Jagityal Crime: జగిత్యాలలో దారుణం.. మహిళ ఆత్మహత్య, పొరుగింటి మహిళ హత్య.. తోడికోడళ్ల విషాదాంతం
27 March 2024, 7:29 IST
- Jagityal Crime: జగిత్యాల జిల్లా కమలాపూర్‌లో ఘోరం జరిగింది. భార్య ఆత్మహత్యకు తోడికోడలి వరుసయ్యే మహిళ కారణమని భావించి ఆమెను గొంతు కోసి హతమార్చాడు.
జగిత్యాలలో మహిళ ఆత్మహత్యతో పొరుగింటి మహిళ దారుణ హత్య
Jagityal Crime: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ ఆత్మహత్యకు పొరుగింట్లో ఉండే తోడికోడలి వరుసయ్యే మహిళే కారణమని భావించి ఆమెను హతమార్చాడు.
మహిళ ఆత్మహత్యకు పాల్పడిన గంటల వ్యవధిలోనే పక్కింటిలో నివాసం ఉంటున్న మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్‌లో మంగళవారం జరిగింది.
కమలాపూర్‌కు చెందిన పులి రేణుక (42) మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కల్లు గీత కార్మికుడైన రేణుక భర్త గంగన్న ఇంటికి వచ్చేసరికి రేణుక ఆత్మహత్యకు పాల్పడటం తెలిసి రగిలిపోయాడు. ఇంటి పక్కనే ఉండే పులి పద్మ అనే మహిళ కొద్ది సేపటికే హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.
పదునైన ఆయుధంతో పద్మ గొంతు కోసి హతమార్చారు. పద్మను రేణుక భర్త గంగన్నహత్య చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య భూమ విషయంలో కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనలు జరిగినట్టు అనుమానిస్తున్నారు.
సాగు భూమి విషయంలో పద్మ, రేణుక కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలతో మనస్తాపానికి గురైన రేణుక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కల్లు గీత నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య చనిపోయి ఉండటంతో ఆవేశానికి గురైన ఆమె భర్త.. పక్కింట్లో మహిళ కారణమని భావించి కల్లు గీసే ఉలితో ఆమె గొంతుకోసి హత్య చేశాడు.
కమలాపూర్ గ్రామానికి చెందిన పులి లక్ష్మయ్య, గంగన్నలు వరుసకు అన్నదమ్ములుగా గుర్తించారు. లక్ష్మయ్య, గంగన్నలు కల్లు గీత పనిలో ఉన్నారు. వీరి భార్యలు బీడీలు చుట్టి ఉపాధి పొందుతున్నారు. గ్రామంలోనే పక్కపక్కనే ఇద్దరికి వ్యవసాయ భూమి ఉంది.
పొలం గట్ల విషయంలో ఇద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం గంగన్న భార్య రేణుక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంగన్న సాయంత్రం ఇంటికొచ్చేసరికి దూలానికి వేలాడుతూ కనిపించింది. రేణుక చావుకు లక్ష్మయ్య కుటుంబమే కారణమని భావించిన గంగన్న లక్ష్మయ్య భార్య పద్మను కల్లు గీసే ఉలితో మెడపై కోయడంతో రక్తపుమడుగులో ప్రాణాలు విడిచింది.
ఆత్మహత్య చేసుకున్న రేణుకకు ఇద్దరు కుమారులు ఉండగా, హత్యకు గురైన పద్మకు కుమారుడు, కూతురు ఉన్నారు. ఒకరు ఆత్మహత్య చేసుకోవడం.. మరొకరు హత్యకు గురి కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుకను లక్షయ్య కుటుంబ సభ్యులే హతమార్చారని గంగన్న ఆరోపించాడు.
వరుసకు తోడికోడళ్లయ్యే ఇద్దరు మహిళలు భూమి వివాదంతో ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తుల్ని కలిచి వేసింది. ఆవేశంలో ఒకరు ప్రాణాలు తీసుకుంటే, మరొకరు హత్య గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇరుకుటుంబాల నిరాకరించడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.