తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni Viral Video: కమెడియన్ యోగిబాబును ఆటపట్టించిన ధోనీ.. వీడియో వైరల్

Dhoni Viral Video: కమెడియన్ యోగిబాబును ఆటపట్టించిన ధోనీ.. వీడియో వైరల్

15 July 2023, 19:22 IST

google News
    • Dhoni Viral Video: ప్రముఖ కమెడియన్ యోగిబాబును సరదాగా ఆటపట్టించాడు ఎంఎస్ ధోనీ. ఎల్‍జీఎం సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఇది జరిగింది.
ధోనీ, యోగిబాబు (Photo: Twitter)
ధోనీ, యోగిబాబు (Photo: Twitter)

ధోనీ, యోగిబాబు (Photo: Twitter)

Dhoni - Yogi Babu Viral Video: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా సరదాగా ఉంటాడు. క్రికెట్ మైదానంలో వ్యూహరచనలు చేస్తూ ఎంత కూల్‍గా కనిపిస్తాడో.. మైదానం బయట అంతే సరదాగా ఉంటాడు. కొన్నిసార్లు సహచర క్రికెటర్లను ధోనీ ఆటపట్టించిన సందర్భాలు ఉన్నాయి. కాగా, రెండేళ్ల క్రితం టీమిండియాకు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ.. ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో సినీ రంగంలోనూ ఎంఎస్ ధోనీ అడుగుపెట్టాడు. ధోనీ ఎంటర్‌టైన్‍మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్‌ను స్థాపించాడు. ఈ బ్యానర్ కింద తొలి చిత్రంగా ఎల్‍జీఎం (లెట్స్ గెట్ మ్యారీడ్)ను నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమంలో జరిగింది. ఈ ఈవెంట్‍లో ధోనీ పాల్గొన్నాడు. కాగా, ఈ ఈవెంట్‍కు సంబంధించిన ఓ వీడియో తాజాగా వైరల్‍గా మారింది.

ఎల్‍జీఎం ఆడియో లాంచ్ ఈవెంట్‍లో ఎంఎస్ ధోనీ, ప్రముఖ కమెడియన్ యోగిబాబు కలిసి కేక్ చేశారు. అయితే, యోగిబాబు.. ధోనీకి కేక్ తినిపించాలని అనుకున్నాడు. అయితే, అంతలోనే మహీ కేక్ ముక్కను తీసుకొని తినేశాడు. యోగిబాబును ఆటపట్టించాడు. ఆ సమయంలో ధోనీవైపు యోగిబాబు ఓ లుక్ ఇచ్చాడు. “నేను తినిపించేలోపే తినేశావా” అన్నట్టు యోగిబాబు ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. దీంతో ధోనీ ఒక్కసారిగా నవ్వాడు. ఆ తర్వాత ధోనీ, యోగిబాబు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

ధోనీ సంప్లిసిటీని, అందరితో సరదాగా ఉండే వైఖరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తనను తీసుకోవాలని ఆడియో లాంచ్ ఈవెంట్ తర్వాత యోగిబాబు అడగగా.. ధోనీ సరదాగా స్పందించాడు. “అంబటి రాయుడు రిటైర్ అవుతున్నాడు. నీ విషయంపై మేనేజ్‍మెంట్‍ను అడుగుతా. కానీ నువ్వు సినిమాల్లో బిజీగా ఉంటావు. ఇప్పుడే చెబుతున్నా..రెగ్యూలర్‌గా ఆడాల్సి ఉంటుంది. వాళ్లు వేగంగా బౌలింగ్ చేస్తారు. నీకు గాయమయ్యే విధంగా బౌలింగ్ వేస్తారు” అని యోగిబాబుతో సరదాగా అన్నాడు ధోనీ.

హరీశ్ కల్యాణ్, ఇవానా నటించి ఎల్‍జీఎం చిత్రం త్వరలోనే తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. జూలై 10న ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. రమేశ్ తమిళ్‍మణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

కాగా, ఈ ఏడాది ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజేతగా నిలిపాడు కెప్టెన్ ఎంఎస్ ధోనీ. సీఎస్‍కేకు ఐదో టైటిల్ అందించాడు. ఇటీవలే తన 42వ పుట్టిన రోజును జరుపుకున్నాడు.

తదుపరి వ్యాసం