తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bamboo Cricket Bats | క్రికెట్‌లో వెదురు బ్యాట్స్‌.. భవిష్యత్తు వీటిదేనా?

Bamboo Cricket Bats | క్రికెట్‌లో వెదురు బ్యాట్స్‌.. భవిష్యత్తు వీటిదేనా?

Hari Prasad S HT Telugu

24 January 2022, 21:04 IST

google News
    • Bamboo Cricket Bats.. విల్లో అనే చెట్లను క్రికెట్‌ బ్యాట్‌ తయారీ కోసం ఉపయోగిస్తారు. ఇందులోనూ ఇంగ్లిష్‌ విల్లో, కశ్మీర్‌ విల్లో అని రెండు రకాల బ్యాట్లు ఉంటాయనీ తెలుసు. ఇంగ్లండ్‌లో అయితే కేవలం ఈ బ్యాట్ల తయారీ కోసమే విల్లో చెట్లను పెంచుతారు. కానీ తొలిసారి క్రికెట్‌ బ్యాట్‌ను వెదురుతో తయారు చేయడం ఆశ్చర్యం కలిగించింది.
వెదురు బ్యాట్ తో దీనిని అభివృద్ధి చేసిన వారిలో ఒకరైన దర్శిల్ షా
వెదురు బ్యాట్ తో దీనిని అభివృద్ధి చేసిన వారిలో ఒకరైన దర్శిల్ షా ( Darshil Shah)

వెదురు బ్యాట్ తో దీనిని అభివృద్ధి చేసిన వారిలో ఒకరైన దర్శిల్ షా

Bamboo Cricket Bats: అభిమానులను అలరించడానికి ఎప్పుడూ ఏదో ఒక మార్పుతో వచ్చే క్రికెట్‌లో ఇప్పుడీ కొత్త రకం బ్యాట్లపై పెద్ద చర్చే నడుస్తోంది. సాధారణంగా క్రికెట్‌ బ్యాట్‌ దేనితో తయారు చేస్తారు? విల్లో అనే చెట్లను క్రికెట్‌ బ్యాట్‌ తయారీ కోసం ఉపయోగిస్తారు. ఇందులోనూ ఇంగ్లిష్‌ విల్లో, కశ్మీర్‌ విల్లో అని రెండు రకాల బ్యాట్లు ఉంటాయనీ తెలుసు. ఇంగ్లండ్‌లో అయితే కేవలం ఈ బ్యాట్ల తయారీ కోసమే విల్లో చెట్లను పెంచుతారు. కానీ తొలిసారి క్రికెట్‌ బ్యాట్‌ను వెదురుతో తయారు చేయడం ఆశ్చర్యం కలిగించింది. 

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ మధ్య వెదురుతో చేసిన క్రికెట్‌ బ్యాట్‌ను అభివృద్ధి చేశారు. ఈ బ్యాట్‌పై పెద్ద చర్చే జరిగింది. ఇప్పటికే బ్యాట్స్‌మెన్‌ ఫేవర్‌గా ఉన్న క్రికెట్‌.. ఈ కొత్త, బరువైన, గట్టిదైన, మరింత పెద్దదైన స్వీట్‌ స్పాట్‌ కలిగి ఉన్న వెదురు బ్యాట్‌తో మరింత బ్యాట్స్‌మెన్‌ ఫేవర్‌గా మారుతుందన్న విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ వెదురు బ్యాట్లు ఏంటి? వీటిని ఎలా తయారు చేస్తారు? ఈ బ్యాట్లపై ఎంసీసీ ఏమంటోంది? అసలు క్రికెట్‌ బ్యాట్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.

అసలేంటీ Bamboo Cricket Bat?

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని ఇద్దరు పరిశోధకులు బెన్‌ టింక్లర్‌-డేవీస్‌, దర్శిల్‌షా ఈ బ్యాట్‌ను అభివృద్ధి చేశారు. వెదురు బొంగులతో ఈ బ్యాట్‌ తయారు చేశారు. ఈ బ్యాట్‌కు సంబంధించిన అంశాలను వాళ్లు స్పోర్ట్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ జర్నల్‌లో పబ్లిష్‌ చేశారు. ఈ వెదురు బ్యాట్‌పై ఈ ఇద్దరు పరిశోధకులు మైక్రోస్కోపిక్‌ అనాలిసిస్‌ చేశారు. కంప్యూటర్‌ మోడలింగ్‌, వీడియో క్యాప్చరింగ్‌ టెక్నాలజీ ఉపయోగించి ఈ బ్యాట్‌ పనితీరును వాళ్లు అంచనా వేశారు. కంప్రెషన్‌ టెస్టింగ్‌, వైబ్రేషన్స్‌ టెస్టింగ్‌ కూడా నిర్వహించారు.

విల్లో బ్యాట్ల కంటే ఇవి ఎలా భిన్నం?

మొదటి నుంచీ క్రికెట్‌ బ్యాట్లను విల్లో వుడ్‌తోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రొఫెషనల్‌ క్రికెటర్లు వాడే బ్యాట్లు కూడా ఇవే. అయితే తొలిసారి ఓ క్రికెట్‌ బ్యాట్‌ను ఇలా వెదురుతో తయారు చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా విల్లో బ్యాట్ల కంటే ఈ బ్యాట్‌ చాలా బలంగా ఉన్నట్లు కూడా పరిశోధనల్లో తేలింది. విల్లో బ్యాట్ కంటే ఈ వెదురు బ్యాట్‌ చాలా తక్కువ మందం కలిగి ఉండటం మరో విశేషం. బ్యాట్‌ సన్నగా ఉండటం వల్ల బ్యాట్స్‌మెన్‌ సులువుగా దీనిని స్వింగ్‌ చేయగలరు. దీంతో విల్లో బ్యాట్‌ కంటే ఎక్కువ శక్తిని బంతిపై ప్రయోగించే అవకాశం బ్యాట్స్‌మెన్‌కు దక్కుతుంది. ఇక ఈ వెదురు బ్యాట్‌.. సాంప్రదాయ విల్లో బ్యాట్‌ కంటే 22 శాతం ఎక్కువ దృఢంగా ఉన్నట్లు కూడా పరిశోధనలో తేలింది. 

