Manika Batra Record: ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా
18 November 2022, 18:53 IST
- Manika Batra Record: ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా రికార్డు సృష్టించింది. ఆమె ఐటీటీఎఫ్-ఏటీటీయూ ఏషియన్ కప్ వుమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచింది.
మనికా బాత్రా
Manika Batra Record: స్టార్ ఇండియన్ పెడ్లర్ మనికా బాత్రా శుక్రవారం (నవంబర్ 18) ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆమె ఐటీటీఎఫ్-ఏటీటీయూ ఏషియన్ కప్ సెమీస్‌లో అడుగుపెట్టింది. గతంలో ఏ ఇండియన్ వుమన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌కూ సాధ్యం కాని రికార్డు ఇది. క్వార్టర్‌ఫైనల్స్‌లో మనికా.. 6-11, 11-6, 11-5, 11-7, 8-11, 9-11, 11-9 తేడాతో తైపీకి చెందిన చెన్ సు యుపై పోరాడి గెలిచింది.
మనికా ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉంది. అలాంటి ప్లేయర్ ఈ టోర్నీ సెమీస్ చేరిన తొలి ఇండియన్ మహిళగా నిలవడం విశేషం. అంతేకాదు చేతన్ బబూర్ తర్వాత ఈ టోర్నీ సెమీస్ చేరిన రెండో ఇండియన్‌గా కూడా నిలిచింది. తొలి సెట్ ఓడిపోయినా.. తర్వాత పుంజుకున్న మనికా వరుసగా మూడు సెట్లు గెలిచింది.
అయితే తర్వాతి రెండు సెట్లు ఓడిపోవడంతో 3-3 తో మ్యాచ్ సమమైంది. నిర్ణయాత్మక ఏడో సెట్ కూడా హోరాహోరీగానే సాగింది. చివరికి మనికానే 11-9తో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. తన కన్నా ర్యాంకింగ్స్‌లో ఎంతో ముందున్న సు యు (23)పై మనికా పోరాడి గెలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి.
అంతకుముందు ప్రీ క్వార్టర్స్‌లోనూ వరల్డ్ నంబర్ 7 అయిన జింగ్‌టాంగ్‌పై కూడా గెలిచి మనికా సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో మనికా 8-11, 11-9, 11-6, 9-11, 8-11, 11-9 తేడాతో విజయం సాధించింది. తన కెరీర్‌లో మనికా ఓడించిన మూడో చైనీస్ ప్రత్యర్థి జింగ్‌టాంగ్.
వరల్డ్ నంబర్ 7ను ఓడించడం చాలా సంతోషంగా ఉందని, తర్వాతి రౌండ్లలోనూ ఇదే పోరాటాన్ని కొనసాగిస్తానని అప్పుడే ఆమె ట్వీట్ చేసింది. చెప్పినట్లే క్వార్టర్‌ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్ 23కి షాకిచ్చింది.
టాపిక్