Major League Cricket 2023: మేజర్ లీగ్ క్రికెట్ షురూ - ఫస్ట్ మ్యాచ్‌లోనే దంచికొట్టిన కాన్వే, రసెల్
14 July 2023, 13:14 IST
Major League Cricket 2023: మేజర్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ గురువారం మొదలైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో లాస్ ఎంజిలాస్ నైట్ రైడర్స్‌పై 69 పరుగులు తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని సాధించింది.
మేజర్ లీగ్ క్రికెట్ 2023
Major League Cricket 2023: మేజర్ లీగ్ క్రికెట్ సమరం మొదలైంది. ఈ లీగ్ కోసం ఇంటర్నేషనల్ టీ20 స్పెషలిస్ట్‌లు రంగంలోకి దిగారు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో గురువారం టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఎంజిలాస్ నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో లాస్ ఎంజిలాస్ నైట్ రైడర్స్‌పై టెక్సాస్ సూపర్ కింగ్స్ 69 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో రాణించిన న్యూజిలాండ్ ప్లేయర్ డేవాన్ కాన్వే మేజర్ లీగ్ క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 37 బాల్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 రన్స్ చేశాడు. మిల్లర్ 42 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 61 రన్స్‌తో రాణించడంతో టెక్సాస్ సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది.
182 పరుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేపట్టిన లాస్ ఎంజిలాస్ నైట్ రైడర్స్ 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రసెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. 34 బాల్స్‌లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 రన్స్ చేశాడు. అతడికి ఇండియన్ ఆటగాడు జస్కరణ్ మల్హోత్రా 11 బాల్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 రన్స్‌తో సహకారం అందించాడు.
ధాటిగా ఆడుతోన్న క్రమంలో రసెల్, మల్హోత్రా ఔట్ కావడంతో లాస్ ఎంజిలాస్ నైట్ రైడర్స్ జట్టు ఓటమి ఖాయమైంది. లాస్ ఎంజిలాస్ ఓపెనర్‌గా బరిలో దిగిన ఇండియా ఆటగాడు ఉన్ముక్త్ చంద్ నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. లాస్ ఎంజిలాస్ టీమ్‌లో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.
టాపిక్