తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన కోహ్లీ, సెహ్వాగ్ సహా మరికొందరు ప్లేయర్లు.. ఎమోషనల్ ట్వీట్స్

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన కోహ్లీ, సెహ్వాగ్ సహా మరికొందరు ప్లేయర్లు.. ఎమోషనల్ ట్వీట్స్

03 June 2023, 15:57 IST

google News
    • Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై క్రీడాకారులు స్పందించారు. ఈ ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ట్వీట్లు చేశారు.
రైలు ప్రమాద దృశ్యమిది (Image : Twitter)
రైలు ప్రమాద దృశ్యమిది (Image : Twitter)

రైలు ప్రమాద దృశ్యమిది (Image : Twitter)

Odisha Train Accident: ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 266 మంది చనిపోగా.. సుమారు 900 మంది గాయపడ్డారు. దేశంలో అత్యంత ఘోర రైలు ప్రమాదంగా ఈ విషాదం ఉంది. బెంగళూరు - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్ - చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి ఢీకొన్నాయి. చాలా బోగీలు పట్టాలు తప్పడంతో అంతులేని విషాదం జరిగింది. ఇంకా సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రైలు విషాదంపై క్రీడాకారులు స్పందించారు. తీవ్ర వేదన కలుగుతోందని ట్వీట్లు చేశారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, మాజీ ప్లేయర్ వీరేందర్ సెహ్వాగ్ సహా చాలా మంది స్పందించారు.

ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‍లో ఉన్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఈ రైలు ప్రమాదం గురించి ట్వీట్ చేశారు. “ఒడిశాలో జరిగిన ఈ విషాదకర ట్రైన్ ప్రమాదం గురించి వినడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. వారి కోసం ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా” అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు.

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా స్పందించారు. “ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇన్‍వాల్వ్ అయిన విషాదకర రైలు ప్రమాదం తీవ్రమైన వేదన కలిగిస్తోంది. తమ ఇష్టమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అని సెహ్వాగ్ పోస్ట్ చేశారు.

“ఒడిశా నుంచి షాకింగ్ దృశ్యాలు చూశా. ఈ విషాదకర రైలు ప్రమాదంలో ప్రభావితమైన వారి కోసం ప్రార్థిస్తున్నా” అని క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ట్వీట్ చేశారు. “హృదయాన్ని కలిచివేసే వార్త ఒడిశా నుంచి వచ్చింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల కోసం నా ప్రార్థనలు ఉంటాయి” అని మాజీ ఆల్‍రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.

“ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నా” అని మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. “ఒడిశాలో జరిగిన దురదృష్టకర ప్రమాదం గురించి తెలిసినప్పటి నుంచి నా మనసును తీవ్రంగా కలత చెందుతోంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నా” అని క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు.

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు వెళ్లనున్నారు. పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. శనివారం ఉదయం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘటన స్థలానికి వెళ్లారు.

తదుపరి వ్యాసం