School boy Invention: పేటెంట్ సాధించిన స్కూల్ విద్యార్ధి యాంత్రిక ఆవిష్కరణ
03 October 2023, 9:41 IST
- School boy Invention: తండ్రి కష్టాన్ని చూడలేక అధ్భుతమైన వ్యవసాయ ఉపకరణ యంత్రాన్ని ఆవిష్కరించిన ఎనిమిది తరగతి చదివే బాలుడు ఆవిష్కరించాడు. ప్రభుత్వ పాఠశాల స్థాయిలో పేటెంట్ సైతం పొందాడు. సిరిసిల్లకు చెందిన విద్యార్థి ప్యాడీ ఫిల్లింగ్ యంత్రాన్ని కనుగొని రైతుల కష్టాలను తీర్చాడు.
ధాన్యం నింపే యంత్రాన్ని రూపొందించిన సిరిసిల్ల విద్యార్ధి
School boy Invention: ఆరు గాలం శ్రమించి వరిధాన్యాన్ని కుప్పగా పోసి, ధాన్యం ఆరిన తర్వాత బస్తాలకెత్తే సమయంలో అన్నదాతలు పడుతోన్న కష్టం ఆ చిన్న హృదయాన్ని కదిలించాయి..తన తండ్రి రైతుగా పడుతున్న కష్టాన్ని చూడలేక తండ్రి కోసం ప్యాడీ ఫిల్లింగ్ యంత్రాన్ని కనుగొన్నాడు.చిన్న తనంలో పేటెంట్ హక్కులు కూడా పొంది ఔరా అనిపిస్తున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేటకు చెందిన మర్రిపల్లి లక్ష్మీరాజం, రాజమ్మ దంపతుల కుమారుడు అభిషేక్ ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో అధ్భుతాలు సృష్టించారు. లక్ష్మీరాజం ఊర్లోనే వ్యవసాయం చేస్తుండగా, తండ్రితో పాటు పొలం పనులకు వెళ్లడం,తన తండ్రి చేస్తున్న పనులను నిశితంగా పరిశీలిస్తున్న అభిషేక్ కు ఆరబోసిన ధాన్యం సంచుల్లోకి నింపేటప్పుడు తన తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించాడు.
ధాన్యం సంచుల్లోకి నింపడానికి ప్రత్యేక యంత్రాన్ని కనుగొనడానికి అహర్నిశలు కృషిచేసి యంత్రానికి రూపకల్పన చేసాడు. 2019లో హన్మాజీ పేట జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో ఆ యంత్రాన్ని పాఠశాలలో ప్రదర్శించి అందరి అభినందనలు దక్కించుకున్నాడు.
తెలంగాణా రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అయిన అభిషేక్ తన ప్యాడీ ఫిల్లింగ్ యంత్రానికి పేటెంట్ హక్కులు పొందారు. పాఠశాల స్థాయిలో ప్రదర్శనల్లో ఔరా అనిపించుకున్న అభిషేక్ 2019లో జిల్లా స్థాయి ఇన్ స్పైర్ ఎగ్జిబిషన్ లో మొదటి బహుమతిని గెలుచుకున్నారు.
అనంతరం వరంగల్ జిల్లాలోని మడికొండలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ లో అవార్డు దక్కించుకుని జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. ఢిల్లీలోని ఐఐఐటీలో జరిగిన జాతీయ ప్రదర్శనలో ఈ యంత్రం మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న అభిషేక్ తాను తయారు చేసిన యంత్రాన్ని జపాన్ లో నిర్వహించపడే సాకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌కు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఎంపికయ్యాడు.పెటెంట్ హక్కు పొందడంతో పాటు అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైన అభిషేక్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందించారు.
రిపోర్టర్ గోపికృష్ణ ,కరీంనగర్