తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  330 సీట్లు సాధించారు...! బాసర ఐఐఐటీ ఫలితాల్లో సత్తా చాటిన సిద్దిపేట విద్యార్థులు, రాష్ట్రంలోనే తొలి స్థానం

330 సీట్లు సాధించారు...! బాసర ఐఐఐటీ ఫలితాల్లో సత్తా చాటిన సిద్దిపేట విద్యార్థులు, రాష్ట్రంలోనే తొలి స్థానం

HT Telugu Desk HT Telugu

05 July 2024, 20:02 IST

google News
    • సిద్ధిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. బాసర ఐఐఐటీలో ఏకంగా 330 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
బాసర ఐఐఐటీలో సిద్ధిపేట జిల్లా విద్యార్థులకు అధిక సీట్లు
బాసర ఐఐఐటీలో సిద్ధిపేట జిల్లా విద్యార్థులకు అధిక సీట్లు

బాసర ఐఐఐటీలో సిద్ధిపేట జిల్లా విద్యార్థులకు అధిక సీట్లు

ఇటీవల వెల్లడించిన బాసర ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు సాధించి సిద్ధిపేట జిల్లాను 10వ తరగతి విద్యార్థులు అగ్రస్థానంలో నిలిపారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న మొత్తం 1,404 సీట్లల్లో 330 సీట్లను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 10వ తరగతి విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అంటే 23 శాతానికి పైగా సీట్లు సిద్దిపేట విద్యార్థులే సాధించారు.

సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి పదో తరగతి ఉతీర్ణత సాధించిన 169 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ యేడు సిద్దిపేట విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించారు. చిన్న కోడూరు మండలంలో 62 మంది, నంగునూర్ మండలంలో 61 మంది నారాయణ రావు పేటలో 11, సిద్దిపేట అర్బన్ 24 , సిద్దిపేట రూరల్ 11 మొత్తం గా 169 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వీరిలో రెండు మండలాలకు చెందిన వారే అధికంగా ఉండటం విశేషం.

రెండో స్థానంలో నిజామాబాద్, 3వ ప్లేస్ లో సంగారెడ్డి.…

రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు 157 సీట్లు సాధించారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు 132 సీట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నిలిసిన నిజామాబాద్ జిల్లా కంటే…. సిద్దిపేట జిల్లాకు 173 సీట్లు ఎక్కువగా రావటం విశేషం.  సిద్దిపేట జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… ఒక్క సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోనే నిజామాబాద్ కంటే ఎక్కువ మందికి సీట్లు దక్కాయి. 

సిద్దిపేటను విద్యా క్షేత్రంగా తీర్చిదిద్దుకున్నామని, అందుకు ఇలాంటి ఫలితాలకు నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇలాంటి ఫలితాలు వచ్చినపుడే చేసిన పనికి సంతృప్తి అన్నారు. సిద్ధిపేట విద్యార్థులు వరుసగా ఆరు సార్లు పదో తరగతిలో రాష్ట్రంలోనే అగ్రస్థానం లో నిలిచారన్నారు. అదే స్ఫూర్తితో బాసర ట్రిపుల్ ఐటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచి సీట్లు సాదించామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత చదువులు చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం........

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి అర్హత సాధించిన విద్యార్థులు,వారి తల్లితండ్రులకు  మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించి సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది విద్యా శాఖ అధికారులు,ఉపాధ్యాయుల కృషి ఫలితమే  అని ఆయన పేర్కొన్నారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.

తదుపరి వ్యాసం