Krunal Pandya: కౌంటీ క్రికెట్ ఆడనున్న కృనాల్ పాండ్యా
01 July 2022, 15:57 IST
- Krunal Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఈ ఏడాది రాయల్ లండన్ కప్‌లో ఆడటానికి అతడు వెళ్తున్నాడు.
కృనాల్ పాండ్యా
న్యూఢిల్లీ: ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కౌంటీ క్రికెట్ వైపు చూస్తున్నాడు. అతడు వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ టీమ్ తరఫున ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్ అయిన రాయల్ లండన్ కప్‌లో ఆడనున్నాడు. కృనాల్ తమ్ముడు హార్దిక్ పాండ్యా ఐపీఎల్ తర్వాత మళ్లీ టీమిండియాలోకి వచ్చి ఈ మధ్యే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్ కూడా అయిన విషయం తెలిసిందే.
కౌంటీ క్రికెట్ ఆడటం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కృనాల్ అన్నాడు. అతడు ఆడుతున్న క్లబ్ వార్విక్‌షైర్‌కు హోమ్‌గ్రౌండ్ ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్‌కు ఆతిథ్యమిస్తున్న ఎడ్జ్‌బాస్టన్. ఈ గ్రౌండ్‌లో ఆడటం చాలా స్పెషల్ అని, ఇది తన హోమ్‌గ్రౌండ్ అని చెప్పుకోవడం బాగుందని కృనాల్ పాండ్యా అన్నాడు.
తనకు ఈ అవకాశం ఇచ్చిన వార్విక్‌షైర్ క్లబ్, బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పాడు. 50 ఓవర్ల టోర్నీలో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది ఆగస్ట్ 2 నుంచి 23 మధ్య ఈ రాయల్ లండన్ కప్ జరగనుంది. ఇందులో భాగంగా వార్విక్‌షైర్ 8 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. అందులో నాలుగు హోమ్‌గ్రౌండ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతాయి.
అటు కృనాల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు క్లబ్ సీఈవో ఫార్‌బ్రేస్. కృనాల్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ తమకు ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. కృనాల్ పాండ్యా టీమిండియా తరఫున 19 టీ20లు, ఐదు వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున చాలా సీజన్లు ఆడిన కృనాల్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.