WI vs IND: ఆరంభంలో ఉతికినా.. చివర్లో తడబడ్డారు.. విండీస్‌కు భారీ లక్ష్యం
22 July 2022, 22:53 IST
- పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆరంభంలో ధాటిగా ఆడిన భారత్.. చివర్లో తడబడింది.
శిఖర్ ధావన్
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్(97) తృటిలో సెంచరీ కోల్పోగా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(64), శ్రేయాస్ అయ్యర్(54) అర్ధ శతకాలతో ఆకట్టుకోవడంతో భారత్.. విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభంలో ధారళంగా పరుగులు రాబట్టిన టీమిండియా చివర్లో వేగంగా రన్స్ రాబట్టలేకపోయారు. కరేబియన్ బౌలర్లలో గుడాకేష్ మోట్లే, అల్జారీ జోసెఫ్ చెరో 2 వికెట్లు తీయగా.. రొమారియో షేపర్డ్, అకీల్ హోసేయిన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ధావన్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. విండీస్ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. ఎడాపెడా బౌండరీలతో బాదుతూ స్టేడియాన్నే హోరెత్తించారు. ఈ క్రమంలోనే ముందుగా గిల్ అర్ధ శతకం నమోదు చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం ధావన్ కూడా గిల్ బాటలోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి రాణించాడు. గిల్ వేగంగా ఆడగా.. ధావన్ నిలకడగా ఆడుతూ తన అనుభవాన్ని ప్రదర్శించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 119 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే అనవసర పరుగుకు ప్రయత్నించి గిల్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
ధావన్ సెంచరీ మిస్..
గిల్ ఔటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కెప్టెన్ ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. కాస్త స్కోరు వేగంగా తగ్గినా అనంతరం కుదురుకుని పరుగుల వరద పారించారు. ప్రత్యర్థి బౌల్లను తుత్తునీయలు చేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధావన్ అర్ధ శతకం తర్వాత నిదానంగా ఆడుతూ.. సెంచరీకి చేరువయ్యాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో మోట్లే బౌలింగ్‌లో షమర్హ్‌కు క్యాచ్ ఇచ్చి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ధావన్.. అయ్యర్‌తో 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ధావన్ ఔటైన తర్వాత స్కోరు వేగం తగ్గింది. శ్రేయాస్ అయ్యర్, తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్(13), సంజూ శాంసన్(12) ఎక్కువ క్రీజులో నిలువలేకపోయారు. ఫలితంగా స్కోరు వేగంగా కాస్త తగ్గింది. మొదట్లో మెరుగైన రన్ రేటుతో దుసుకెళ్లిన టీమిండియా ఓ దశలో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ ధావన్ ఔటైన తర్వాత స్కోరు వేగం తగ్గింది. చివర్లో టీమిండియా బ్యాటర్లు వేగంగా ఆడలేక ఇబ్బంది పడ్డారు. హిట్టింగ్ చేయాల్సిన తరుణంలో సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యారు. 49వ ఓవర్ వేసి అల్జారీ జోసెఫ్ ఒకే ఓవర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ ఇద్దరి వికెట్లను తీశాడు. చివరి ఓవర్లో ఓ ఫోర్ సహా 9 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు సాధించింది.