అదే సమయంలో విల్లో బ్యాట్‌ కంటే 40 శాతం ఎక్కువ బరువు ఉండటం ఈ వెదురు బ్యాట్‌లో ఉన్న ప్రధాన ప్రతికూలాంశం. ఇక ఈ వెదురు బ్యాట్‌లోని స్వీట్‌ స్పాట్‌ 20 మి.మీ. వెడల్పు, 40 మి.మీ. పొడవుతో ఉంది. ఇది విల్లో బ్యాట్‌ కంటే ఎక్కువ. పైగా ఈ స్వీట్‌ స్పాట్‌ను సాధారణ బ్యాట్‌తో పోలిస్తే కాస్త కింద ఉంచారు. దీనికారణంగా బ్యాట్స్‌మెన్‌ యార్కర్‌ బాల్స్‌ను కూడా సులువుగా ఆడే వీలు కలుగుతుంది. బ్యాట్‌లో బంతి వేగాన్ని పెంచే భాగాన్నే స్వీట్‌ స్పాట్‌ అంటారు. బంతి ఈ స్వీట్‌ స్పాట్‌లో తగిలినప్పుడు మరింత వేగంగా బౌండరీ వైపు వెళ్తుంది. పైగా ఇక్కడ బంతి తగిలితే.. బ్యాట్స్‌మెన్‌ మణికట్టులో కలిగే వైబ్రేషన్స్‌ చాలా తక్కువగా ఉంటాయి.

వెదురు బ్యాట్ ప్రయోజనాలు

ఇప్పుడు వాడుతున్న విల్లో బ్యాట్లతో పోలిస్తే వెదురు బ్యాట్లతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. తయారీ నుంచి వినియోగం వరకు కూడా ఈ వెదురు బ్యాట్లతో క్రికెట్‌కు మేలే జరుగుతుందని దీనిపై పరిశోధనలు జరిపిన రీసెర్చర్లు చెబుతున్నారు. విల్లో చెట్ల కలపలో ఉండే కొన్ని సమస్యల కారణంగా వీటితో బ్యాట్లు తయారు చేస్తున్నప్పుడు 20 శాతం వృథా అవుతుంది. ఈ మిగిలిపోయిన చెక్కను వంటచెరకుగా వాడుతుంటారు. అదే వెదురు బ్యాట్లలో ఈ వృథా చాలా చాలా తక్కువ. ఇక విల్లో చెట్లు ఎక్కువగా ఇంగ్లండ్‌లో ఉంటే.. బ్యాట్లు తయారయ్యేది ఇండియాలో. దీని కారణంగా కలపను ఇంగ్లండ్‌ నుంచి ఇండియాకు తీసుకొచ్చి, ఇక్కడ బ్యాట్లు తయారు చేసి తిరిగి అక్కడికి పంపడం వల్ల చివరికి విల్లో బ్యాట్‌ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటోంది. 

అదే వెదురు విషయానికి వస్తే ఈ చెట్లు ఇండియాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా బ్యాట్లను తయారు చేయడం చాలా చవకగా అయ్యే పని. ఉత్పత్తి ఖర్చు 50 శాతం తగ్గి.. మరింత తక్కువ ధరలకే క్రికెట్‌ బ్యాట్లు అందుబాటులోకి వచ్చే వీలుంటుంది. ఇక వెదురు వృక్షాలు చాలా వేగంగా పెరుగుతాయి. ఏడేళ్లలోనే వీటిని కట్‌ చేసి బ్యాట్ల తయారీకి ఉపయోగించవచ్చు. అదే సమయంలో విల్లో చెట్లను మాత్రం కనీసం 15 ఏళ్ల పాటు పెంచాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం తయారవుతున్న బ్యాట్ల కంటే రెట్టింపు బ్యాట్లు తయారు చేయవచ్చు.

క్రికెట్‌ బ్యాట్‌ నిబంధనలు ఏంటి?

అయితే క్రికెట్‌ బ్యాట్‌కు కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటిని కచ్చితంగా కలపతోనే తయారు చేయాలన్నది ప్రధాన నిబంధన. ఇప్పుడు వెదురు బొంగులతో బ్యాట్ల తయారీ అంటే నిబంధనలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి క్రికెట్‌ నిబంధనలను రూపొందించే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) దీనికి అనుకూలంగా లేదు. 

బ్యాట్‌కు, బంతికి సమన్యాయం చేసేలా ఎంసీసీ నిబంధనలు రూపొందిస్తుంది. కానీ ఇప్పుడీ వెదురు బ్యాట్‌.. బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ అనుకూలిస్తుందని తేలడంతో దీనికి అనుమతి ఇచ్చే విషయాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని ఇప్పటికే ఎంసీసీ స్పష్టం చేసింది. బ్యాట్లు మరీ అంత శక్తివంతంగా ఉండకూడదన్నది ఎంసీసీ భావన. దీంతో వెదరు బ్యాట్లకు ఎన్ని అనుకూలతలు ఉన్నా.. ఈ విషయంలో ఎంసీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించడం కష్టమే అని చెప్పాలి.

తదుపరి వ్యాసం