WWE merged with UFC: రెజ్లింగ్, ఫైటింగ్ ఒక్కటయ్యాయి.. యూఎఫ్‌సీలో డబ్ల్యూడబ్ల్యూఈ విలీనం
03 April 2023, 19:58 IST
- WWE merged with UFC: రెజ్లింగ్, ఫైటింగ్ ఒక్కటయ్యాయి. యూఎఫ్‌సీలో డబ్ల్యూడబ్ల్యూఈ విలీనమైంది. ఇప్పుడీ రెండింటినీ ఎరి ఎమాన్యుయెల్ కు చెందిన ఎండీవర్ గ్రూప్ చూసుకోనుంది.
డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ రోమన్ రీన్స్
WWE merged with UFC: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) గురించి తెలుసు కదా. ఈ రెజ్లింగ్ కి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడీ సంస్థను ఎరి ఎమాన్యుయెల్ కు చెందిన ఎండీవర్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఇప్పుడీ సంస్థే అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ)కి పేరెంట్ కంపెనీగా ఉంది. ఇప్పుడీ రెండూ కలిపి ఓ కొత్త కంపెనీగా ఏర్పడనున్నాయి.
ఈ కొత్త సంస్థలో ఎండీవర్ 51 శాతం వాటా కలిగి ఉంటుంది. ఇప్పటి డబ్ల్యూడబ్ల్యూఈ షేర్ హోల్డర్స్ దగ్గర 49 శాతం వాటా ఉంటుంది. ఈ డీల్ విలువ ఏకంగా 930 కోట్ల డాలర్లు కావడం విశేషం. కొన్ని దశాబ్దాలుగా డబ్ల్యూడబ్ల్యూఈ సంస్థ విన్నీ మెక్‌మెహాన్ చేతుల్లోనే ఉంది. మొదట వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ గా ఉన్న ఈ ఎంటిటీ.. తర్వాత వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ గా మారింది.
ఇప్పుడీ సంస్థను మంచి డీల్ కు ఎండీవర్ కు అమ్మడంపై విన్సీ స్పందించారు. ఇది డబ్ల్యూడబ్ల్యూఈ షేర్‌హోల్డర్లకు మంచి డీల్ అని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తోంది. అమెచ్యూర్ రెజ్లింగ్ తో పోలిస్తే ఇది కాస్త కఠినంగానే ఉంటుంది. అయితే ఇది ఫేక్ అని, ఇందులోని రెజ్లర్లు చేసేదంతా స్క్రిప్ట్ ప్రకారం చేసే నటనే అన్న విమర్శలూ ఉన్నా.. డబ్ల్యూడబ్ల్యూఈ మాత్రం విజయవంతంగా నడుస్తోంది.
ఇన్నాళ్లూ డబ్ల్యూడబ్ల్యూఈకి విన్సీ సీఈవోగా ఉండగా.. ఇక నుంచి ఎమాన్యుయెల్ సీఈవోగా ఉంటారు. విన్సీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా కొనసాగనున్నారు. విన్సీ కూడా ఓ రెజ్లరే. ఆయన ఒకప్పుడు కూడా ఇందులోని టాప్ రెజ్లర్లతో తలపడ్డారు.
టాపిక్