IPL Auction 2022 | 8.25 కోట్లు ధర పలికిన సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్
13 February 2022, 17:45 IST
సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్ బేస్ ధర నలభై లక్షలు కాగా అతడిని ముంబయి ఇండియన్స్ 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. అసోసియేట్ దేశానికి ప్లేయర్ 8.25 కోట్లకు అమ్ముడుపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
టిమ్ డేవిడ్
ఐపీఎల్ మెగా వేలంలో రెండో రోజు సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ కు జాక్ పాట్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో 8.25 కోట్లకు అతడిని ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. టిమ్ డేవిడ్ బేస్ ధర నలభై లక్షలు కాగా అతడి కోసం ముంబయి ఇండియన్స్ భారీ మొత్తాన్ని కేటాయించడం ఆసక్తిని రేకెత్తించింది. అసోసియేట్ దేశానికి చెందిన ప్లేయర్ 8.25 కోట్లకు అమ్ముడుపోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. టీ ట్వంటీ లీగ్ లలో మంచి ఫినిషర్ గా టిమ్ డేవిడ్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆరు, ఏడో స్థానంలో వచ్చిన అలవోకగా భారీ సిక్సర్స్ కొట్టగల నేర్పు అతడి సొంతం. 2018 ఏడాదిలో సింగపూర్ టీమ్ తరఫున క్రికెటర్ గా టిమ్ డేవిడ్ అరంగేట్రం చేశారు. బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ తో పాటు ఇంగ్లాండ్ కౌంటీలలో కూడా ఆడిన అనుభవం టిమ్ డేవిడ్ కు ఉంది. ఐపీఎల్ లోనూ గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ప్రాతినిథ్యం వహించాడు. ఒకే ఒక మ్యాచ్ ఆడే అవకాశం అతడికి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఒకే పరుగు చేసి టిమ్ డేవిడ్ అవుట్ అయ్యాడు. 2022 సీజన్ లో ఈ సింగపూర్ షినిషర్ మెరుపులు ఎలా ఉంటాయో? తన ధరకు న్యాయం చేస్తాడో?లేదో? చూడాల్సిందే.