Nerella Sarada: నేరెళ్ల శారదకు దక్కిన అరుదైన గౌరవం, ఛైర్‌పర్సన్ హోదాలో జెండా వందనం
16 August 2024, 7:13 IST
- Nerella Sarada: కార్యకర్త నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేరెళ్ళ శారద అంటే తెలియని వారు ఉండరు. కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎదిగిన శారద కు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం లభించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఛైర్‌పర్సన్‌గా జాతీయ పతకావిష్కరణ చేశారు.
జాతీయ పతకావిష్కరణలో నేరెళ్ల శారద
Nerella Sarada: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద అరుదైన అవకాశాన్ని దక్కించుకుని మరో మెట్టును అధిగమించి అందరి దృష్టిని ఆకర్షించారు. చట్టసభల్లో ప్రజాప్రతినిధి కాకపోయినా మహిళా చైర్ పర్సన్ హోదాలో శారదకు ఈ అవకాశం దక్కడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లాల విభజనకు ముందు ఆయా జిల్లాల మంత్రులే స్వాతంత్య్ర దినోత్సవం రోజున అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేసేవారు. జిల్లాల విభజనతో పెరిగిన సంఖ్యకు అనుగుణంగా మంత్రులు లేకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యామ్నయంగా ఇతర ప్రజాప్రతినిధులకు ఆ బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రులు, ప్రభుత్వ విప్ లు అధికంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో జాతీయ పతకాలను ఎగురవేస్తూ వచ్చారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ పతాకావిష్కరణ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారుల్లో ఆసక్తి నెలకొంది.
సీఎం రేవంత్ రెడ్డి చివరకు 32 జిల్లాలకు అధికారికంగా జాతీయ పతాకావిష్కరణ జరిపే నేతల జాబితాను ప్రకటించారు. కరీంనగర్, జగత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మన్ కుమార్, ఆది శ్రీనివాస్ లకు అవకాశం కల్పించగా... పెద్దపల్లి జిల్లాకు మాత్రం మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఇటీవలే నియామకమైన నేరేళ్ళ శారదకు ఆ బాధ్యతలు అప్పగించడం విశేషం.
ప్రభుత్వ నిర్ణయంపై చర్చ...
సీనియర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారని.. కరీంనగర్లో మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎగురవేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ ఒక్కరే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది మంత్రిగా కొనసాగుతుండటంతో అక్కడ జాతీయ పతాకావిష్కరణ బాధ్యతలు పొన్నంకు తప్పలేదు.
ఆ జిల్లా నుంచి మరెవరి కైనా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కినా అక్కడ మరొకరికి అప్పగించి మంత్రి పొన్నంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించే వారని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైనందున ఇక్కడ మరొకరికి అవకాశం ఇవ్వడానికి బదులు ప్రభుత్వం సీనియర్ మంత్రి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఆ బాధ్యతలు అప్పగించింది.
దీంతో పెద్దపల్లి జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ కోసం మరొకరిని ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక మహిళకు ఆ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి నేరేళ్ల శారదను పెద్దపల్లి జిల్లాకు ఎంపిక చేసి ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పార్టీకి విధేయురాలిగా సేవలు...
పార్టీ పట్ల అంకితభావం.. అధినాయకత్వం పట్ల విధేయత నేరేళ్ళ శారద రాజకీయ ప్రస్తానంలో కీలక పాత్ర పోషించాయి. ఎమ్మెల్సీ పదవి చేతికందే సమయంలో రెండుమార్లు చేజారినా.. చట్టసభలకు పోటీ చేసే అవకాశం చివరి నిముషంలో దక్కకపోయినా కూడా నిరాశ చెందకుండా పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూ వచ్చారు.
అంగబలం, అర్థబలం లేకపోయినా పార్టీ నాయకత్వం పట్ల ఎనలేని విధేయతను కనబరుస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే పలు పదవులు ఆమెను వరిస్తూ వచ్చాయంటే అతిశ యోక్తి కాదు. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన నేరేళ్ళ శారద రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు.
గతంలోనూ పలు పదవులు చేపట్టి న శారద తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో మరోమారు కీలక పదవిని దక్కించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయం లో నేరేళ్ళ శారద పలు పదవులు చేపట్టారు. వివాదరహితురాలిగా పేరొందారు. కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పార్టీకి సేవకురాలిగా కొనసాగుతూ వచ్చారు.
రామడుగు మండల జడ్పీటీసిగా రాజకీయ అరంగేట్రం చేసిన నేరేళ్ళ శారద మహిళా కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు చేపట్టారు. పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహిత అనుచరురాలిగా కూడా గుర్తింపు పొందారు.
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసిన శారద పీసీసీ అధికార ప్రతినిధి హోదాలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి శారద అందించిన సేవలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)