India vs Hong Kong: పాక్‌తో మ్యాచ్‌లో పంత్‌ను తీసుకోకపోవడంపై జడ్డూ స్పందన.. అదిరే రిప్లయి ఇచ్చిన క్రికెటర్
31 August 2022, 12:13 IST
- India vs Hong Kong: భారత్-హాంకాంగ్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా మీడియాతో మాట్లాడాడు. ఇందులో భాగంగా పాక్‌తో మ్యాచ్‌లో పంత్ ఆడకపోవడానికి గల కారణాన్ని వివరించారు.
జడేజా
Jadeja answers why Pant not Play Against Pakistan: ఆసియా కప్‌లో తన తొలి మ్యాచ్ టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుని టోర్నీని ఘనంగా ఆరంభించింది. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్‌కు చోటివ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌కు అవకాశం కల్పించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. మ్యాచ్ అనంతరం ఇదే ప్రశ్న పదే పదే అడుగుతున్నారు. తాజాగా రవీంద్ర జడేజాను కూడా విలేకరులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. హాంకాంగ్‌తో మ్యాచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడిని పంత్ జట్టులో లేకపోవడాన్ని ప్రశ్నించారు. ఇందుకు జడ్డూ కూడా తెలివిగా తప్పించుకున్నాడు.
పాక్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో పంత్ లేకపోవడంపై జడేజాను ప్రశ్నించగా.. అతడు ఈ విధంగా స్పందించాడు. "ఈ విషయం గురించి నాకు అస్సలు తెలియదు. ఈ ప్రశ్న నాకు సంబంధించింది కాదు" అని జడేజా సమాధానమిచ్చాడు. బుధవారం నాడు హాంకాంగ్‌తో మ్యాచ్ గురించి మాట్లాడిన జడ్డూ.. జట్టుగా బెస్ట్‌గా ఇవ్వడానికే ప్రయత్నిస్తామని స్పష్టం చేశాడు.
"కచ్చితంగా మేము పాజిటివ్ మైండ్ సెట్‌తోనే మైదానంలో అడుగుపెడతాం. ఈ మ్యాచ్‌ను మేము అంత తేలికగా తీసుకోము. ఎందుకంటే టీ20ల్లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. పాజిటివ్ మైండ్‌సెట్‌తో క్రికెట్ ఆడతాం." అని జడేజా తెలిపాడు.
చివరి సారిగా భారత్.. హాంకాంగ్‌తో 2018లో ఆసియా కప్‌లోనే తలపడింది. ఆ మ్యాచ్‌లో ధోనీ విఫలం కావడంతో టీమిండియా ఆరంభంలో అదిరపోయే ఆరంభం ఇచ్చినప్పటికీ.. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనలో హాంకాంగ్ 8 వికెట్లు నష్టపోయి 259 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు నిజకత్ ఖాన్(92), అన్షుమాన్ రత్(73) 174 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయంపై ఆశలు రేపారు. అయితే అనంతరం యజువేంద్ర చాహల్, ఖలీల్ అహ్మద్ మెరుగైన ప్రదర్శన చేయడంతో 8 వికెట్ల నష్టానికి 259 పరుగులకే పరిమితమయ్యారు.