Mark Boucher Quits as Head Coach: సౌతాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ రాజీనామా.. షాక్‌లో ప్రొటీస్
13 September 2022, 7:11 IST
- Mark Boucher Resign As Head coach: సౌతాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తాను ఆ పదవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత తాను వైదొలుగుతానని ముందుగానే ప్రకటించారు.
మార్క్ బౌచర్
Mark Boucher to quit as South Africa Head Coach: టీ20 వరల్డ్ కప్ ముంందు దక్షిణాఫ్రికా జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ఆ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే తక్షణమే తాను తప్పుకోవడం లేదని, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్ పదవీ నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(CSA) సోమవారం నాడు రాత్రి ప్రకటించింది. డిసెంబరు 2019 నుంచి దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌గా బౌచర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కోచింగ్‌లో సఫారీ జట్టు 11 టెస్టుల్లో విజయం సాధించింది. ఇందులో ఈ ఏడాది టీమిండియాతో జరిగిన 3 టెస్టుల సిరీస్(2-1) విజయం కూడా ఉంది.
"మార్క్ బౌచర్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన భవిష్యత్తు కెరీర్‌కు సంబంధించిన అవకాశాలతో పాటు, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బౌచర్ .తన కాంట్రాక్ట్ గడువును ముగియకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల క్రికెట్ సౌతాఫ్రికా బాధపడుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. ఆయనకు భవిష్యత్తులో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాం." అంటూ క్రికెట్ సౌతాఫ్రికా స్పష్టం చేసింది.
సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో ఉంది. ఇక పరిమిత ఓవర్లలో బౌచర్ హయాంలో 12 వన్డేలు, 23 టీ20ల్లో విజయం సాధించింది. ఇటీవలే ఇంగ్లాండ్ 2-1 తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు కోచ్‌గా తన చివరి సిరీస్‌ను భారత్‌తో ఆడనున్నారు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 11 వరకు 3 టీ20లు, 3 వన్డేల్లో ఇరుజట్లు పోటీ పడనున్నాయి. అనంతరం ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‍లో సౌతాఫ్రికా ఆడుతుంది. ఆ తర్వాత ఆయన తప్పుకోనున్నారు. టీ20 ప్రపంచకప్ అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు జరగనుంది.
మార్క్ బౌచర్ వైదొలగడంపై సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రతినిధి ఫోలెటి మోసెకి స్పందించారు. గత మూడేళ్లుగా దక్షిణాఫ్రికా క్రికెట్‌కు తన సేవలందించిన బౌచర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చాలా మంది సీనియర్ ఆటగాళ్ల నిష్క్రమణ తర్వాత కొన్ని కఠినమైన పరిస్థితుల్లో సౌతాఫ్రికా జట్టును ముందుండి నడిపించారని స్పష్టం చేశారు. అంతేకాకుండా జట్టులో కొన్ని బలమైన పునాదులు వేశారని తెలిపారు.