Gouravelli Reservoir Victims : హుస్నాబాద్ లో BRSకు బిగ్ షాక్! ఎన్నికల బరిలో 100 మంది 'గౌరవెల్లి' నిర్వాసితులు
29 October 2023, 11:03 IST
- TS Assembly Elections 2023: ఎన్నికల బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులు(ఫైల్ ఫొటో - Twitter)
Gouravelli reservoir Victims : హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద షాకే తగిలేలా ఉంది. గౌరవెల్లి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన వందమంది రైతులు ఎన్నికల బరిలో నిలిసి బీఆర్ఎస్ పార్టీ అబ్యర్ధి వొడితెల సతీష్ కుమార్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. పరిహారం రాని కొంతమంది రైతులు శనివారం ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై…ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం వందమంది రైతులు ఎన్నికల్లో నామినేషన్లు వేసి, బీఆర్ఎస్ అభ్యర్దికి వ్యతిరేకంగా ఊరు ఊరు తిరిగి తనను ఓడించాలని ప్రచారం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
8.23 టీఎంసీలతో ప్రాజెక్టు......
తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట్ మండలంలో గుడాటిపల్లి గ్రామంలో 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ కింద, తెనుగుపల్లి, గుడాటిపల్లి రెండు గ్రామాలూ, వీటి పరిధిలో ఉన్న ఏడూ తండాల రైతులు తమ భూములను కోల్పోయారు.
ఇక పశువుల కొట్టాలకు, ఇండ్ల స్థలాలకు, పెండ్లి అయ్యి వేరే గ్రామాలకు వెళ్లిన మహిళలకు పరిహారం ఇవ్వకపోవడంతో గతంలోనే వారు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టులో నీటిని నింపవద్దని గ్రామస్తులు అడ్డుకుంటే, వారిలో కొంతమందిని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టించి జైల్లో వేయించింది. బలవంతంగా గ్రామాలూ కాలి చేయించి, ఇండ్లు కూల్చివేసి, ప్రాజెక్టులో నీటిని నింపటం ప్రారంభించారు. ఒక వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన గౌరవెల్లి హుస్నాబాద్ నియాజకవర్గానికి ఒక కల్పతరువు లాగా మారనున్నది ప్రచారం చేసుకుంటుండగా, గౌరవెల్లి రైతుల నిర్ణయం ఆ పార్టీకి ఒక ఆశనిపాతంలా మారింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాల కంటే ఎక్కువ భూమికి సాగు నీరు, ఈ ప్రాంతానికి మొత్తం తాగు నీరు అందిస్తున్నాము అని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకొని ఎన్నికల్లో లబ్ది పొందాలనుకుంటుంది, అయితే ఆ రైతులే సతీష్ కుమార్ కి వ్యతిరేకంగా పోటీచేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఎటుపాలుపోని పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా రైతులతో కలిసి మాట్లాడి వారికీ నచ్చజెప్పాలని ఆలోచన చేస్తున్నది.
అనుకూలంగా మార్చుకోనున్న కాంగ్రెస్......
కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ఇక్కడినుండి పొన్నం ప్రభాకర్ ని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకోవడంతో, ప్రభాకర్ కూడా రైతుల సమస్యలను తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. వారితో కలిసి మాట్లాడి వారికీ తప్పకుండ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తగిన పరిహారం ఇప్పిస్తానని హామీ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.