తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Chess World Cup 2023: సత్తాచాటిన భారత 18ఏళ్ల ప్లేయర్.. ఫైనల్ రెండో గేమ్ కూడా డ్రా.. టై బ్రేకర్‌కు టైటిల్ ఫైట్

Chess World Cup 2023: సత్తాచాటిన భారత 18ఏళ్ల ప్లేయర్.. ఫైనల్ రెండో గేమ్ కూడా డ్రా.. టై బ్రేకర్‌కు టైటిల్ ఫైట్

24 August 2023, 13:03 IST

google News
    • Chess World Cup 2023 Final: చెస్ ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో రెండో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. భారత 18ఏళ్ల ప్లేయర్ ప్రజ్ఞానంద.. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‍ను విజయవంతంగా నిలువరించాడు. దీంతో టైటిల్ కోసం ఇద్దరు ప్లేయర్లు ఇక టై బ్రేకర్‌లో తలపడనున్నారు.
ప్రజ్ఞానంద
ప్రజ్ఞానంద (PTI)

ప్రజ్ఞానంద

Chess World Cup 2023 Final: చెస్ ప్రపంచకప్ 2023 టోర్నీలో ఉత్కంఠ కొనసాగుతోంది. చరిత్ర సృష్టిస్తూ ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత 18 ఏళ్ల ప్లేయర్ గ్రాండ్‍మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అదరగొడుతున్నాడు. ఫైనల్‍లోనూ సత్తాచాటుతూ.. ప్రపంచ నంబర్ 1 ర్యాంకర్ మాగ్నస్ కార్ల్‌సన్‍ను దీటుగా ఎదుర్కొంటున్నాడు. అజర్‌బైజాన్‍లోని బాకు వేదికగా నేడు (ఆగస్టు 23) జరిగిన చెస్ ప్రపంచకప్ 2023 ఫైనల్ రెండో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. మంగళవారం జరిగిన తొలి గేమ్ సమం కాగా.. నేడు క్లాసికల్ రెండో గేమ్ కూడా డ్రా అయింది. దీంతో రేపు (ఆగస్టు 24) జరిగే టై బ్రేకర్‌లో ఫలితం తేలనుంది. టై బ్రేకర్‌లో గెలిచిన ప్లేయర్‌కు ప్రపంచకప్ టైటిల్ దక్కనుంది. నేడు గంటకు పైగా 30 మూవ్స్ పాటు రెండో గేమ్ హోరాహోరీగా జరగగా భారత టీనేజర్ ప్రజ్ఞానంద అదరగొట్టాడు. మాగ్నస్ కార్ల్‌సన్‍ మొదటి నుంచి డ్రా కోసమే ఆడినట్టు కనిపించింది.

ఫైనల్ రెండో గేమ్‍లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ తెలుపు రంగు పావులతో ఆడాడు. భారత ప్లేయర్ ప్రజ్ఞానంద నలుపు రంగు పావులను తన ఎత్తులకు అనుగుణంగా కదిపి సత్తాచాటాడు. మొత్తంగా 30 మూవ్స్ తర్వాత ఇద్దరు ప్లేయర్లు డ్రాకు అంగీకరించారు. మంగళవారం జరిగిన తొలి గేమ్‍లో నాలుగు గంటల పాటు 70కు పైగా మూవ్స్ జరిగాయి. అయితే, ఈ రెండో గేమ్ వేగంగా ముగిసింది. ప్రారంభం నుంచి డ్రా కోసమే కార్ల్‌సన్ ఆడాడు. వాతావరణం వల్ల తన ఆరోగ్యం బాగోలేదని మ్యాచ్‍కు ముందే కార్ల్‌సన్ చెప్పాడు. దీంతో ఫైనల్‍ను టై బ్రేకర్ వరకు తీసుకెళ్లేందుకే కార్ల్‌సన్ మొగ్గుచూపాడు.

రెండో గేమ్ కూడా డ్రా అవడంతో ఇక రేపు (ఆగస్టు 24) జరిగే టై బ్రేకర్‌లో ప్రజ్ఞానంద, కార్ల్‌సన్ తలపడనున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించనున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.

సెమీ ఫైనల్‍లో ప్రపంచ నంబర్ 3 ఫ్యాబియానో కరునాను ఓడించి ఫైనల్‍లో అడుగుపెట్టాడు ప్రజ్ఞానంద. వరల్డ్ కప్ ఫైనల్ చేరిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలోనే ప్రపంచ నంబర్ 2 హికారు నకామురను కూడా ఓడించాడు ప్రజ్ఞానంద.

తదుపరి వ్యాసం