తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma: వన్డేల్లో రోహిత్‌ శర్మ కొత్త రికార్డు.. తొలి ఇండియన్‌గా ఘనత

Rohit Sharma: వన్డేల్లో రోహిత్‌ శర్మ కొత్త రికార్డు.. తొలి ఇండియన్‌గా ఘనత

Hari Prasad S HT Telugu

13 July 2022, 14:27 IST

google News
    • Rohit Sharma: వన్డే క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ బ్యాటర్‌గా అతడు నిలిచాడు.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (Action Images via Reuters)

రోహిత్ శర్మ

లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా చాలా సులువుగా విజయం సాధించిన విషయం తెలుసు కదా. ఈ మ్యాచ్‌లో మొదట పేస్‌బౌలర్‌ బుమ్రా తన కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కుప్పకూల్చగా.. తర్వాత చేజింగ్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ ఇండియాకు 10 వికెట్ల విజయాన్ని అందించింది. చాలా రోజుల తర్వాత ధావన్‌తో జత కలిసిన రోహిత్‌.. 58 బాల్స్‌లోనే 76 రన్స్‌ చేయడం విశేషం.

అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఈ ఐదు సిక్స్‌లతోనే ఇప్పుడు రోహిత్‌ వన్డే క్రికెట్‌లో ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ తన 250వ సిక్స్‌ బాదాడు. వన్డేల్లో ఈ మార్క్‌ అందుకున్న తొలి ఇండియన్‌ అతడే. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌ రోహిత్‌ శర్మ. ఈ లిస్ట్‌లో షాహిద్‌ అఫ్రిది 351 సిక్స్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు.

అతని తర్వాత క్రిస్‌ గేల్‌ 331 సిక్స్‌లు, శ్రీలంకకు చెందిన సనత్‌ జయసూర్య 270 సిక్స్‌లు బాదారు. అయితే వీళ్లంతా ప్రస్తుతం క్రికెట్‌ నుంచి రిటైరయ్యారు. ఇప్పుడు క్రికెట్‌ ఆడుతున్న వాళ్లలో రోహిత్‌కు దగ్గరగా ఉన్న వాళ్లు లేరు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్‌ గప్టిల్‌ 184 సిక్స్‌లతో ఉన్నాడు. ఇండియా తరఫున రోహిత్‌ తర్వాత ధోనీ 229 సిక్స్‌లతో ఉన్నాడు.

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్‌, శిఖర్‌ ధావన్‌ కలిసి తొలి వికెట్‌కు 114 రన్స్‌ జోడించారు. వన్డేల్లో ఇది వాళ్లకు 18వ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ కావడం విశేషం. అంతేకాదు ఈ పార్ట్‌నర్‌షిప్‌తో వీళ్లిద్దరి మధ్య మొత్తం భాగస్వామ్యం 5 వేల రన్స్‌ మార్క్‌ దాటింది.

తదుపరి వ్యాసం