Sports | ఆటలతో ఒత్తిడిని చిత్తు చేయండిలా!
24 January 2022, 20:20 IST
- Sports.. ఒత్తిడి క్రమంగా మనిషిని బలహీనుడిగా మారుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఈ ఒత్తిడిని చిత్తు చేయడానికి ఆటలకు మించిన మందు మరొకటి లేదు. ఏదైనా మీకిష్టమైన స్పోర్ట్‌ను ఎంచుకొని ప్రతి రోజూ ఆడితే.. ఒత్తిడి మీ దరి చేరదు.
ఆటలతో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయి
Sports.. గడియారంతో పరుగులు పెడుతున్న ఈ కాలంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురవుతూనే ఉన్నాడు. పని ఎక్కువ కావడం వల్ల, అనుకున్న పని సమయానికి జరగకపోవడం వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, బాధ్యతలు ఎక్కువ కావడం వల్ల, ఒంటరితనం వల్ల, అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఇలా ఒత్తిడికి ఎన్నో కారణాలు. ఈ ఒత్తిడి క్రమంగా మనిషిని బలహీనుడిగా మారుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
అయితే ఈ ఒత్తిడిని చిత్తు చేయడానికి ఆటలకు మించిన మందు మరొకటి లేదు. ఏదైనా మీకిష్టమైన స్పోర్ట్స్ ఎంచుకొని ప్రతి రోజూ ఆడితే.. ఒత్తిడి మీ దరి చేరదు. ఆటలు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఆటలు ఆడటానికి, ఒత్తిడి తగ్గడానికి ఏమిటి సంబంధం? అసలు మనం ఒత్తిడిలో ఉన్నట్లు ఎలా గుర్తించాలి అన్న విషయాలు మీకోసం.
ఒత్తిడిని ఎలా గుర్తించాలి?
ఓ మనిషి ఒత్తిడిలో ఉన్నాడని చెప్పడానికి అతని శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటికి ఎవరికి వారుగా అయినా, ఎదుటివారు అయినా గుర్తించవచ్చు. ఒత్తిడిలో ఉన్న వ్యక్తి ఆందోళనగా ఉంటారు. చిరాకు పడుతుంటారు. మెదడులో ఆలోచనలు పరుగెడుతుంటాయి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోవడం, అకారణంగా ఎదుటివారిపై కోప్పడుతుండటం వంటివి చేస్తుంటారు. తలనొప్పి, కండరాల నొప్పి, మగతగా ఉండటం వంటి లక్షణాలు ఒత్తిడికి గురైనప్పుడు కనిపిస్తాయి.
ఆటలతో ఒత్తిడికి చెక్
ఆటలతో మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా ఆట ఆడినప్పుడు అది శరీరంలోని రక్తపోటును తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. రక్తపోటు తగ్గితే మనిషి ఆలోచించే, వ్యవహరించే తీరు కూడా సాధారణంగా ఉంటుంది. ఇది గుండెపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకున్నప్పుడు, శరీరం బలహీనంగా మారుతుందనుకున్నప్పుడు మీకిష్టమైన ఆట ఆడటం ప్రారంభించండి. ఆటల వల్ల శరీరం అలసిపోయి రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది.
నిద్ర సరిగా ఉంటే.. ఒత్తిడే కాదు సగం అనారోగ్య సమస్యలు దూరమైనట్లే. ఉదయాన్నే ఏవైనా కసరత్తులు చేసినా, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, రన్నింగ్ వంటివి చేసినా.. రోజంతా మీరు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. స్పోర్ట్స్ అనేవి ఆత్మవిశ్వాసం పెరగడానికి కూడా తోడ్పడతాయి. అప్పుడప్పుడూ ఏవైనా స్పోర్ట్స్ కాంపిటిషన్‌లో పాల్గొంటూ ఉండండి. గెలుపోటములతో సంబంధం లేకుండా మీ ఆత్మవిశ్వాసం పెరగడాన్ని గమనించవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఏవైనా కసరత్తులు లేదంటే ఆటలతో గడిపితే శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. ఏదో ఒక ఆట కాకుండా మీకిష్టమైన ఆట ఎంచుకొని ప్రతి రోజూ ఆడటం వల్ల జరిగే మేలు మరింత ఎక్కువగా ఉంటుంది.
స్పోర్ట్స్ ఆడితే ఏం జరుగుతుంది?
ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వారిలో 75 శాతం నుంచి 90 శాతం మంది ఒత్తిడితో సతమతమవుతున్న వాళ్లేనని ఓ సర్వేలో తేలింది. అందుకే సింపుల్‌గా ప్రతి రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలపాటు ఏవైనా ఎక్సర్‌సైజులు చేయడం లేదంటే ఆటలు ఆడటం వల్ల మీ మెదడులో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. నొప్పిని, ఒత్తిడిని తగ్గించేవి ఈ ఎండార్ఫిన్లే. అంతేకాదు ఒత్తిడికి కారణమైన కార్టిసాల్, అడ్రినలైన్ హార్మోన్ల స్థాయిలను కూడా తగ్గిస్తాయి.
ఉదయాన్నే అరగంటసేపు ఏదైనా ఆట ఆడితే అది ఆ తర్వాత కొన్ని గంటల పాటు మీ మెదడు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దీంతో మీ మూడ్ మెరుగవుతుంది. ఏదైనా ఆటను సీరియస్‌గా ఆడుతున్న సమయంలో మీకున్న సమస్యలపై నుంచి కూడా మీ దృష్టి మరలుతుంది. ఇది కూడా ఒకరకంగా ఒత్తిడిని తగ్గేలా చేస్తుంది. ఇక వ్యక్తిగతంగా ఆడే స్పోర్ట్స్ కంటే ఓ టీమ్‌గా ఆడే స్పోర్ట్స్ వల్ల మీ మానసిక ఆరోగ్యం మరింత మెరగవుతుందని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు తేల్చారు.