Team India: రోహిత్ శర్మ, యశస్వి అర్ధ శతకాలు.. కొత్త ఓపెనింగ్ జోడీ ఇదేనా! గిల్ ఆ స్థానంలో..
06 July 2023, 15:33 IST
- Team India: వెస్టిండీస్‍తో టెస్టు సిరీస్‍కు ముందు టీమిండియా ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‍లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అర్ధ శతకాలు బాదారు.
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్
Team India: వెస్టిండీస్‍తో సిరీస్‍లకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు వెస్టిండీస్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టు వెస్టిండీస్‍తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12న టెస్టు సిరీస్ మొదలుకానుంది. అయితే, టెస్టు సిరీస్‍కు సన్నద్ధతలో భాగంగా భారత జట్టు రెండుగా విడిపోయి ప్రస్తుతం ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. రెండు రోజుల పాటు ఈ మ్యాచ్ జరుగుతుంది. అక్కడి వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు భారత ఆటగాళ్లు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‍లో కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా వచ్చారు. రోహిత్‍కు జోడీగా ఎప్పటిలాగా ఓపెనింగ్‍కు శుభ్‍మన్ గిల్ వస్తాడని అందరూ అంచనా వేయగా.. కొత్త కాంబినేషన్‍ను భారత మేనేజ్‍మెంట్ ట్రై చేసింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‍లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరూ అర్ధ శతకాలు చేశారు. దీంతో కొత్త ఓపెనింగ్ జోడీపై అంచనాలు వెలువడుతున్నాయి. వెస్టిండీస్‍తో టెస్టు సిరీస్‍లోనూ రోహిత్, జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారనే సంకేతాలను టీమిండియా ఇచ్చింది.
వెస్టిండీస్‍తో టెస్టు సిరీస్‍లో భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజార లేడు. దీంతో శుభ్‍మన్ గిల్‍ను ఓపెనింగ్ కాకుండా బ్యాటింగ్ ఆర్డర్ మూడో స్థానంలో పంపాలని టీమ్ మేనేజ్‍మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రోహిత్ శర్మ, జైస్వాల్‍ను ఓపెనర్లుగా పంపితే.. రైట్, లైఫ్ట్ కాంబినేషన్‍గానూ కలిసి వస్తుందని ఆలోచిస్తోంది. అందుకే గిల్‍ను మూడో స్థానానికి మార్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి మ్యాచ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, అజింక్య రహానే అయిదో స్థానంలో బ్యాటింగ్‍కు వస్తారు.
ఓపెనింగ్ స్థానానికి యశస్వి జైస్వాల్‍కు రుతురాజ్ గైక్వాడ్ కూడా పోటీగా ఉన్నాడు. అయితే, వెస్టిండీస్‍తో టెస్టుల్లో జైస్వాల్‍కే భారత మేనేజ్‍మెంట్ జై కొట్టేలా కనిపిస్తోంది. దీంతో రోహిత్ - జైస్వాల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
వెస్టిండీస్‍తో టీమిండియా తొలి టెస్టు డొమెనికా వేదికగా జూలై 12న ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‍తోనే 2023-25 టెస్టు చాంపియన్‍షిప్ సైకిల్‍ను భారత్ మొదలుపెడుతుంది. రెండో టెస్టు జూలై 20న క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ప్రారంభమవుతుంది. టెస్టు సిరీస్ తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ20లను వెస్టిండీస్‍తో టీమిండియా ఆడనుంది. మొత్తంగా జూలై 12 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఈ టూర్ ఉండనుంది. కాగా, టీ20 సిరీస్‍కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు సెలెక్టర్లు. తెలుగు ప్లేయర్ నంబూరి తిలక్ వర్మ ఈ సిరీస్‍కు ఎంపికైన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.