HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : 'భారతీయుడు 2' చూస్తుండగా యువకుడిపై కత్తితో దాడి..! పరుగులు పెట్టిన ప్రేక్షకులు

Warangal : 'భారతీయుడు 2' చూస్తుండగా యువకుడిపై కత్తితో దాడి..! పరుగులు పెట్టిన ప్రేక్షకులు

HT Telugu Desk HT Telugu

13 July 2024, 9:18 IST

    • Warangal Crime News : ఓ యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వర్దన్నపేటలోని ఓ సినిమా థియేటర్ లో జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు….దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన విజయ్
గాయపడిన విజయ్

గాయపడిన విజయ్

Warangal Crime News : వరంగల్ లో ప్రేమోన్మాది జంట హత్య ఘటన మరువక ముందే మరో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. భారతీయుడు–2 సినిమా చూస్తుండగా ఓ యువకుడు మరో యువకుడిపై వెనుక నుంచి దాడి చేశాడు. దీంతో బాధిత యువకుడికి తీవ్ర గాయాలై రక్త స్రావం జరగగా అతని స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

వరంగల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎస్వీఎస్ సినిమాస్ అనే థియేటర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కళ్లెం విజయ్ కొన్ని నెలలుగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. వర్ధన్నపేటలో ఉన్న పాత ఇనుప సామాను దుకాణంలో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఊర కృష్ణ అనే యువకుడు కూడా ఇదే పని చేసేవాడు. ఇంతవరకు బాగానే ఉండగా, కొద్ది రోజుల క్రితం విజయ్ ఇల్లందలోని తన ఇంటి సమీపంలో ఉన్న కృష్ణ కూతురును వేధింపులకు గురి చేశాడు. దీంతో ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి విజయ్ కి జరిమానా విధించారు. అంతటితో ఆ వివాదం సమసిపోయింది!

అప్పటిదాకా కలిసి మెలిసి..

శుక్రవారం విజయ్, కృష్ణ కుటుంబాలతో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ఇంకొన్ని కుటుంబాలన్నీ కలిసి వన భోజనాల నిమిత్తం బయటకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి విందు చేసుకున్నారు. మద్యం తాగిన అనంతరం వర్ధన్నపేట ఎస్వీఎస్ సినిమాస్ అనే థియేటర్ లో భారతీయుడు–2 సినిమా నడుస్తుండగా, అది చూద్దామని విజయ్, కృష్ణతో పాటు ఇంకొంతమంది వారి బంధువులు కలిసి సినిమాకు వెళ్లారు. 

సాయంత్రం ఆరు గంటలకు ఫస్ట్ షో మొదలు కాగా, ముందస్తు ప్లాన్ ప్రకారం తనతో కత్తి తెచ్చుకున్న కృష్ణ.. విజయ్ పై దాడికి దిగాడు. కడుపు, వెన్ను భాగంలో మూడు సార్లు పొడిచాడు. దీంతో గమనించి అడ్డుకోవడానికి వచ్చిన గుర్రం రాజు అనే మరో యువకుడిపైనా దాడి చేశాడు. ఓ వైపు కత్తి పోట్లతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగుగా మారగా, గమనించి తోటి ప్రేక్షకులు పరుగు అందుకున్నారు. 

విజయ్ కి తీవ్ర గాయాలు కాగా, ఆయన వెంట వచ్చిన స్నేహితులు వెంటనే వర్ధన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా రిఫర్ చేశారు. దీంతో విజయ్ కుటుంబ సభ్యులు ఎంజీఎం తీసుకెళ్లగా, అక్కడ ఆర్ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

గ్రామంలో మరికొందరిపైనా దాడి

విజయ్ పై దాడి చేసిన కృష్ణ నేరుగా ఇల్లంద గ్రామానికి వెళ్లాడు. అక్కడ కొందరు విజయ్ బంధువులు కనిపించగా వారిపైనా కత్తి దూశాడు. దీంతో వారు తప్పించుకుని, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీఐ సూర్యా ప్రకాశ్, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, రాజ్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా మద్యం మత్తులో సైకోగా మారిన కృష్ణను ఇల్లంద శివారులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్