తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 Dc Vs Rcb | వార్నర్ దంచి కొట్టినా బెంగళూరుదే గెలుపు

IPL 2022 DC vs RCB | వార్నర్ దంచి కొట్టినా బెంగళూరుదే గెలుపు

Hari Prasad S HT Telugu

16 April 2022, 23:31 IST

google News
    • బౌలింగ్‌, బ్యాటింగ్‌లలో కీలకమైన సమయంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో ఓటమి మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో దినేష్‌ కార్తీక్‌, మ్యాక్స్‌వెల్‌.. బౌలింగ్‌లో హేజిల్‌వుడ్‌, సిరాజ్‌ మెరవడంతో ఆర్సీబీ నాలుగో విజయం సాధించి పాయింట్ల టేబుల్లో మూడో స్థానానికి దూసుకెళ్లింది.
ఆర్సీబీ ప్లేయర్స్ గెలుపు సంబరం
ఆర్సీబీ ప్లేయర్స్ గెలుపు సంబరం (PTI)

ఆర్సీబీ ప్లేయర్స్ గెలుపు సంబరం

ముంబై: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మళ్లీ గాడిలో పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 16 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ వార్నర్‌ 38 బంతుల్లోనే 66 రన్స్‌ చేసినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 3, సిరాజ్‌ 2 వికెట్లు తీసుకున్నారు. 16 పరుగులతో విజయం గెలిచిన ఆర్సీబీ.. పాయింట్ల టేబుల్లో మూడోస్థానానికి దూసుకెళ్లింది.

నిజానికి 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు బెదరలేదు. ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వాళ్లనే ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా డేవిడ్‌ వార్నర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అటు పృథ్వి షా ఉన్నది కొద్దిసేపే అయినా అయినా ఒక సిక్స్‌, ఒక ఫోర్‌తో మంచి ఫామ్‌లో కనిపించాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. తర్వాత పృథ్వి 16 రన్స్‌ చేసి ఔటయ్యాడు.

అయితే వార్నర్‌ మాత్రం తన జోరు తగ్గించలేదు. పృథ్వి స్థానంలో వచ్చిన మిచెల్‌ మార్ష్‌ పరుగుల కోసం తంటాలు పడుతుంటే.. వార్నర్‌ మాత్రం ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. ఢిల్లీని రేసులో ఉంచాడు. ఈ క్రమంలో వార్నర్‌ 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే హసరంగ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వార్నర్‌ 38 బాల్స్‌లోనే 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 66 రన్స్‌ చేశాడు. అతడు ఔటయ్యే సమయానికి ఢిల్లీ స్కోరు 94 పరుగులు.

ఈ దశలో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. వార్నర్‌ ఔటైన తర్వాత కూడా మిచెల్‌ మార్ష్‌ భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 24 బంతుల్లో 14 రన్స్‌ చేసిన తర్వాత రనౌటై వెనుదిరిగాడు. ఆ తర్వాత పంత్‌ కాసేపు మెరుపులు మెరిపించినా.. అతని పోరాటం ఎక్కువసేపు నిలవలేదు. 17 బంతుల్లో 34 రన్స్‌ చేసి ఔటవగానే.. ఢిల్లీ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది.

చెలరేగిన కార్తీక్, మ్యాక్స్ వెల్

అంతకుముందు దినేష్ కార్తీక్ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అతడు మరో మెరుపు హాఫ్‌ సెంచరీ చేయడంతో బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్‌లో వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. కార్తీక్‌ కేవలం 34 బంతుల్లోనే 66 రన్స్‌ చేశాడు. మరోవైపు షాబాజ్‌ 21 బంతుల్లో 32 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. కార్తీక్ ఇన్నింగ్స్ లో 5 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి.

ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 8.4 ఓవర్లలోనే అజేయంగా 97 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో కార్తీక్‌ ఏకంగా 28 రన్స్‌ బాదడం విశేషం. ముస్తిఫిజుర్‌ రెహమాన్‌ వేసిన ఆ ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు కార్తీక్‌. తొలి మూడు బంతులు ఫోర్లు కాగా.. తర్వాత రెండు సిక్స్‌లు, చివరి బంతికి మరో ఫోర్‌ కొట్టాడు. ఆ ఫోర్‌తోనే 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతనికిది 20వ హాఫ్‌ సెంచరీ.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఏమాత్రం మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్‌ అనూజ్‌ రావత్‌ (0) ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్‌ డుప్లెస్సి (8) కూడా ఔట్‌ కావడంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (12) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.

స్కోరు 40 పరుగులకు చేరే సరికి కోహ్లి కూడా ఔటయ్యాడు. ఓవైపు మ్యాక్స్‌వెల్‌.. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతూనే ఉన్నా.. మరోవైపు వికెట్లు వరుసగా పడిపోయాయి. ప్రభుదేశాయ్‌ (6) కూడా త్వరగానే పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి ఊపు మీద కనిపించిన మ్యాక్స్‌వెల్‌ (54) కూడా ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లోనే ఔట్‌ అయ్యాడు. దీంతో బెంగళూరు భారీ స్కోరు చేయడం సందేహంగానే కనిపించింది. అయితే చివర్లో కార్తీక్‌ మెరుపులు ఆ టీమ్‌కు ఫైటింగ్‌ స్కోరు సాధించిపెట్టింది.

టాపిక్

తదుపరి వ్యాసం