Tennis Terminology | టెన్నిస్‌లో ఈ పదాలకు అర్థమేంటో తెలుసా?
24 January 2022, 21:16 IST
- Tennis Terminology.. అప్పుడప్పుడే ఈ టెన్నిస్ చూస్తున్న వాళ్లకు ఈ స్పోర్ట్‌లో వాడే పదాలు అంత సులువుగా అర్థం కావు. చాలా కాలంపాటు టెన్నిస్‌ను ఫాలో అయితేనే మెల్లగా అందులోని పదాలు, వాటికి అర్థాలు తెలుస్తాయి. టెన్నిస్‌లో స్కోరింగ్ సిస్టమ్, ప్లేయర్స్ ఆడే షాట్లు, కోర్టును విభజించే తీరు వింతగా ఉంటుంది.
బ్యాక్‌హ్యాండ్ షాట్ ఆడుతున్న స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జోకవిచ్
Tennis Terminology.. లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జాలాంటి మేటి ప్లేయర్స్‌తో భారతీయులకు టెన్నిస్ దగ్గరైనా.. క్రికెట్ తెలిసినంత లోతుగా ఈ టెన్నిస్ గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. అప్పుడప్పుడే ఈ టెన్నిస్ చూస్తున్న వాళ్లకు ఈ స్పోర్ట్‌లో వాడే పదాలు అంత సులువుగా అర్థం కావు. చాలా కాలంపాటు టెన్నిస్‌ను ఫాలో అయితేనే మెల్లగా అందులోని పదాలు, వాటికి అర్థాలు తెలుస్తాయి.
టెన్నిస్‌లో స్కోరింగ్ సిస్టమ్, ప్లేయర్స్ ఆడే షాట్లు, కోర్టును విభజించే తీరు వింతగా ఉంటుంది. వీటికి ఉండే పేర్లు, అర్థాలు తెలుసుకోకుండా గేమ్‌ను ఫాలో కావడం కష్టం. అందుకే సాధారణంగా టెన్నిస్‌లో వినిపించే పదాలు ఏంటి? వాటికి అర్థాలు ఏంటి అన్నది ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
పాయింట్: టెన్నిస్‌లో ఇది బేసిక్ స్కోరింగ్. ఓ ప్లేయర్ సర్వ్ చేసిన తర్వాత ఆ సర్వ్ చేసిన ప్లేయర్‌గానీ, ప్రత్యర్థిగానీ పొందే తొలి స్కోరింగ్ ఈ పాయింట్.
గేమ్: నాలుగు వరుస పాయింట్లు సాధించి ఓ ప్లేయర్ గేమ్‌ను గెలుచుకుంటాడు. అయితే ఇక్కడ డ్యూస్ అనే మరో పదం కూడా తెరపైకి వస్తుంది. ఆ పదానికి అర్థం కూడా కింద ఉంది.
సెట్: టెన్నిస్ స్కోరింగ్‌లో సెట్ అనేది మరో యూనిట్‌గా చెప్పవచ్చు. ఓ ప్లేయర్ ప్రత్యర్థి కంటే కనీసం రెండు గేమ్స్ ఎక్కువ ఆధిక్యంలో ఉంటూ ఆరు గేమ్స్ గెలుచుకుంటే సెట్ సొంతం చేసుకుంటాడు. ఒకవేళ స్కోరు 6-6తో సమమైతే.. టైబ్రేకర్ ఉంటుంది.
మ్యాచ్: చివరిగా మూడు లేదా ఐదు సెట్‌లలో ఎక్కువ సెట్లు గెలిచిన ప్లేయర్ మ్యాచ్‌లో విజేతగా నిలుస్తారు.
సర్వీస్: బ్యాడ్మింటన్‌లో పాయింట్‌తోపాటు సర్వీస్ మారుతుంది. కానీ టెన్నిస్‌లో ఒక్కో గేమ్ ఒక్కో ప్లేయర్ సర్వీస్ చేస్తారు.
