Khammam Ganja: ఖమ్మం కమిషనరేట్లో పట్టుబడిన 624 కిలోల గంజాయి దహనం
01 October 2024, 9:21 IST
- Khammam Ganja: ఖమ్మం కమిషనరేట్లో తొలిసారి గంజాయిని దహనం చేశారు. పక్కనే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడిన నిషేధిత గంజాయిని ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉండగా పూర్తిగా మైదాన ప్రాంతమైన ఖమ్మంలో మాత్రం గంజాయి పట్టుబడిన సంఘటనలు చాలా తక్కువగానే ఉంటాయి.
గంజాయి దగ్దం చేస్తున్న పోలీసులు
Khammam Ganja: ఖమ్మం కమిషనరేట్లో తొలిసారి గంజాయిని దహనం చేశారు. పొరుగునే ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడిన నిషేధిత గంజాయిని పలుమార్లు ధ్వంసం చేసినా, మైదాన ప్రాంతమైన ఖమ్మంలో మాత్రం గంజాయి పట్టుబడిన సంఘటనలు చాలా తక్కువగానే ఉంటాయి. కాగా చాలా కాలంగా వివిధ కేసుల్లో పట్టుబడిన పెద్ద మొత్తంలో గంజాయిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేతృత్వంలో సోమవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేయడం తొలిసారి కావడం గమనార్హం.
624 కేజీల గంజాయి ధ్వంసం..
ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 624 కిలోల ఎండు గంజాయిని అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ పర్యవేక్షణలో పోలీస్ ఫైరింగ్ రెంజ్ మంచుకొండ అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు.
ఈ గంజాయి మండుతున్నప్పుడు వెలువడే వాయువులు కూడా మానవాళికి హానికరమే కావడంతో నగర శివారు మంచుకొండ ప్రాంతానికి తీసుకెళ్లి పంచనామా అనంతరం తగులబెట్టారు. ఖమ్మం వన్ టౌన్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు, కల్లూరు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 7 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసినట్లు అడిషనల్ డిసీపీ తెలిపారు.
జిల్లాలోని ఠాణాల్లో నిల్వ ఉంచిన గంజాయి సరకును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వీర్యం చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు ఉదయ్ కుమార్, రమేష్, జానర్ధన్, ఉస్మాన్ షారిఫ్ , కల్లూరు ఎస్సై ఇతర అధికారులు పాల్గొన్నారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.)