Kl Rahul Slow Batting: కె.ఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్‌పై నెటిజన్ల ఫైర్ - గంభీర్ రికార్డు బ్రేక్
29 September 2022, 11:40 IST
Kl Rahul Slow Batting: బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, కె.ఎల్.రాహుల్, బౌలింగ్ లో అర్షదీప్‌సింగ్, చాహర్, హర్షల్ పటేల్ రాణించారు. కాగా ఈ టీ20 మ్యాచ్‌లో కె.ఎల్.రాహుల్ స్లో బ్యాటింగ్‌పై సోషల్‌మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
కె.ఎల్.రాహుల్
Kl Rahul Slow Batting: బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.అర్షదీప్‌సింగ్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 106 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యఛేదనలో టీమ్ ఇండియా 17 పరుగులకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్, కె.ఎల్.రాహుల్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమ్ ఇండియా విజయాన్ని అందుకున్నది.
కాగా ఈ మ్యాచ్‌లో కె.ఎల్.రాహుల్ జిడ్డు బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టడంలో కె.ఎల్ రాహుల్ ఇబ్బంది పడ్డాడు. కోహ్లి, రాహుల్ నెమ్మదిగా ఆడటంతో పవర్‌ప్లే లో ఇండియా కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది. టీ20ల్లో పవర్ ప్లేలో భారత్ చేసిన లోయెస్ట్ స్కోర్ ఇదే. ఓ వైపు సూర్యకుమార్ యాదవ్ అలవోకగా ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే రాహుల్ మాత్రం సింగిల్స్ తీయడానికే కష్టపడుతూ కనిపించాడు.
వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. 15 పరుగులు చేయడానికి 33 బాల్స్ తీసుకున్నాడు కె.ఎల్ రాహుల్. దాంతో అతడి జిడ్డు బ్యాటింగ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేశారు. టీ20 మ్యాచ్‌ను కె.ఎల్ రాహుల్ టెస్ట్ మ్యాచ్‌గా మార్చేశాడని కొందరు పేర్కొన్నారు. అతడి ఆటతీరు చూస్తుంటే తొలి ఇంటర్‌నేషన్ టీ20 మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. తిరువనంతపురం అని టైప్ చేయడానికి పట్టే టైమ్ కంటే కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్ స్లోగా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో 70 స్ట్రైక్ రేట్ తో 56 బాల్స్ లో 51 రన్స్ చేశాడు కె.ఎల్ రాహుల్. టీ20 టీమ్ ఇండియా తరఫున అత్యంత నెమ్మదిగా హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్ గా కె.ల్ రాహుల్ నిలిచాడు. గతంలో గౌతమ్ గంభీర్ 54 బాల్స్ లో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేశాడు. అతడి రికార్డును సౌతాఫ్రికాతో మ్యాచ్ లో కె.ఎల్ రాహుల్ అధిగమించాడు.