DC vs CSK | చెన్నై 'సూపర్' కింగ్స్.. చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్
08 May 2022, 23:16 IST
- కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెచ్చిపోయి ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో పూర్తి ఆధిపత్యం చెలాయించి ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది.
ఢిల్లీని చిత్తు చేసిన సూపర్ కింగ్స్
ముంబై: ఐపీఎల్ 2022లో తొలిసారి డిఫెండింగ్ ఛాంపియన్స్‌లా ఆడిన చెన్నై.. ఢిల్లీపై సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్.. బౌలింగ్‌లో మొయిన్ అలీ చెలరేగడంతో క్యాపిటల్స్‌ను ఏకంగా 91 రన్స్ తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 17.4 ఓవర్లలో 117 పరుగులకే చేతులెత్తేసింది. 3 వికెట్లతో మొయిన్ అలీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8వ స్థానానికి చేరింది. అంతేకాదు ఈ భారీ విజయంతో తొలిసారి ఆ టీమ్ నెట్‌రన్‌రేట్ పాజిటివ్‌లోకి వచ్చింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలోనే కొనసాగుతున్నా.. తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏ దశలోనూ టార్గెట్ చేజ్ చేసేలా కనిపించలేదు. రెండో ఓవర్లో మొదలైన వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. పృథ్వి షా లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని కేఎస్ భరత్ (8) సద్వినియోగం చేసుకోలేదు. రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది ఊపు మీద కనిపించినా.. అదే ఓవర్లో ఔటయ్యాడు.
ఇక అక్కడి నుంచీ ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. డేవిడ్ వార్నర్ (19)ను తీక్షణ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయగా.. కాసేపు మెరుపులు మెరిపించిన కెప్టెన్ రిషబ్ పంత్ (21), మిచెల్ మార్ష్ (25) కీలకమైన సమయంలో ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు మొయిన్ అలీ. వీళ్లిద్దరితోపాటు రిపల్ పటేల్ (6) వికెట్ కూడా తీశాడు. మొత్తంగా మొయిన్ అలీ 4 ఓవర్లలో కేవలం 13 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.
దంచికొట్టిన సూపర్ కింగ్స్
అంతకుముందు చెన్నై బ్యాట్ తోనూ చెలరేగింది. మొదట్లో ఆ టీమ్ ఓపెనర్లు.. చివర్లో ధోనీ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 రన్స్ చేసింది. ఓపెనర్ కాన్వే మెరుపు హాఫ్ సెంచరీకితోడు.. రుతురాజ్ గైక్వాడ్, శివమ్‌దూబె, ధోనీ దూకుడైన ఆటతో చెన్నైకి భారీ స్కోరు అందించారు. కాన్వే 87 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గైక్వాడ్ 41, దూబె 32 రన్స్ చేశారు. ధోనీ 8 బాల్స్‌లో 21 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. చెన్నై బ్యాటర్ల ధాటికి ఢిల్లీ బౌలర్ కుల్‌దీప్ 3 ఓవర్లలోనే 43 రన్స్ సమర్పించుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ మరోసారి కళ్లు చెదిరే ఆరంభం ఇచ్చారు. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌కు ఏకంగా 182 రన్స్ జోడించిన ఈ ఇద్దరూ.. ఢిల్లీతో మ్యాచ్‌లోనూ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు. ఇద్దరూ పోటీ పడి బౌండరీలు బాదారు. ముఖ్యంగా కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కుల్‌దీప్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకున్న కాన్వే.. అతడు వేసిన తొలి ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్.. రెండో ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 27 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కూడా 33 బాల్స్‌లోనే 41 రన్స్ చేశాడు. వీళ్లు 11 ఓవర్లలోనే 110 పరుగులు జోడించారు. చివరికి వీళ్ల జోడీని నోక్యా విడదీశాడు.
ఆ తర్వాత కూడా కాన్వే జోరు కొనసాగింది. వన్‌డౌన్‌లో వచ్చిన దూబెతో కలిసి చెన్నై స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 85 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన అతడు.. ఈసారి సెంచరీ చేస్తాడనుకున్నా.. 49 బాల్స్‌లో 87 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. శివమ్ దూబెతో కలిసి కాన్వే రెండో వికెట్‌కు 59 రన్స్ జోడించాడు.
టాపిక్