తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: కోహ్లి సమస్యేంటో రాహుల్‌ భాయ్‌ అప్పుడే చెప్పాడు: ప్రజ్ఞాన్ ఓఝా

Virat Kohli: కోహ్లి సమస్యేంటో రాహుల్‌ భాయ్‌ అప్పుడే చెప్పాడు: ప్రజ్ఞాన్ ఓఝా

Hari Prasad S HT Telugu

15 July 2022, 15:26 IST

google News
    • Virat Kohli: ప్రస్తుతం విరాట్‌ కోహ్లి ఎదుర్కొంటున్న సమస్య గురించి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎప్పుడో చెప్పాడని అంటున్నాడు టీమిండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా.
విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్
విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్ (ANI)

విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్

లండన్‌: ప్రస్తుతం ప్రపంచానికి కాదు కానీ క్రికెట్‌ ప్రపంచానికి మాత్రం పెద్ద సమస్యే వచ్చి పడింది. ఆ సమస్య పేరు విరాట్‌ కోహ్లి. అంత గొప్ప ప్లేయర్‌ కోల్పోయిన ఫామ్‌ను తిరిగి పొందడానికి ఇన్నాళ్లు తీసుకుంటున్నాడేంటి అని ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచమంతా చర్చించుకుంటోంది. అతనిపై సానుభూతి చూపిస్తోంది. అండగా నిలుస్తోంది. ధైర్యంగా ఉండమని భరోసా ఇస్తోంది.

అతని చెత్త ఫామ్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా మాట్లాడుతూ.. కోహ్లి ఎదుర్కొంటున్న సమస్యేంటో చెప్పాడు. తాను చాన్నాళ్ల కిందట ప్రస్తుత కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌తో మాట్లాడుతున్నప్పుడు అతడు చెప్పిన ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశాడు. బ్యాటర్ల మనస్తత్వం దేశాన్ని బట్టి ఎలా ఉంటుంది? ఆ మనస్తత్వమే కోహ్లిని ఎలా చిక్కుల్లో పడేస్తోందో వివరించాడు.

"మైండ్‌సెట్‌ గురించి నేను చెబుతాను. బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవడంపై నాకు ఆసక్తి ఉంటుంది. దీనిపై నేను చాలానే చర్చించేవాడిని. ఒకసారి ఇంగ్లండ్‌లో ఉన్న సమయంలో రాహుల్‌ భాయ్‌తో ఇదే విషయం మాట్లాడాను. అప్పుడు అతడు ఇండియన్‌/ఉపఖండం ప్లేయర్స్‌, ఇంగ్లిష్‌ ప్లేయర్స్ మధ్య చాలా పెద్ద తేడా ఉంటుందని చెప్పాడు" అని ఓఝా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ వెల్లడించాడు.

"ఇంగ్లండ్‌లో బ్యాటర్లు చాలా వరకూ డెలివరీలను వదిలేస్తూ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే ఉపఖండంలో అయితే బ్యాటర్ల బంతి తమ బ్యాట్‌కు తగిలితేనే సెట్‌ అయినట్లుగా భావిస్తారు. అలా అయితేనే సంతృప్తి చెందుతారు. విరాట్‌ కోహ్లితో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. అతడు వదిలేయాల్సిన బాల్స్‌ను వేటాడి మరీ ఆడుతున్నాడు. తాను పరుగులు చేయడం లేదని కోహ్లికి తెలుసు.

అందుకే ఇలా అతడు దూరంగా వెళ్తున్న బాల్స్‌ వెంటపడుతున్నాడు. గతంలో రన్స్‌ కోసం అతడు ఇలాంటి బాల్స్‌ను వెంటాడే వాడు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతి ఒక్కరూ అతని గురించే మాట్లాడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోకూడదని అనుకుంటాం కానీ మన మైండ్‌ మాత్రం దాని గురించే ఆలోచిస్తుంది" అని ఓఝా వివరించాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ కోహ్లి ఇలాగే ఆఫ్‌స్టంప్‌ బయట నుంచి వెళ్తున్న బాల్‌ను ఆడబోయి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతడు 16 రన్స్‌ మాత్రమే చేశాడు.

తదుపరి వ్యాసం