Boxing Day History : బాక్సింగ్ డే టెస్టు అంటే ఏంటి? డిసెంబర్ 26నే ఎందుకు ఆడతారు?
26 December 2022, 14:56 IST
- Boxing Day Test : షెడ్యూల్ ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న నిర్వహించే మ్యాచ్‌ని బాక్సింగ్ డే టెస్ట్ అంటారు. ఇంతకీ ఇదే రోజున ఎందుకు ఆడతారు? దీని వెనక ఉన్న చరిత్రేంటి?
బాక్సింగ్ డే టెస్టు
షెడ్యూల్ ప్రకారం ప్రతి ఏటా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్(Boxing Day Test) అంటారు. బాక్సింగ్ డే అంటే ఏమిటి? డిసెంబర్ 26న ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌ను బాక్సింగ్ డే అని ఎందుకు అంటారు? మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ కూడా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్. ఇంతకీ దీని చరిత్ర ఏంటి?
క్రిస్మస్ తర్వాత రోజుని సాధారణంగా బాక్సింగ్ డే(Boxing Day) అంటారు. డిసెంబర్ 25న క్రిస్మస్ ముగిస్తే, డిసెంబర్ 26ని బాక్సింగ్ డే అంటారు. ఇది గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెనడా(canada) వంటి దేశాలలో జరుపుకొంటారు. అలాగే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అంటారు.
బాక్సింగ్ డే గురించి చాలా కథలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో 1800లో విక్టోరియా మహారాణి సింహాసనాన్ని అధిష్ఠించిన రోజును బాక్సింగ్ డే అని కూడా అంటారు. మరో కథ ప్రకారం చర్చిలో ఉంచిన పెట్టెలు క్రిస్మస్ తర్వాత రోజు తెరవబడతాయి. అందుకే ఈ రోజును బాక్సింగ్ డే అంటారు. ఇంకో కథనం ప్రకారం.. క్రిస్మస్(Christmas) రోజు సెలవు తీసుకోకుండా పని చేసే ఉద్యోగులకు మరుసటి రోజు బాక్స్ రూపంలో బహుమతి ఇస్తారు. ఈ రోజున వారికి సెలవు కూడా ఇస్తారు. అందుకే బాక్సింగ్ డే అని పిలుస్తారనేది కథ.
బాక్సింగ్-డే టెస్ట్ మ్యాచ్(Boxing Day Test Match) మొదట 1950లో ప్రారంభమైంది. మొదట్లో ప్రతి సంవత్సరం ఆడేవారు కాదు. తర్వాత ప్రతి ఏటా ఈ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ తొలిసారి ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1952లో తొలిసారి బాక్సింగ్ డే టెస్టు ఆడిన దక్షిణాఫ్రికా(South Africa) ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. తర్వాత 1968లో ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడారు. 1980 నుండి ప్రతి సంవత్సరం ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుండి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా బాక్సింగ్ డేలో నిరంతరం టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.
అయితే ఓన్లీ క్రికెట్లోనే కాదు.. బాక్సింగ్ డే మ్యాచులకు ఇతర క్రీడల్లోనూ క్రేజ్ ఉంది. ఇంగ్లాండ్(Englandలో ఫుట్‌బాల్ మ్యాచులు ఆడటం ఆనవాయితీగా వస్తుంది. ప్రీమియర్ లీగ్ మ్యాచులు ఆడించడం సంప్రదాయంగా కొనసాగుతుంది.