Shoaib Akhtar Biopic : నాకు నచ్చలే.. తన బయోపిక్ మీద షోయబ్ అక్తర్ షాకింగ్ నిర్ణయం
22 January 2023, 11:21 IST
- Shoaib Akhtar Biopic Rawalpindi Express : రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేరుతో షోయబ్ అక్తర్ మీద బయోపిక్ ప్లాన్ చేశారు. అయితే దాని నుంచి తప్పుకుంటున్నట్టుగా అక్తర్ ప్రకటించాడు.
షోయబ్ అక్తర్(ఫైల్ ఫొటో)
రావల్పిండి ఎక్స్‌ప్రెస్(Rawalpindi Express) అంటే వెంటనే గుర్తొచ్చేది పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్(Shoaib Akhtar). అదే పేరుతో బయోపిక్ ప్లాన్ చేశారు. అయితే దీనిని నుంచి తప్పుకొంటున్నట్టుగా అక్తర్ ప్రకటించాడు. క్యూ ఫిలిం ప్రొడక్షన్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మహ్మద్ ఫర్హాజ్ ఖాసిర్ దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమా విషయంపై అక్తర్ తాజాగా ట్విట్ చేశాడు.
కొన్ని ఘటనలతో ప్రొడక్షన్ హౌస్ తో అక్తర్ కు విబేధాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే బయోపిక్(Biopic) నుంచి తప్పుకున్నట్టుగా తెలిపాడు. అయితే వార్నింగ్ కూడా ఇచ్చాడు ఫాస్ట్ బౌలర్. తన అనుమతి లేకుండా తన బయోపిక్ తీస్తే.. లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్టుగా హెచ్చరించాడు.
'చాలా బాధకరంగా ఉంది. నెలల తరబడి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత నా మేనేజ్‌మెంట్, లీగల్ టీమ్ ద్వారా రావల్పిండి ఎక్స్ ప్రెస్(Rawalpindi Express) ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాను. చిత్రం నుంచి బయటకు వస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. కొన్ని విషయాలను నిరోధించడానికి చాలా ప్రయత్నించాను. కానీ దురదృష్టవశాత్తు సరిగ్గా జరగలేదు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడంలో వైఫల్యం చెందాం. ఒప్పంద ఉల్లంఘనలు జరిగాయి. చివరకు మేం వారితో సంబంధాలను తెంచుకునేలా చేశాయి. నా జీవిత కథపై హక్కులను ఉపసంహరించుకునేందుకు అన్ని చట్టపరమైన ప్రోటోకాల్‌ను పాటించిన తర్వాత ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించాను. మేకర్స్ నా బయోగ్రఫీని ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.'అని షోయబ్ ప్రకటించాడు.
పాకిస్థాన్ క్రికెట్లో అక్తర్ ది ప్రత్యేక స్థానం. 1997లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2011లో ఆటకు గుడ్ బై చెప్పాడు అక్తర్. ఫాస్ట్ బౌలర్ గా ప్రసిద్ధి చెందాడు. 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 161 కి.మీ వేగంతో విసిరిన బంతి క్రికెట్(Cricket) చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిగా కొన్నేళ్ల పాటు నిలిచింది.
ఈ చిత్రానికి ముహమ్మద్ ఫరాజ్ ఖైజర్ దర్శకత్వం వహించారు. కైజర్ నవాజ్ రచించారు. Q ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. గత ఏడాది జూలైలో ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను పాకిస్థాన్ షేర్ చేశాడు అక్తర్. 'ఈ అందమైన ప్రయాణం ప్రారంభం. నా కథ, నా జీవితం, నా బయోపిక్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్.' అంటూ అక్తర్ ట్విట్టర్‌లో అప్పట్లో పేర్కొన్నాడు.