Gavaskar to Gilchrist: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన గవాస్కర్
10 August 2022, 15:15 IST
- Gavaskar to Gilchrist: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఇండియన్ ప్లేయర్స్‌కు బిగ్ బాస్ లీడ్‌లో ఆడటానికి ఎందుకు ఎన్వోసీ ఇవ్వడం లేదని గిల్లీ అడిగిన ప్రశ్నకు సన్నీ ఘాటుగా స్పందించాడు.
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్: ఇండియన్ క్రికెట్ టీమ్
న్యూఢిల్లీ: క్రికెట్‌లో ఇండియాకు, ఇండియన్ ప్లేయర్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు క్రికెట్‌లో ఈ స్థాయిలో డబ్బు ఉండటానికి కారణంగా ఇండియన్ టీమ్, మన ప్లేయర్స్. ఐపీఎల్ అనే కాన్సెప్ట్ కూడా అంత పెద్ద హిట్ అయి.. బీసీసీఐపై, ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిపించడానికి కారణం కూడా ఇదే. మన స్టార్ ప్లేయర్స్ ఎక్కడ ఆడితే అక్కడికి స్పాన్సర్లు క్యూ కడతారు.
ఇప్పుడదే స్పాన్సర్ల కోసం మన ప్లేయర్స్‌కు బీసీసీఐ అనుమతి ఇవ్వాలంటూ కొందరు విదేశీ మాజీ ప్లేయర్స్ డిమాండ్ చేస్తున్నారని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కొన్నాళ్ల కిందట చేసిన కామెంట్స్‌కు సన్నీ కౌంట్ వేశాడు. స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన కాలమ్‌లో గవాస్కర్ ఘాటుగా స్పందించాడు.
"కొంతమంది మాజీ విదేశీ ఆటగాళ్లు మాట్లాడుతూ.. బిగ్ బాష్ లీగ్ లేదా హండ్రెడ్ టోర్నీలో ఆడేందుకు ఇండియన్ ప్లేయర్స్‌కు అనుమతి ఇవ్వాలని అంటున్నారు. నిజానికి వాళ్లు తమ లీగ్స్‌కు మరింత స్పాన్సర్‌షిప్ కోసమే ఇలా అంటున్నారు. వాళ్లు వాళ్ల క్రికెట్ గురించి ఆలోచిస్తున్నారు. అది సరే. కానీ అదే ఇండియన్ క్రికెట్ ఇప్పుడు తమ ప్లేయర్స్‌కు తగినంత విశ్రాంతి కోసం విదేశీ లీగ్స్‌లో ఆడనివ్వకపోవడంపై ఒకప్పటి క్రికెట్ పవర్ హౌజ్‌లు వ్యతిరేకంగా స్పందిస్తుండటం సరికాదు" అని గవాస్కర్ అన్నాడు.
"వాళ్లు కేవలం ఇండియన్ ప్లేయర్స్‌ను వాళ్ల దేశ లీగ్‌లలో ఆడేందుకు అనుమతించాలని అంటున్నారు తప్ప సపోర్టింగ్ స్టాఫ్ గురించి మాట్లాడటం లేదు. అందులోనూ గొప్ప స్టాఫ్ ఉన్నారు. నిజానికి ఐపీఎల్‌లోనూ ఆస్ట్రేలియా ప్లేయర్స్‌తోపాటు ఆ దేశ సపోర్ట్ స్టాఫ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. దీనిని ఒక విధంగా ఆస్ట్రేలియన్ లీగ్‌గా వాళ్లు పిలిచారు. మరి దీన్నేమనాలి" అని గవాస్కర్ ప్రశ్నించాడు.
ఇండియన్ ప్లేయర్స్‌ను ఇతర లీగ్‌లలో అనుమతించకపోవడంతోపాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీలే ఇండియా బయటకు విస్తరించాలని చూస్తున్నారంటూ గిల్‌క్రిస్ట్ ఈ మధ్య కామెంట్ చేశాడు. సౌతాఫ్రికాలో తొలిసారి జరగబోతున్న టీ20 లీగ్‌లోని ఆరు టీమ్స్‌తోపాటు యూఏఈ, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లలోని కొన్ని టీమ్స్‌ను ఐపీఎల్ ఫ్రాంఛైజీలే కొనుగోలు చేయడంపై గిల్‌క్రిస్ట్ ఇలా స్పందించాడు.