Wimbledon: చరిత్ర సృష్టించిన వొంద్రొసోవా.. వింబుల్డన్ టైటిల్ కైవసం.. భారీ ప్రైజ్‍మనీ
15 July 2023, 21:16 IST
- Wimbledon - Marketa Vondrousova: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‍ను మార్కెటా వొంద్రొసోవా కైవసం చేసుకుంది. ఫైనల్‍లో ఓన్స్ జబెర్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది.
మార్కెటా వొంద్రొసోవా
Wimbledon - Marketa Vondrousova: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‍స్లామ్ టోర్నీలో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మార్కెటా వొంద్రొసోవా చరిత్ర సృష్టించింది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి అన్‍సీడెడ్ ప్లేయర్‌గా రికార్డు సాధించింది. లండన్‍లో శనివారం జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో వొంద్రొసోవా 6-4, 6-4 తేడాతో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఓన్స్ జబెర్(తునిషియా)ను ఓడించింది. దీంతో తన కెరీర్లో తొలి గ్లాండ్‍స్లామ్ టైటిల్‍ను వొంద్రొసోవా కైవసం చేసుకుంది. 42వ ర్యాంకులో ఉంటూ అన్‍సీడెడ్‍గా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. ఏకంగా వింబుల్డన్ టైటిల్‍నే కైవసం చేసుకుంది. వింబుల్డన్ విజేతగా నిలిచిన 24ఏళ్ల వొంద్రొసోవా.. టైటిల్‍తో పాటు 2.35 మిలియన్ యూరోల (సుమారు రూ.25కోట్లు) ప్రైజ్‍మనీని సొంతం చేసుకుంది. మ్యాచ్ ఎలా సాగిందంటే..
వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఆరంభంలో జబెర్ పైచేయి సాధించింది. తొలి సెట్‍లో రెండు గేమ్‍లు గెలిచింది. అయితే, వెంటనే మార్కెటా వొంద్రొసోవా పుంజుకుంది. స్లో స్లైస్‍లు, అద్భుతమైన యాంగిళ్లతో బంతిని బాదింది. అద్భుతంగా ఆడింది. జబెర్ మళ్లీ పుంజుకున్నా.. మార్కెటా మరోసారి విజృంభించింది. తొలి సెట్‍ను 6-4తో కైవసం చేసుకుంది.
రెండో సెట్‍లో వొంద్రొసోవా, జబెర్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఓ దశలో సెట్ 3-3కు వచ్చింది. ఆ తరుణంలో జబెర్ ఓ గేమ్ గెలిచి ముందంజ వేసింది. అయితే, ఆ తర్వాత మార్కెటా వొంద్రొసోవా విజృంభించింది. దూకుడుగా ఆడింది. ఇక ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. జబెర్ సర్వీస్‍ను కూడా చెక్ ప్లేయర్ బ్రేక్ చేసింది. రెండో సెట్‍ను కూడా 6-4తో కైవసం చేసుకొని.. మ్యాచ్ గెలిచింది వొంద్రొసోవా. జబెర్‌కు షాకిచ్చి.. టైటిల్ ఎగరేసుకుపోయింది. కాగా, ఈ మ్యాచ్ మొత్తం మీద ఒకే ఏస్ (జబెర్) నమోదైంది. ప్రత్యర్థి సర్వీస్‍ను వొంద్రొసోవా ఆరుసార్లు బ్రేక్ చేసి ఆధిపత్యం చెలాయించింది.
2022 వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్‍లోనూ ఓన్స్ జబెర్.. రిబకినా చేతిలో ఓడి రన్నరప్‍గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు ఏకంగా అన్‍సీడెడ్ వొంద్రొసోవా చేతిలో ఓడి తన గ్రాండ్‍స్లామ్ కలను జబెర్ మరోసారి చేజార్చుకుంది.