తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Murder Mystery: ఒక్క రోజులో ప్రేమ, పెళ్లి... నెలలోపే హత్య

HYD Murder Mystery: ఒక్క రోజులో ప్రేమ, పెళ్లి... నెలలోపే హత్య

Sarath chandra.B HT Telugu

30 October 2023, 9:15 IST

google News
    • HYD Murder Mystery:  హైదరాబాద్‌ చంపాపేట్‌లో కత్తిపోట్లకు గురైన యువతి వ్యవహారంలో  మిస్టరీ వీడింది. మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం చూసి భర్తే ఆమెను  హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఒక్కరోజు పరిచయం, ప్రేమతోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నట్లు వెల్లడైంది. 
నిందితుడు ప్రేమ్ కుమార్‌, హతురాలు స్వప్న
నిందితుడు ప్రేమ్ కుమార్‌, హతురాలు స్వప్న

నిందితుడు ప్రేమ్ కుమార్‌, హతురాలు స్వప్న

HYD Murder Mystery: హైదరాబాద్‌ చంపాపేట్‌లో శనివారం జరిగిన యువతి హత్య కేసులో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగు చూశాయి. మృతురాలు స్వప్న మరో యువకుడితో సన్నిహితంగా ఉండటంతో ఆగ్రహించిన భర్త గొంతు కోసి ఆమెను హత్య చేసినట్లు వెల్లడైంది. ఆమెను కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకున్న భర్త ప్రేమ్‌కుమార్‌ హత్య చేసినట్లు నిర్ధారించారు.

తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్‌ నుంచి ఐ.ఎస్‌.సదన్‌ పోలీసులు ఆదివారం వాంగ్మూలం సేకరించారు. శనివారం తెల్లవారుజామున చంపాపేట్‌లో యువతి కత్తిపోట్లకు గురై హత్యకు గురి కాగా, మరో యువకుడు మేడ పై నుంచి కింద పడి తీవ్ర గాయాల పాలై ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు భార్యను భర్త చంపగా, అతడిని ఆమె ప్రియుడు మేడ మీద నుంచి కిందకు నెట్టేసినట్టు గుర్తించారు. పెళ్లైన తర్వాత కూడా యువతి మరొకరితో సన్నిహితంగా ఉండటం ప్రత్యక్షంగా చూసి భరించలేకే హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు వివరించాడు.

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మోహన్‌, రూప దంపతుల కుమార్తె స్వప్న. ఈమె తల్లి దండ్రులు విడిపోవడంతో స్వప్న ఒంటరిగా ఉంటోంది. సోషల్ మీడియాలో రీల్స్‌, వీడియోలతో గుర్తింపు తెచ్చుకొన్న ఆమెను ప్రేమిస్తున్నట్టు ఒకరిద్దరు వెంటపడ్డారు. వారిలో ఓ యువకుడికి దగ్గరైన ఆమె హైదరాబాద్ మకాం మార్చింది. 8 నెలల క్రితం హన్మంతు అనే యువకుడితో కలిసి అన్నాచెల్లెళ్లమంటూ చంపాపేట రాజిరెడ్డినగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు.

హన్మంతు అప్పుడప్పుడు ఆమె దగ్గరకు వచ్చి వెళుతుండే వాడు. నెలరోజుల క్రితం స్వప్నకు మహేశ్వరంలో టీ దుకాణం నడిపే ప్రేమ్‌కుమార్‌‌తో పరిచయం ఏర్పడింది. కేవలం ఒక్కరోజు ప్రేమతోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 28వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. రాజిరెడ్డి నగర్‌ ఇంటికి నెల రోజులుగా తాళం వేసి ఉండడంతో స్వప్నకు ఇంటి యజమాని ఫోన్‌ చేశారు.

తనకు పెళ్లయిందని, ఇల్లు ఖాళీ చేస్తానని అతనికి సమాధానం ఇచ్చింది. శనివారం తెల్లవారు జామున స్వప్న ఒక్కటే ఒంటరిగా చంపాపేటలోని ఇంటికి వచ్చింది. ఆమె వచ్చిన విషయం తెలిసిన ప్రియుడు కూడా అక్కడకు వచ్చాడు. ఉదయం స్వప్నను తీసుకెళ్లడానికి అక్కడకు వచ్చిన ప్రేమ్‌కుమార్‌ తన భార్యతో మరో యువకుడు చనువుగా ఉండడం గమనించి వారిపై దాడి చేశాడు.

ఇంట్లోని కత్తితో భార్య గొంతుకోశాడు. ప్రియురాలు కత్తిపోట్లకు గురై రక్తపుమడుగులో పడి పోవడంతో ఆ యువకుడు స్వప్న భర్త ప్రేమ్‌కుమార్‌తో గొడవపడ్డాడు. గదిలో కలియబడిన ఇద్దరు ఒకరినొకరు నెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆ యువకుడు మేడమీద నుంచి ప్రేమ్‌కుమార్‌ను కిందకు తోసేశాడు. అప్పటికే అక్కడకు ఆటోలో వచ్చిన మరొక యువకుడితో కలిసి ఆ యువకుడు పారిపోయాడు.

రెండో అంతస్తు పైనుంచి పడిన ప్రేమ్‌కుమార్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స అందిస్తున్నారు. స్వప్నను తానే హత్య చేశానని, తనను ఆమె ప్రియుడు పైనుంచి కిందకు నెట్టేశాడని ప్రేమ్‌కుమార్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. ఈ ఘటనలో స్వప్న స్నేహితుడి కోసం ఐఎస్‌ సదన్‌ పోలీసులు గాలిస్తున్నారు.

తదుపరి వ్యాసం