Telugu Students : అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో 80 శాతం తెలుగువారే
17 November 2022, 15:08 IST
- Telugu Students In US : అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగు వారే ఉన్నారు. అది కూడా 80 శాతానికి మించి ఉన్నారని తెలుస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
అమెరికా(America)లో 80 శాతం మంది ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాలకు చెందిన వారేనని రోవాన్ యూనివర్సిటీ సీనియర్ వీపీ డారెన్ వాగ్నర్ తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండో గ్లోబల్ స్టడీస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
'ప్రస్తుతం, 80 శాతం భారతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ను అభ్యసిస్తున్నారు. 20 శాతం మంది అండర్ గ్రాడ్యుయేషన్‌ను అభ్యసిస్తున్నారు. దాదాపు 78 శాతం మంది విద్యార్థులు STEM(Science, technology, engineering, and mathematics) ప్రోగ్రామ్‌లను చేపట్టుతున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో విద్య కోసం వచ్చే వారిలో.. హైదరాబాద్(Hyderabad) ముందు వరుసలో ఉంటుంది. భారతదేశంలోని అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటి.' అని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా వాగ్నర్ విద్యార్థులతో మాట్లాడారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను కలిసేటప్పుడు ఎలా మాట్లాడాలి. విదేశాల్లోని విద్యలో ట్రెండ్‌లు, కెరీర్ ప్రాధాన్యతలపై మాట్లాడారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థులలో కొవిడ్(Covid) తర్వాత మార్పు ఎలా వచ్చిందో చర్చించారు.
రెండు సంవత్సరాల కరోనా(Corona) నిబంధనల తర్వాత ఇప్పుడు విద్యార్థుల శాతం పెరుగుతుందని వాగ్నర్ చెప్పారు. 'విదేశీ విద్య 80 శాతం పెరిగింది. కొవిడ్ పూర్వ స్థాయికి చేరుకుంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్(United States) ప్రస్తుతం అంతర్జాతీయ విద్య కోసం ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లుగా ఉన్నాయి. భారతదేశం నుండి సంవత్సరానికి 18.9 శాతం పెరుగుదల ఉంది. ప్రస్తుతం 1,99,182 మంది భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్నారు.' అని ఆయన తెలిపారు.
మరోవైపు చూసుకుంటే.. అమెరికా(America)కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2021లో 12 శాతం పెరిగింది. చైనా(China) నుంచి వచ్చిన వారి సంఖ్య తగ్గింది. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన నివేదిక ఇది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా నుంచి వచ్చిన వారే అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో ఇండియా ఉంది. భారతీయ విద్యార్థుల్లో 37 శాతం మంది మహిళలు ఉన్నారు. అమెరికాకు వచ్చే వారిలో 71.9 శాతం చైనా, భారత్ విద్యార్థులే.
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల(International Students) చేరికలపై కొవిడ్ మహమ్మారి ప్రభావం చూపింది. 2021లోనూ కొనసాగింది. స్టూడెంట్స్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల ప్రకారం.. 2021లో మెుత్తం ఎఫ్ 1, ఎం 1 (నాన్ ఇమ్మిగ్రెంట్) వీసా విద్యార్థుల సంఖ్య 12,36,748గా ఉంది.