.. హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా అక్కడ అలజడి చెలరేగింది. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….
పాలకుర్తి మండలం కొండాపురం పరిధి మేకలతండాకు చెందిన లకావత్ శ్రీనుకు అదే మండలంలోని నర్సింగాపురం తండాకు చెందిన రాధికతో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. కొద్దిరోజుల వరకు కాపురం సజావుగానే సాగగా.. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తరచూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాధిక గర్భం దాల్చగా.. ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
పట్టించుకోవడం లేదని…..
రాధిక, ఆమె కుటుంబ సభ్యులతో గొడవల నేపథ్యంలో కొద్దిరోజుల కిందట శ్రీను పాలకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదిలాఉంటే రెండు రోజుల కిందట కూడా శ్రీను తన అత్తగారి ఇల్లయిన నర్సింగాపురం తండాకు వెళ్లి తన భార్య రాధికతో గొడవ పడ్డాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో రాధిక తన భర్త శ్రీనుపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ విషయమై శుక్రవారం పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. కాగా తన కంప్లైంట్ పై స్పందించని పోలీసులు, తన భార్య ఇచ్చిన ఫిర్యాదుకు తనను స్టేషన్ పిలిపించడం పట్ల శ్రీను అసంతృప్తికి లోనయ్యాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ముందస్తు ప్లాన్ లో భాగంగా పెట్రోల్ బాటిల్ తోనే స్టేషన్ లోపలికి వెళ్లాడు. స్థానిక పోలీసుల తీరుతో తనకు న్యాయం జరగడం లేదని బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ తన ఒంటిపై పోసుకున్నాడు. అది గమనించిన స్థానిక ఎస్సై సాయి ప్రసన్న కుమార్, కానిస్టేబుల్ రవీందర్ వెంటనే అతడిని పట్టుకునేందుకు పరుగెత్తారు. అతడిని పట్టుకుని వారిస్తున్న క్రమంలోనే శ్రీను తన జేబులో ఉన్న లైటర్ ను వెలిగించాడు. దీంతో పెట్రోల్ కు మంటలు అంటుకుని.. శ్రీనుతో పాటు ఎస్సై సాయి ప్రసన్న, కానిస్టేబుల్ రవీందర్ ను చుట్టుముట్టాయి.
ఈ ఘటనలో శ్రీను శరీరం 70 శాతం వరకు కాలిపోగా.. కానిస్టేబుల్ రవీందర్, ఎస్సై సాయి ప్రసన్నకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనూహ్య ఘటనతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర దుమారం లేవగా.. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.