తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rafael Nadal: షాకింగ్‌.. సెమీస్‌కు ముందు వింబుల్డన్‌ నుంచి తప్పుకున్న రఫేల్‌ నదాల్‌

Rafael Nadal: షాకింగ్‌.. సెమీస్‌కు ముందు వింబుల్డన్‌ నుంచి తప్పుకున్న రఫేల్‌ నదాల్‌

Hari Prasad S HT Telugu

08 July 2022, 8:50 IST

google News
    • Rafael Nadal: 22 గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ రఫేల్‌ నదాల్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు వింబుల్డన్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచి ఊపు మీదున్న నదాల్‌కు ఇది ఒక రకంగా తీవ్ర అసంతృప్తి కలిగించే విషయమే.
వింబుల్డన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ భావోద్వేగానికి గురైన నదాల్
వింబుల్డన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ భావోద్వేగానికి గురైన నదాల్ (Pool via REUTERS)

వింబుల్డన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ భావోద్వేగానికి గురైన నదాల్

లండన్‌: ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన రఫేల్‌ నదాల్‌.. వింబుల్డన్‌ కూడా కచ్చితంగా గెలుస్తాడనుకున్న సమయంలో గాయం కారణంగా తప్పుకున్నాడు. శుక్రవారం సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. పొట్ట కండరాల్లో చీలిక కారణంగా తప్పుకుంటున్నట్లు నదాల్‌ ప్రకటించాడు. దీంతో 1969లో రాడ్‌ లేవర్‌ తర్వాత కేలండర్‌ ఇయర్‌ స్లామ్‌ సాధించాలని కలలు కన్న అతని ఆశలు నెరవేరలేదు.

దురదృష్టవశాత్తూ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది అని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నదాల్‌ ప్రకటించాడు. "క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లోనే నేను కడుపునొప్పితో బాధపడటం మీరు చూశారు. లోపల ఏదో జరిగిందని అనిపించింది. తర్వాత అదే నిజమైంది. పొట్ట కండరాల్లో చీలిక ఉన్నట్లు తేలింది. తప్పుకోవాలన్న నిర్ణయంపై రోజంతా ఆలోచించాల్సి వచ్చింది" అని నదాల్‌ చెప్పాడు.

అమెరికన్‌ ప్లేయర్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌తో జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లోనే నదాల్‌ చాలా నొప్పితో బాధపడ్డాడు. అప్పుడే మ్యాచ్‌ నుంచి తప్పుకోవాలని అతని తండ్రి, సోదరి కోరినా అలాగే ఆడాడు. చివరికి గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. కానీ టైటిల్‌కు రెండు అడుగుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది. తాను ఇలాగే ఆడటం కొనసాగిస్తే గాయం మరింత తీవ్రమవుతుందని నదాల్‌ చెప్పాడు.

ఇలాంటి గాయంతో తాను రెండు వరుస మ్యాచ్‌లు గెలవలేనని అతను అన్నాడు. అసలు సర్వ్‌ చేయలేని పరిస్థితి ఉందని తెలిపాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోనూ కాలి గాయంతో బాధపడిన నదాల్‌.. ఇంజెక్షన్లు తీసుకొని మరీ ఆడి గెలిచాడు.

టాపిక్

తదుపరి వ్యాసం