తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shikhar Dhawan: ఆ మెగా ఈవెంట్‍లో టీమిండియాకు కెప్టెన్‍గా శిఖర్ ధావన్!

Shikhar Dhawan: ఆ మెగా ఈవెంట్‍లో టీమిండియాకు కెప్టెన్‍గా శిఖర్ ధావన్!

29 June 2023, 23:59 IST

google News
    • Shikhar Dhawan: ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా పాల్గొంటే.. జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‍గా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రపంచకప్‍నకు ఎంపిక కాని ఆటగాళ్లతో టీమ్‍ను ఏషియన్ గేమ్స్‌కు పంపాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు సమాచారం. 
శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ (PTI)

శిఖర్ ధావన్

Shikhar Dhawan: ఈ ఏడాది సెప్టెంబర్ 23 - అక్టోబర్ 8 మధ్య చైనాలోని హంగ్‍జావూ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. ఈసారి ఈ మెగా క్రీడా ఈవెంట్‍లో క్రికెట్ కూడా ఉంది. అయితే, అక్టోబర్ - నవంబర్ మధ్య భారత్ వేదికగా 2023 వన్డే ప్రపంచకప్ జరగనుంది. దీంతో టీమిండియా ప్రధాన జట్టును ఏషియన్ గేమ్స్‌కు పంపలేని పరిస్థితిలో బీసీసీఐ ఉంది. దీంతో ప్రపంచకప్‍నకు ఎంపిక చేసే టీమిండియాలో.. చోటు దక్కించుకోని భారత ఆటగాళ్లతో బీ టీమ్‍ను ఎంపిక చేసి ఏషియన్ గేమ్స్‌కు పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ టీమ్‍కు సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్‍ను కెప్టెన్‍గా నియమించాలని బీసీసీఐ యోచిస్తోందని రిపోర్టులు బయటికి వచ్చాయి. వివరాలివే..

ఏషియన్ గేమ్స్‌లో 2014 ఎడిషన్‍లో చివరిసారిగా క్రికెట్ ఈవెంట్ జరిగింది. అయితే అప్పుడు భారత క్రికెట్ జట్లు పాల్గొనలేదు. ఆ తర్వాత ఎడిషన్‍లో క్రికెట్‍కు చోటు దక్కలేదు. అయితే, తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ 2023 ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ ఓ ఈవెంట్‍గా ఉంది. దీంతో భారత్ నుంచి పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య భారత మహిళల జట్టుకు ముఖ్యమైన సిరీస్‍లు ఏమీ లేవు. దీంతో భారత మహిళల ప్రధాన జట్టునే పంపాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, పురుషుల టీమ్‍కు మాత్రం వన్డే ప్రపంచకప్ ఉంది.

అక్టోబర్ 5 నుంచి నవంబర్ 23 మధ్య పురుషుల వన్డే ప్రపంచకప్ భారత్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీ కోసం తీసుకునే భారత జట్టులో ఎంపిక కాని ప్లేయర్లతో.. టీమ్‍ను ఏర్పాటు చేసి ఏషియన్ గేమ్స్‌కు పంపాలని బీసీసీఐ భావిస్తోందని తెలుస్తోంది. దీంతో ఏషియన్ గేమ్స్‌లో ఈ ద్వితీయ శ్రేణి జట్టుకు సీనియర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ సారథ్యం వహించే అవకాశం ఉంది. ఒకవేళ యువకులకు కెప్టెన్సీ అవకాశం ఇవ్వాలనుకుంటే.. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‍లో ఒకరిని బీసీసీఐ పరిగణిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఏషియన్ గేమ్స్‌కు జట్లను పంపాలా వద్దా అనే విషయంపై జూలై 7న బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం బయటికి వచ్చింది.

చైనాలోని హాంగ్‍జవూ వేదికగా సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని బీసీసీఐ పట్టుపడుతోంది. ఈ తరుణంలో ఏషియన్ గేమ్స్‌కు జట్లను పంపకపోతే ఈ వాదన బలహీనపడుతుందని అనుకుంటోంది. అందుకే ఏషియన్ గేమ్స్‌కు భారత క్రికెట్ టీమ్‍లను బీసీసీఐ పంపే అవకాశమే అధికంగా ఉంది.

తదుపరి వ్యాసం