తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shoaib Akhtar On Pakistan Team: ఈ పాకిస్థాన్‌ టీమ్‌ కచ్చితంగా తొలి రౌండ్‌లోనే ఇంటికొచ్చేస్తుంది: అక్తర్‌

Shoaib Akhtar on Pakistan Team: ఈ పాకిస్థాన్‌ టీమ్‌ కచ్చితంగా తొలి రౌండ్‌లోనే ఇంటికొచ్చేస్తుంది: అక్తర్‌

Hari Prasad S HT Telugu

16 September 2022, 10:46 IST

    • Shoiab Akhtar on Pakistan Team: ఈ పాకిస్థాన్‌ టీమ్‌ కచ్చితంగా తొలి రౌండ్‌లోనే ఇంటికొచ్చేస్తుందంటూ టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌పై సంచలన కామెంట్స్‌ చేశాడు మాజీ పేస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌. అంతేకాదు చీఫ్‌ సెలక్టర్‌పైనా తీవ్రంగా మండిపడ్డాడు.
షోయబ్ అక్తర్, పాకిస్థాన్ క్రికెట్ టీమ్
షోయబ్ అక్తర్, పాకిస్థాన్ క్రికెట్ టీమ్

షోయబ్ అక్తర్, పాకిస్థాన్ క్రికెట్ టీమ్

Shoiab Akhtar on Pakistan Team: టీ20 వరల్డ్‌కప్‌ కోసం గురువారం (సెప్టెంబర్‌ 15) పాకిస్థాన్‌ ఎంపిక చేసిన టీమ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ టీమ్‌ మాజీ క్రికెటర్లు షోయబ్‌ అక్తర్‌, మహ్మద్‌ ఆమిర్‌లు సెలక్షన్‌పై మండిపడుతున్నారు. చీఫ్‌ సెలక్టర్‌ చేసిన చీప్‌ సెలక్షన్‌ అంటూ ఆమిర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఇక మరో మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అయితే ఈ టీమ్‌ టీ20 వరల్డ్‌కప్‌ తొలి రౌండ్‌లోనే ఇంటికొచ్చేస్తుందని అనడం గమనార్హం. టీమ్‌ ఎంపిక తర్వాత తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అక్తర్‌ మాట్లాడాడు. చీఫ్‌ సెలక్టర్‌ యావరేజ్ అయినప్పుడు టీమ్ కూడా యావరేజ్‌గానే ఉంటుందని అక్తర్‌ తీవ్రంగా స్పందించాడు. ఇక హెడ్‌ కోచ్‌ సక్లైన్‌ ముస్తాక్‌పై విమర్శలు గుప్పించాడు.

అతడు ఎప్పుడో 2002లో రిటైరయ్యాడని, అతనికి టీ20 క్రికెట్‌ గురించి ఏమీ తెలియదని అనడం విశేషం. పాకిస్థాన్‌ మిడిలార్డర్‌ చాలా బలహీనంగా ఉందని, ఇలాంటి టీమ్‌ను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదని అక్తర్‌ చెప్పాడు. ఆస్ట్రేలియా కండిషన్స్‌లో ఇలాంటి టీమ్‌తో ఆడటం చాలా కష్టమని, అందులోనూ ఇండియాతో తొలి మ్యాచ్‌ ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేశాడు.

ఇలాంటి టీమ్‌ సెలక్షన్‌ కారణంగా రానున్న రోజుల్లో పాకిస్థాన్‌ చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోబోతోందని, కోచ్‌లు, టీమ్‌ స్టాఫ్‌ ఎగిరిపోవడం ఖాయమని కూడా అన్నాడు. మహ్మద్‌ యూసుఫ్‌లాంటి వ్యక్తి బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న టీమ్‌ బ్యాటింగ్‌ ఇంత బలహీనంగా ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. ఫకర్‌ జమాన్‌ను ఎంపిక చేయకపోవడంపై అక్తర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా కండిషన్స్‌ అతనికి బాగా అనుకూలించేవని అన్నాడు.

చీఫ్‌ సెలక్టర్‌ మహ్మద్‌ వసీమ్‌, హెడ్‌ కోచ్‌ సక్లైన్‌ ముస్తాక్‌ తీసుకున్న నిర్ణయాలు తనకు తీవ్ర అసంతృప్తి మిగిల్చాయని, చాలా ఆగ్రహంగా ఉందని అక్తర్‌ స్పష్టం చేశాడు. ఇలాంటి టీమ్‌తో తొలి రౌండ్‌ దాటడం కూడా కష్టమేనని, కావాలంటే ఈ వీడియోను సేవ్‌ చేసి పెట్టుకోందని చెప్పాడు. ఎంతో మంది మంచి ప్లేయర్స్‌ అందుబాటులో ఉన్నా.. ఇలాంటి టీమ్‌ను ఎంపిక చేయడమేంటో అర్థం కాలేదని అన్నాడు.

ఇక కెప్టెన్‌ బాబర్‌ ఆజంపైనా అక్తర్‌ తీవ్ర విమర్శలు చేశాడు. అసలు ఫామ్‌లో లేని సమయంలో క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించకుండా క్లాసిక్‌ కవర్‌ డ్రైవ్‌లు ఆడటానికి ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశాడు. తన ఆందోళన అంతా ఈ పాకిస్థాన్‌ టీమ్‌ బ్యాటింగ్‌పైనే అని స్పష్టం చేశాడు.

తదుపరి వ్యాసం