Lata Mangeshkar | టీమ్ఇండియా గెలుపు కోసం లతా మంగేష్కర్ ఉపవాసం ఉన్న వేళ..
06 February 2022, 16:20 IST
- Lata Mangeshkar news | కోట్లాది మంది భారతీయులకు.. క్రికెట్ అంటే ప్రాణం. టీమ్ఇండియా గెలుపును.. తమ విజయం అనుకునే వారెందరో. ఓడితే బాధపడే వారూ చాలా మంది ఉన్నారు. దేశంలోని క్రికెట్ ప్రేమికుల్లో లతా మంగేష్కర్ ఒకరు. జట్టు గెలవాలని..ఆమె ఉపవాసం ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్ పట్ల తనకున్న ప్రేమను ఎన్నోసార్లు బయటపెట్టారు లత. ఓసారి ఆ జ్ఞపకాలను నెమరవేసుకుందాం..
టీమ్ఇండియా గెలుపు కోసం లతా మంగేష్కర్ ఉపవాసం ఉన్న వేళ..
Lata Mangeshkar news today | 2011 ప్రపంచకప్.. భారత్ వశమైంది. కానీ అంతకన్నా ముందు సెమీఫైనల్లో పాకిస్థాన్‌తో పోటీపడింది టీమ్ఇండియా. పాక్‌తో మ్యాచ్ అంటే.. అభిమానుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఇక ప్రపంచకప్ సెమీస్ అంటే.. తీవ్రస్థాయి ఉత్కంఠ కచ్చింగా ఉంటుంది.
ఆరోజున.. కోట్లాది మంది భారతీయులు, టీమ్ఇండియా గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు. కొందరు ఉపవాసాలు కూడా ఉన్నారు. వారిలో లతా మంగేష్కర్ కూడా ఒకరు. కొన్నేళ్ల క్రితం ఈ విషయాన్ని లత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
"టీమ్ఇండియా ఆడుతుంటే.. ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ఇలా చేస్తే, అలా చేస్తే.. జట్టు గెలిచేస్తుందని అనుకుంటారు. ఆరోజు నేను మ్యాచ్ మొత్తానికి ఉపవాసం ఉన్నాను. తినలేదు, మంచినీరు కూడా తాగలేదు. టీమ్ఇండియా గెలవాలని నేను బలంగా ప్రార్థించాను. జట్టు గెలిచిన తర్వాతే.. మేమందరం రాత్రి భోజనం చేశాము," అని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
లార్డ్స్‌లో లత..
1983 ప్రపంచకప్ గెలుపు భారత్‌లో క్రికెట్ రూపురేఖలను మార్చేసింది. నాటి విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. లార్డ్స్ వేదికగా కపిల్ దేవ్ జట్టు.. మ్యాచ్‌ను దక్కించుకున్న ఆ అద్భుతమైన క్షణాలను లతా మంగేష్కర్ అక్కడే ఉండి చూశారు.
"ఓ సంగీత కార్యక్రమం కోసం నేను లండన్‌కు వెళ్లాను. అప్పుడే సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై మన జట్టు గెలిచింది. ఇక ఫైనల్‌కి ముందు.. కపిల్ దేవ జట్టును.. నేను ఉండే హోటల్‌కు డిన్నర్ కోసం పిలిచాను. వారికి శుభాకాంక్షలు తెలిపాను. ఆ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని నాకు చాలా అనిపించింది. వెళ్లి చూసేశాను," అని లత పేర్కొన్నారు.
'సచిన్ టెండుల్కర్.. అంటే ఇష్టం'
Lata Mangeshkar Sachin Tendulkar | క్రికెటర్లలో సచిన్ టెండుల్కర్ అంటే లతా మంగేష్కర్‌కు చాలా ఇష్టం. సచిన్‌ను అమె ఓ కొడుకులాగా చూసుకునేవారు.
"సచిన్.. నన్ను తల్లిగా చూస్తాడు. ఓ తల్లి లాగా నేను సచిన్ కోసం ప్రార్థిస్తాను. సచిన్ నన్ను 'ఆయీ(అమ్మా)' అని తొలిసారి పిలిచిన క్షణాలను నేను మర్చిపోలేను. సచిన్ లాంటి తనయుడు నాకు ఉండటం ఎంతో సంతోషంగా ఉంది," అని లత ఓ సందర్భంలో తెలిపారు.
సచిన్ కూడా లత పట్ల తల్లిభావనతో ఉంటాడు. జీవితంలో ఒత్తిడికి గురైనప్పుడు.. లత పాటలు వింటే అంతా మాయమైపోతుందని ఎన్నో సందర్భాల్లో మాస్టర్ బ్లాస్టర్ వెల్లడించాడు.
కొవిడ్ సోకడంతో జనవరి 8న ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చేరారు లతా మంగేష్కర్. కొన్ని రోజుల పాటు వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమె కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. కానీ ఆమె పరిస్థితి విషమించినట్టు శనివారం తెలిపారు. చివరికి.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. 92ఏళ్ల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
లతా మంగేష్కర్‌కు టీమ్ఇండియా నివాళులర్పించింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో.. భారత ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మైదానంలోకి దిగారు. లత ఆత్మకు శాంతిచేకూరాలని.. మౌనం పాటించారు.