తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa ఓపెనర్లు చెలరేగినా చేతులెత్తేసిన మిడిలార్డర్‌.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే?

Ind vs SA ఓపెనర్లు చెలరేగినా చేతులెత్తేసిన మిడిలార్డర్‌.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే?

Hari Prasad S HT Telugu

14 June 2022, 20:41 IST

google News
    • సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో ఓపెనర్లు చెలరేగినా మిడిలార్డర్‌ చేతులెత్తేయడంతో టీమిండియా ఊహించిన స్కోరు చేయలేకపోయింది. చివర్లో హార్దిక్‌ పాండ్యా మెరుపులతో ఫైటింగ్‌ స్కోరు సాధించింది.
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (BCCI Twitter)

రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్

విశాఖపట్నం: సౌతాఫ్రికాతో మూడో టీ20లో 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు వికెట్‌ నష్టానికి 97. ఈ ఊపు చూస్తుంటే.. కనీసం 200 స్కోరు ఖాయమనిపించింది. కానీ చివరికి 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 రన్స్‌ మాత్రమే చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ (57), ఇషాన్‌ కిషన్‌ (54) హాఫ్‌ సెంచరీలతో చెలరేగినా.. మిడిలార్డర్‌లో రిషబ్‌ పంత్‌ (6), శ్రేయస్‌ అయ్యర్‌ (14), దినేష్‌ కార్తీక్‌ (6) దారుణంగా విఫలమయ్యారు. 

చివర్లో హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 31) కాస్త మెరుపులు మెరిపించడంతో ఇండియా ఆ మాత్రం స్కోరైనా సాధించింది. మిడిల్‌ ఓవర్లలో సఫారీలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. రెండు కీలకమైన క్యాచ్‌లు డ్రాప్‌ చేసినా.. టీమిండియా వాటిని ఉపయోగించుకోలేకపోయింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా రుతురాజ్‌ చెలరేగి ఆడాడు. వచ్చీ రాగానే బౌండరీలతో రెచ్చిపోయాడు. నోక్యా వేసిన ఓవర్లో ఏకంగా ఐదు ఫోర్లు బాదాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సమయానికి ఇండియా వికెట్‌ నష్టపోకుండా 57 రన్స్‌ చేసింది. ఇదే ఊపులో రుతురాజ్‌ 30 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. తర్వాత కాసేపటికి 57 రన్స్‌ చేసి స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 97 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

రుతురాజ్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అతడు ఔటైన తర్వాత ఇషాన్‌ కిషన్‌ జోరు పెంచాడు. కిషన్‌ కూడా 31 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. అయితే అతడు కూడా ఆ తర్వాత కాసేపటికే ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో దూరంగా వెళ్తున్న బాల్‌ను భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. ఇషాన్‌ 35 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 రన్స్‌ చేశాడు.

తదుపరి వ్యాసం