Badminton | బ్యాడ్మింటన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన టోర్నీల గురించి తెలుసా?
24 January 2022, 20:21 IST
- ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధులాంటి వాళ్లు పతకాలు గెలిచిన తర్వాత బ్యాడ్మింటన్ వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే స్థాయికి మన ప్లేయర్స్ చేరారు. స్టార్ ప్లేయర్స్ అకాడమీలు పెట్టి అంతర్జాతీయ స్థాయి ప్లేయర్స్‌ను దేశానికి అందిస్తున్నారు.
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
బ్యాడ్మింటన్.. ఇండియాలో క్రికెట్ తర్వాత ఆ స్థాయి క్రేజ్‌ను వేగంగా సంపాదించుకుంటున్న స్పోర్ట్. ముఖ్యంగా ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధులాంటి వాళ్లు పతకాలు గెలిచిన తర్వాత బ్యాడ్మింటన్ వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. బ్యాడ్మింటన్‌లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే స్థాయికి మన ప్లేయర్స్ చేరారు. పుల్లెల గోపీచంద్, ప్రకాశ్ పదుకోన్‌లాంటి ఒకప్పటి స్టార్ ప్లేయర్స్ అకాడమీలు పెట్టి అంతర్జాతీయ స్థాయి ప్లేయర్స్‌ను దేశానికి అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్యాడ్మింటన్ గేమ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే టోర్నీలు ఏవి? అవి ఎన్నేళ్లకోసారి జరుగుతాయి? అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్
ఒలింపిక్స్ విశ్వక్రీడా వేదిక. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌లోకి 1992లో ఎంట్రీ ఇచ్చింది బ్యాడ్మింటన్. అప్పటి నుంచీ మిగతా అన్ని ప్రతిష్టాత్మక టోర్నీల్లోలాగే ఒలింపిక్స్ పతకానికి కూడా ప్లేయర్స్ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇండియా తరఫున సైనా బ్రాంజ్, సింధు సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే. మెన్స్, వుమెన్స్ సింగిల్స్, డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్
బ్యాడ్మింటన్‌లో సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్. తొలిసారి 1899లో జరిగింది. నిజానికి ఏ క్రీడలోనూ ఇంత సుదీర్ఘ కాలంగా సాగుతున్న టోర్నీ మరొకటి లేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ప్రారంభమైనంత వరకూ ప్లేయర్స్ ఈ ఆల్ ఇంగ్లండ్ టోర్నీనే మేజర్ టోర్నీగా భావించే వారు. అయితే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న టోర్నమెంట్ కావడంతో ఇప్పటికీ ఆల్‌ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ గెలవాలని ప్లేయర్స్ కలలు కంటుంటారు.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్
క్రికెట్‌కు వరల్డ్‌కప్ ఎలాగో బ్యాడ్మింటన్‌లో ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ కూడా అంతే. 1977లో తొలిసారి ఈ టోర్నీ జరిగింది. మొదట్లో ఈ టోర్నీ ప్రతి మూడేళ్లకోసారి జరిగేది. 1985 నుంచి 2006 వరకూ ప్రతి రెండేళ్లకు నిర్వహించారు. ఇక 2006 నుంచి అయితే ఏటా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ టోర్నీ జరుగుతోంది. ఒలింపిక్స్ జరిగే ఏడాది మాత్రం ఈ టోర్నీ ఉండదు. ఈ టోర్నీతోనే ప్లేయర్స్‌కు ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్లు వస్తాయి. విచిత్రం ఏంటంటే.. ఈ టోర్నీలో గెలిచినందుకు క్యాష్ ప్రైజ్ ఏమీ ఉండదు. కానీ వరల్డ్ ఛాంపియన్ అన్న తృప్తితో గెలిచిన ప్లేయర్ ఇంటికి వెళ్తారు.
బీడబ్ల్యూఎఫ్ సీనియర్, జూనియర్ చాంపియన్‌షిప్స్
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీనియర్, జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ కూడా జరుగుతాయి. సీనియర్ కేటగిరీ అంటే 35 ఏళ్లు పైబడిన వాళ్లకే ఎంట్రీ. ఇందులో 75 ఏళ్ల వయసు వరకూ ఉన్న ప్లేయర్స్ కూడా పాల్గొనవచ్చు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో ప్లేయర్స్‌ను వివిధ ఏజ్ గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అటు జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 19 ఏళ్లలోపు యువ ప్లేయర్స్‌కు అవకాశం కల్పిస్తారు. ప్రతి ఏటా జూనియర్ ఛాంపియన్‌షిప్స్ జరుగుతాయి. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లు కూడా ఇందులో ఉంటాయి.
థామస్ / ఉబెర్ కప్
థామస్/ ఉబెర్ కప్‌లు కూడా బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నీలే. పురుషుల టీమ్స్ మాత్రమే పాల్గొనే టోర్నీ థామస్ కప్ కాగా.. మహిళల టీమ్స్ కోసం ఉబెర్ కప్ నిర్వహిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి 1948-49ల్లో థామస్ కప్ జరిగింది. సర్ జార్జ్ అలన్ థామస్ పేరు మీదుగా ఈ టోర్నీకి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత 1956-57లో మహిళల కోసం ఉబెర్ కప్ ప్రారంభించారు. ఈ రెండు టోర్నీలు టీమ్ ఈవెంట్లు కాగా.. ప్రతి రెండేళ్లకోసారి జరుగుతాయి.
మొదట్లో అమెరికా, యూరప్, పసిఫిక్ క్వాలిఫయింగ్ జోన్లు ఉండేవి. ఆ తర్వాత పాల్గొనే దేశాల సంఖ్య పెరగడంతో అదనపు జోన్లను చేర్చారు. ఈ జోన్లలో విజేతలు మధ్య జరిగే పోటీలతో ఛాంపియన్ దేశం ఏదో తేలుతుంది.
సుదిర్మన్ కప్
వరల్డ్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌గా ఈ సుదిర్మన్ కప్ పేరుగాంచింది. ప్రతి సుదిర్మన్ కప్‌లో ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇండోనేషియా మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ డిక్ సుదిర్మన్ పేరు మీదుగా ఈ టోర్నీకి ఆ పేరు వచ్చింది. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్ పాయింట్లను పెంచుకోవడానికి ప్లేయర్స్‌కు ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతుంది.