Rohan Bopanna: పద్మశ్రీ వచ్చిన రెండో రోజే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన రోహన్ బోపన్న
27 January 2024, 21:24 IST
Rohan Bopanna: ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ కొత్త చరిత్రను సృష్టించాడు. పద్మశ్రీ అవార్డు వచ్చిన రెండో రోజే గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
రోహన్ బోపన్న, ఎబ్డెన్
Rohan Bopanna: ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న అరుదైన రికార్డును నెలకొల్పాడు. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ ఫైనల్‌లో రోహన్ బోపన్న, ఎబ్డెన్ జోడీ బోలెల్లీ, వావాస్సోరీ(ఇటలీ)పై విజయం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దక్కించుకున్నారు.ఈ విజయంతో 43 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన అత్యధిక వయస్కుడిగా రోహన్ బోపన్న నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ జీన్ జూలియర్ రోజర్ పేరు మీద ఉంది. నలభై ఏళ్ల వయసులో రోజర్...అరెవోలాతో కలిసి 2022లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. రోజర్ రికార్డును బోపన్న బ్రేక్ చేశాడు.
గట్టి పోటీ...
శనివారం జరిగిన ఫైనల్‌లో రోహన్ బోపన్న, ఎబ్డెన్‌లకు బోలెల్లీ, వావాస్సోరీ జోడీ గట్టిపోటీనిచ్చారు. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఈ మ్యాచ్ జరిగింది. తొలి సెట్‌ను 7-6 తేడాతో బోపన్న, ఎబ్డెన్ జోడీ గెలిచింది. సెకండ్ సెట్‌లో బోలెల్లీ, వావాస్సోరీ ప్రతిఘటించిన చివరకు బోపన్న, ఎబ్డెన్‌లనే విజయం వరించింది. 7-5 తేడాతో రెండో సెట్‌లోనూ విజయం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు బోపన్న, ఎబ్డెన్.
కాగా రోహన్ బోపన్నకు ఇదే ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం గమనార్హం. అంతే కాకుండా బోపన్న, ఎబ్డెన్ జోడీ గెలిచిన ఫస్ట్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా ఇదే. గత ఏడాది యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో బోపన్న, ఎబ్డెన్ జోడీ ఓటమి పాలయ్యారు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న గెలిచాడు. ఆ తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం అరవై సార్లు ప్రయత్నించి చివరకు విన్నర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియన్ భారత్ ఖాతాలో ఇది ఏడో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో పదహారు సార్లు పాల్గొన్న బోపన్న తొలిసారి విజేతగా నిలిచాడు. గతంలో మూడో రౌండ్ కూడా ఎప్పుడూ దాటలేదు. ఈ సారి మాత్రం ఏకంగా టైటిల్ గెలిచి చరిత్రను తిరగరాశాడు.
పద్మశ్రీ వచ్చిన రెండోరోజే...
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రోహన్ బోపన్నకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. పద్మశ్రీ అవార్డు ప్రకటించిన రెండో రోజే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్రను సృష్టించాడు బోపన్న. అంతే కాదు మెన్స్ డబుల్స్‌లో ఇటీవలే నంబర్ వన్ ర్యాంకుకు రోహన్ బోపన్న చేరుకున్నాడు.
43 ఏళ్ల వయసులో నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. లియాండర్ పేస్, మహేష్ భూపతి తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో టెన్నిస్ ప్లేయర్‌గా రోహన్ బోపన్న రికార్డ్ నెలకొల్పాడు. మెన్స్ డబుల్స్ టైటిల్ గెలిచిన రోహన్ బోపన్న, ఎబ్డెన్ జోడీకి కోటి తొంభై తొమ్మిది లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
టాపిక్