IND vs WI: అక్షర్ పటేల్ ధనాధన్ బ్యాటింగ్ - వన్డే సిరీస్ టీమ్ ఇండియా కైవసం
25 July 2022, 6:19 IST
ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) మెరుపు బ్యాటింగ్ తో వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో టీమ్ ఇండియా విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో వన్డే సిరీస్ ను 2- 0 తేడాతో సొంతం చేసుకున్నది.
అక్షర్ పటేల్
వెస్టిండీస్ తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమ్ ఇండియా రెండు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2 - 0 తేడాతో కైవసం చేసుకున్నది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్ తో టీమ్ ఇండియా ఈ మ్యాచ్ లో గట్టెక్కింది. ఓటమి దిశగా పయనిస్తున్న భారత జట్టుకు టెయిలెండర్లతో కలిసి సూపర్ విక్టరీని అందించాడు అక్షర్ .
ఈ మ్యాచ్ టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. షై హోప్ సెంచరీ తో రాణించడంతో వెస్టిండీస్ యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 135 బాల్స్ లో మూడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 115 రన్స్ చేశాడు షై హోప్. అతడికి కెప్టెన్ పూరన్ చక్కటి సహకారం అందించాడు. 77 బాల్స్ లో ఆరు సిక్సర్లు, ఓ ఫోర్ తో 74 రన్స్ చేశాడు పూరన్. మేయర్స్ 39 పరుగులు, బ్రూక్స్ 35 రన్స్ చేశారు. టీమ్ ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, దీపక్, అక్షర్, చాహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
312 పరుగల టార్గెట్ తో బరిలో దిగిన టీమ్ ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ ధావన్ 13 రన్స్ మాత్రమే చేసి వెనుదిరిగాడు. శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ టీమ్ ఇండియాను ఆదుకున్నారు. స్కోరు వేగం పెంచే ప్రయత్నంలో 49 బాల్స్ లో 43 రన్స్ చేసిన శుభ్ మన్ ఔటయ్యాడు. సూర్యకుమార్ మరోసారి నిరాశపరిచాడు. తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. సంజూ శాంసన్ తో కలిసి శ్రేయస్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. శ్రేయస్ అయ్యర్ 63 రన్స్, సంజూ శాంసన్ 54 రన్స్ వద్ద ఔటయ్యారు.
కీలక సమయంలో వీరిద్దరు ఔట్ కావడంతో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. సాధించాల్సిన రన్ రేట్ కూడా పదికిపైగా ఉండటం, ప్రధాన బ్యాట్స్ మెన్స్ అందరూ ఔట్ కావడంతో టీమ్ ఇండియా గెలవడం కష్టమేనని అనిపించింది. కానీ అక్షర్ పటేల్ బ్యాటింగ్ విశ్వరూపంతో మరో రెండు బంతులు మిగిలుండగానే టార్గెట్ ను ఛేదించింది. 35 బాల్స్ లోనే ఐదు సిక్సర్లు, మూడు ఫోర్లతో అక్షర్ 64 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీపక్ హుడా 33 రన్స్ చేశాడు. 49.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి టీమ్ ఇండియా 312 రన్స్ చేసింది. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసెఫ్, కైల్ మేయర్స్ తలో రెండు వికెట్లు తీశారు.
టాపిక్