ర్యాలీ: ఒక పాయింట్ సాధించడానికి ప్లేయర్స్ మధ్య నడిచే షాట్లనే ర్యాలీగా పిలుస్తారు. ఓ ర్యాలీ సుదీర్ఘంగా సాగిందని మీరు ఎప్పుడోసారి చదివే ఉంటారు. అంటే ఓ పాయింట్ సాధించడానికి ప్లేయర్స్ చాలా షాట్లే ఆడాల్సి వచ్చిందని అర్థం.
టెన్నిస్ కోర్ట్
టెన్నిస్ కోర్టును వివిధ భాగాలుగా విభజిస్తారు. ఈ సర్వీస్, మిగతా షాట్ల గురించి తెలియాలంటే కోర్టులోని ఈ భాగాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఫోర్ కోర్ట్ : సర్వీస్ లైన్, నెట్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఫోర్ కోర్టుగా పిలుస్తారు. ఈ ఫోర్ కోర్టును ఓ నిలువు గీతతో యాడ్ కోర్ట్, డ్యూస్ కోర్ట్‌లుగా విభజిస్తారు. ప్లేయర్ చేసిన సర్వ్ కచ్చితంగా ఫోర్ కోర్టులోనే బౌన్స్ కావాలన్న నిబంధన ఉంది.
యాడ్ కోర్ట్: ఒక్కో ప్లేయర్ తమ ఫోర్ కోర్టులోని ఎడమవైపు ఉన్న ప్రాంతాన్ని యాడ్ కోర్టుగా పిలుస్తారు.
డ్యూస్ కోర్ట్: ఇక ప్లేయర్‌కు కుడి వైపు ఉండే ఫోర్ కోర్టు భాగాన్ని డ్యూస్ కోర్ట్ అంటారు.
బేస్‌లైన్: టెన్నిస్ కోర్టు ముగిసే చివరి లైన్‌నే బేస్‌లైన్ అంటారు. కోర్టుకు రెండు వైపులా నెట్‌కు 39 అడుగుల దూరంలో ఈ బేస్‌లైన్ ఉంటుంది.
బ్యాక్‌కోర్ట్: సర్వీస్ లైన్, బైస్‌లైన్ మధ్య ఉండే భాగాన్ని బ్యాక్ కోర్ట్‌గా పిలుస్తారు.
సెంటర్ మార్క్: నాలుగు అంగుళాల పొడవుతో బేస్‌లైన్ మధ్యలో ఈ సెంటర్ మార్క్ ఉంటుంది. యాడ్ కోర్ట్, డ్యూస్ కోర్ట్‌లను విభజించే గీతకు సమాంతరంగా ఈ సెంటర్ మార్క్ ఉంటుంది.
సర్వీస్ లైన్: నెట్ నుంచి 21 అడుగుల దూరంలో ఫోర్ కోర్ట్, బ్యాక్ కోర్ట్‌లను విభజిస్తూ ఈ సర్వీస్ లైన్ ఉంటుంది.
ట్రామ్‌లైన్స్: కోర్టుకు రెండువైపులా 4 అడుగుల 6 అంగుళాల వెడల్పుతో కనిపించే ప్రత్యేక ప్రాంతాన్ని ట్రామ్‌లైన్స్‌గా పిలుస్తారు. సింగిల్స్ మ్యాచ్‌లో బంతి ఇందులో పడితే ఔటైనట్లు. అదే డబుల్స్ మ్యాచ్‌కు మాత్రం ఈ ట్రామ్‌లైన్స్ కూడా ఆటలో భాగమే.
టెన్నిస్ స్కోరింగ్
టెన్నిస్ స్కోరింగ్‌లోనూ కొన్ని పదాలు ఉన్నాయి. ఏస్, డ్యూస్, లవ్ వంటి పదాలు మీరు టెన్నిస్ చూస్తున్నప్పుడు వినిపిస్తాయి. మరి వీటికి అర్థాలు ఏంటి?
ఏస్: ఓ ప్లేయర్ చేసే లీగల్ సర్వ్‌ను ప్రత్యర్థి ప్లేయర్ అందుకోలేనప్పుడు దానిని ఏస్ అంటారు. ప్రతి ఏస్‌కు సర్వర్ ఒక పాయింట్ గెలుచుకుంటారు.
డ్యూస్: ఈ ఆర్టికల్ మొదట్లో డ్యూస్ అనే పదం చదివారు కదా. దీనికి అర్థం ఇద్దరు ప్లేయర్స్ ఒక గేమ్‌లో సమానమైన పాయింట్లు సాధించడం. 40-40 స్కోరుతో ఉంటే దానిని డ్యూస్‌గా పిలుస్తారు.
అడ్వాంటేజ్: డ్యూస్ తర్వాత పాయింట్ గెలిస్తే ఆ ప్లేయర్ స్కోరును అడ్వాంటేజ్‌గా పిలుస్తారు. అదే ప్లేయర్ వెంటనే మరో పాయింట్ సాధిస్తే గేమ్ సొంతమవుతుంది. ఆ సమయంలో ప్రత్యర్థి పాయింట్ సాధిస్తే స్కోరు మళ్లీ డ్యూస్(40-40)కు వెళ్తుంది.
బ్రేక్ పాయింట్: ఓ ప్లేయర్ చేసే సర్వ్‌ను ప్రత్యర్థి బ్రేక్ చేయడానికి ఉపయోగపడే పాయింట్‌ను బ్రేక్ పాయింట్ అంటారు.
ఫాల్ట్: సర్వ్ చేసే ప్లేయర్ దానిని ప్రత్యర్థి ఫోర్ కోర్ట్‌లో బౌన్స్ చేయకపోయినా, బంతి నెట్‌కు తగిలినా దానిని ఫాల్ట్‌గా పిలుస్తారు.
డబుల్ ఫాల్ట్: సర్వీస్ చేసే ప్లేయర్ వరుసగా రెండు తప్పిదాలు చేస్తే అవతలి ప్లేయర్‌కు ఆటోమేటిగ్గా పాయింట్ వస్తుంది. దీనినే డబుల్ ఫాల్ట్ అంటారు.
ఫుట్ ఫాల్ట్: సర్వ్ చేసే ప్లేయర్ ఆ సమయంలో బేస్‌లైన్ లేదా సెంటర్ మార్క్‌కు తన కాలిని తగిలిస్తే దానిని ఫుట్ ఫాల్ట్‌గా చెబుతారు.
లెట్: మ్యాచ్ స్కోరులో మార్పు లేకుండా ఓ పాయింట్ కోసం రిఫరీ మరోసారి సర్వ్‌కు ఆదేశిస్తే దానిని లెట్ అంటారు. అంటే ప్లేయర్ చేసిన సర్వ్ నెట్‌కు తగిలిన తర్వాత ప్రత్యర్థి ఫోర్‌కోర్ట్‌లో బౌన్స్ అయితే దానిని లీగల్ సర్వ్‌గా అనుమతించరు. మరోసారి సర్వ్ చేయాల్సి ఉంటుంది.
లవ్: జీరోనే టెన్నిస్‌లో లవ్‌గా పిలుస్తారు. పాయింట్లు, గేమ్‌లు, సెట్‌లు.. వేటిలో అయినా జీరోని లవ్ అనే అంటారు. ఒక ప్లేయర్ స్కోరు 15-0 గా ఉంటే దీనిని 15 లవ్‌గా పలుకుతారు. అంటే సర్వ్ చేసే ప్లేయర్ స్కోరు 15, ప్రత్యర్థి స్కోరు జీరో.
