Medak Fire Accident: సిగరెట్ పీకతో భారీ అగ్నిప్రమాదం.. పోలీస్ స్టేషన్‌లో కాలిబూడిదైన వాహనాలు
29 January 2024, 12:30 IST
- Medak Fire Accident: నిర్లక్ష్యంగా విసిరి పారేసిన సిగరెట్ పీకతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పోలీస్ స్టేషన్‌లో ఉంచిన 36 ద్విచక్ర వాహనాలు, 8 కార్లు, 3 ఆటోలు కాలి బూడిదయ్యాయి.
రామచంద్రాపురంలో కలిసి బూడిదైన వాహనాలు
Medak Fire Accident: తాగి పడేసిన ఒక చిన్న సిగిరెట్ పీక, 36 బైకులను, 8 కార్లను, 3 ఆటోలను బూడిద చేసిన సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ దగ్గర్లో ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం జరిగింది.
రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో, పోలీసులు వివిధ కేసులలో సీజ్ చేసి వాహనాలను ఖాళీ స్థలంలో పార్క్ చేశారు. ఇలా అక్కడ డజన్ల కొద్దిగా వాహనాలు ఉన్నాయి.
ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ నిలబడి సిగరెట్టు తాగి అజాగ్రత్తగా వాటి మీద పడేయడంతో అగ్ని ప్రమాదం జరిగిందని రామచంద్రపురం పోలీసులు అంటున్నారు.
మంటలు చెలరేగడం గమనించిన, పోలీసులు ఆపటానికి ప్రయత్నం చేసినా వారి వల్ల కాలేదు. చూస్తుండగానే వాహనాలుకు మొత్తం మంటలు వ్యాపించాయి. వెంటనే, పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్, బిఏచ్ఈఎల్ లో ఉన్న ఫైర్ ఇంజిన్ వారిని అలెర్ట్ చేసారు. రెండు ఫైర్ ఇంజిన్ లు వచ్చి గంట లోపలే మంటలను అదుపులోకి తీసుకవచ్చారు.
ప్రహరీ లేకపోవడం, గడ్డి పెరగడం వలన....
మంటలు పొలీస్ క్వార్టర్స్ దగ్గర వరకు రావటం, పక్కన్నేఒక ప్రైవేట్ హాస్పిటల్, దుకాణాల సముదాయం ఉండటంతో స్థానికులు ఈ అగ్నిప్రమాదంతో తీవ్ర ఆందోళను గురయ్యారు. స్థలం చుట్టూ ప్రహారీగోడ లేకపోవటం వలన, పరిసరాలు శుభ్రంగా ఉంచకపోవటం వలన ఈ ప్రమాదం జరిగిదంటున్నారు అధికారులు.
వాహనాల చుట్టూ గడ్డి పెరిగినా పోలీసులు పట్టించుకోలేదని, అందువలనే నిమిషాల్లో ఈ వాహనాలు కాలి మంటల్లో బూడిదయ్యాని అంటున్నారు స్థానికులు. మియాపూర్ ఏసీపీ నరసింహ రావు, రామచంద్రపురం ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. సీసీ కెమెరాల ఆధారంగా, ఈ అగ్నిప్రమాదానికి కారణమే ఎవరో తేల్చాలని ఏసీపీ నరసింహ రావు స్థానిక పోలీసులను ఆదేశించారు.
చిన్న కేసులలో సీజ్ చేసిన వాహనాల్ని, యజమానులు డబ్బులు చెల్లించి తీసుకెళ్తుంటారని, ఇప్పుడు ఆయా వాహన యజమానులు వచ్చి తమ వాహనం ఇవ్వాలని అడిగేతే, ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది పోలీసులకు.
సిగరెట్టు పీకలతో జాగ్రత్త…
నిప్పుతో చెలగాటం ఆడవద్దని ఫైర్ సిబ్బంది ప్రజలకు పిలుపునిచ్చారు. సిగరెట్టు పీకలు చాలా అగ్నిప్రమాదాలు కారణమవుతున్నాయని వివరించారు. సిగరెట్టు తాగిన తర్వాత, తప్పకుండా సిగరెట్టు పీకను నిప్పులేకుండా నలిపివేయాలని సూచించారు. ఎండాకాలం సమీపిస్తుండటంతో ప్రమాదం జరిగిన తమకే వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఫోన్ చేయాలని కోరారు.