MSK Prasad on Virat Kohli: ఆ బ్రేక్‌తో విరాట్ కోహ్లి కెరీర్ మరో నాలుగైదేళ్లు పెరిగింది: ఎమ్మెస్కే ప్రసాద్
17 January 2023, 14:40 IST
- MSK Prasad on Virat Kohli: అప్పుడు తీసుకున్న బ్రేక్‌తో విరాట్ కోహ్లి కెరీర్ మరో నాలుగైదేళ్లు పెరిగిందని అన్నాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్, సెలక్షన్ కమిటీ మాజీ ఛీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్. తనకు ఎదురైన సవాలును కోహ్లి విజయవంతంగా అధిగమించినట్లు చెప్పాడు.
విరాట్ కోహ్లి
MSK Prasad on Virat Kohli: నాలుగైదు నెలలుగా మనం మునుపటి విరాట్ కోహ్లిని చూస్తున్నాం. పరుగుల కోసం తంటాలు పడుతూ ఏళ్లకేళ్లు సెంచరీ లేకుండా గడిపిన అతడు.. ఇప్పుడు పూర్తిగా గాడిలో పడ్డాడు. ఒకప్పటి కోహ్లిని గుర్తు చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. చివరి నాలుగు వన్డేల్లోనే మూడు సెంచరీలు చేయడం విశేషం.
ఇలాంటి విరాట్‌నే అభిమానులు చూడాలని అనుకున్నారు. అయితే మునుపటి కోహ్లి మళ్లీ కనిపించడానికి ప్రధాన కారణం అతడు గతేడాది తీసుకున్న సుదీర్ఘ బ్రేక్. 2022లో విరాట్ చాలా కాలం పాటు టీమ్‌కు దూరంగా ఉన్నాడు. మానసికంగా కుదుటపడటానికి ప్రయత్నించాడు. ఇప్పుడా బ్రేకే కోహ్లి కెరీర్‌ను మరో నాలుగైదేళ్లు పొడిగించిందని మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు.
"నాకు తెలిసి ఆ బ్రేక్ విరాట్ కోహ్లి కెరీర్‌ను మరో నాలుగైదేళ్లు పొడిగించింది. అతనిది సవాళ్లను కోరుకునే వ్యక్తిత్వం. ఇప్పుడా సవాలును కూడా అంగీకరించి విజయవంతంగా అధిగమించాడు. అందుకే మంచి బ్రేక్ తీసుకొని తన గురించి తాను అర్థం చేసుకున్నాడు. అదే మనకు మునుపటి విరాట్ కోహ్లిని అందించింది. అతనికి అన్నింటి కంటే ఎక్కువగా ఆ మెంటల్ బ్రేక్ అనేది అవసరం అయింది" అని రెడిఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసాద్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం విరాట్ తన కెరీర్ బెస్ట్ ఏడాది అయిన 2016నాటి ఫామ్‌లోకి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోందని ప్రసాద్ అన్నాడు. "అతడు కాస్త క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాడు. అయినా అలాగే ఆడుతూ వెళ్లడంతో అది ఇంకాస్త క్లిష్టంగా మారింది. నిజానికి అతడు ఎప్పుడో ఈ బ్రేక్ తీసుకోవాల్సింది. 2021 టీ20వరల్డ్‌కప్ తర్వాతే తీసుకోవాల్సింది. ఆసియా కప్‌కు ముందు అతడు బ్రేక్ తీసుకున్నప్పటి నుంచీ మునుపటి కోహ్లి మళ్లీ కనిపిస్తున్నాడు. 2016లోలాగే ఇప్పుడూ టన్నుల కొద్దీ రన్స్ చేస్తున్నాడు" అని ప్రసాద్ చెప్పాడు.
"ఇప్పుడతడు మళ్లీ తన బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. గత రెండేళ్లుగా అతడు ఎదుర్కొన్న క్లిష్టమైన సమయం అతన్ని మరింత మంచి ప్లేయర్‌గా, బలమైన వ్యక్తిగా మార్చిందని భావిస్తున్నాను" అని ఎమ్మెస్కే అన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో రెండు సెంచరీలతోపాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.
టాపిక్