టైబ్రేక్: ఈ పదాన్ని కూడా ఈ ఆర్టికల్‌లోనే మీరు చదివారు. ఒకవేళ ఒక సెట్‌లో ఇద్దరు ప్లేయర్స్ 6-6 గేమ్స్ గెలుచుకుంటే.. ఆ సెట్ విజేతను తేల్చడానికి టైబ్రేకర్ నిర్వహిస్తారు. ఇందులో ఏ ప్లేయర్ అయితే మొదట 7 పాయింట్లను అందుకుంటే ఆ ప్లేయర్ విజేతగా నిలుస్తారు. ఈ టై బ్రేకర్‌లో తొలి పాయింట్ తర్వాత సర్వ్ మారుతుంది. ఆ తర్వాత ప్రతి రెండు పాయింట్లకు సర్వ్ మారుతుంది. ఇందులోనూ ప్రత్యర్థిపై స్పష్టంగా రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉండాలి.
కెరీర్ స్లామ్: టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లలో ఒక్కో గ్రాండ్‌స్లామ్‌ను తమ కెరీర్‌లలో ఏదో ఒక సమయంలో గెలిస్తే దానిని కెరీర్ స్లామ్‌గా పిలుస్తారు.
గోల్డెన్‌స్లామ్: ఒకే సీజన్‌లో మొత్తం నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిస్తే గోల్డెన్ స్లామ్ అంటారు.
గ్రాండ్‌స్లామ్: టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకమైన టోర్నీని గ్రాండ్‌స్లామ్‌గా పిలుస్తారు. ప్రతి ఏటా ఆస్ట్రేలియన్, యూఎస్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అనే నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు జరుగుతాయి.
ఓపెన్ ఎరా: 1968 తర్వాత టెన్నిస్‌ను ఓపెన్ ఎరాగా పిలుస్తారు. అంటే ఆ ఏడాది నుంచి టెన్నిస్ ఇటు ప్రొఫెషనల్ ప్లేయర్స్‌కు, అటు అమెచ్యూర్ ప్లేయర్స్‌కు కూడా ఓపెన్ అయిందని అర్థం.
టెన్నిస్ షాట్స్
టెన్నిస్‌లో ప్లేయర్స్ ఆడే షాట్లను కూడా వివిధ పేర్లతో పిలుస్తారు. లైవ్‌లో టెన్నిస్ మ్యాచ్‌ను చూసే సమయంలో ఈ షాట్ల గురించి తెలిసి ఉంటే.. సులువుగా గేమ్‌ను అర్థం చేసుకోవచ్చు.
సర్వ్: సర్వ్ లేదా సర్వీస్ అనేది పాయింట్‌కు ప్రారంభం. సాధారణంగా టెన్నిస్‌లో బంతిని గాల్లోకి ఎగరేసి తమ రాకెట్‌తో బలంగా కొట్టడం చూస్తుంటాం. దీనినే సర్వ్ అంటారు. బేస్‌లైన్ వెనుక నుంచి ఈ సర్వ్ చేస్తారు. ఒక్కో పాయింట్ కోసం ఫస్ట్, సెకండ్ పేరుతో రెండు సర్వ్‌లు చేసే అవకాశం ప్లేయర్స్‌కు ఉంటుంది.
ఫోర్‌హ్యాండ్: రైట్ హ్యాండ్ లేదా లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ తన అరచేతికి ముందుకు పెట్టి షాట్ ఆడటాన్ని ఫోర్‌హ్యాండ్ షాట్ అంటారు.
బ్యాక్‌హ్యాండ్: అదే ప్లేయర్ తన చేతి వెనుక భాగాన్ని ముందు పెట్టి ఆడే షాట్‌ను బ్యాక్‌హ్యాండ్ షాట్ అంటారు.
వాలీ: ప్రత్యర్థి ప్లేయర్ కొట్టిన షాట్ తన వైపు కోర్టులో బౌన్స్ అవకముందే ఓ ప్లేయర్ ఆ బంతిని తిరిగి అవతలి వైపు పంపిస్తే ఆ షాట్‌ను వాలీ అంటారు.